Bypoll Results : Tripura లో కాంగ్రెస్, బీజేపీ మద్దతుదారుల ఘర్షణ.. పీసీసీ చీఫ్ సహా 19 మందికి గాయాలు

ABN , First Publish Date - 2022-06-27T01:51:35+05:30 IST

ఈశాన్య రాష్ట్రం త్రిపుర(Tripura)లో వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు(Bypoll Results) పార్టీ శ్రేణుల మధ్య చిచ్చుపెట్టాయి. 4 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా బీజేపీ(BJP) 3, కాంగ్రెస్(Congress) 1 సీట్లను గెలుచుకున్నాయి.

Bypoll Results : Tripura లో కాంగ్రెస్, బీజేపీ మద్దతుదారుల ఘర్షణ.. పీసీసీ చీఫ్ సహా 19 మందికి గాయాలు

అగర్తలా : ఈశాన్య రాష్ట్రం త్రిపుర(Tripura)లో వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు(Bypoll Results) కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య చిచ్చుపెట్టాయి. 4 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా బీజేపీ(BJP) 3, కాంగ్రెస్(Congress) 1 సీట్లను గెలుచుకున్నాయి. అయితే ఫలితాలు వెలువడ్డాక ఇరు పార్టీల మద్దతుదారుల(Supporters) మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అగర్తలా(Agartala)లోని కాంగ్రెస్ భవన్(Congress bhavan) ముందు ఇరుపార్టీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో త్రిపుర పీసీసీ(PCC) చీఫ్ బిరాజిత్ సిన్హా(Birajit Sinha) సహా మొత్తం 19 మంది గాయపడ్డారు. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. సమూహాన్ని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. దీంతో కాంగ్రెస్ భవన్ ఉన్న పోస్ట్ ఆఫీస్ చౌముహని ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. కాగా ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ఆస్పత్రిపాలయ్యారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదన్నారు. ఒక బీజేపీ కార్యకర్తకు తలకు గాయమైందని తెలిపారు.


అసలేం జరిగింది?

అగర్తల అసెంబ్లీ సీటులో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి సుదీప్ రాయ్ బర్మాన్(Sudeep roy barman) మధ్యాహ్నం 1 గంట సమయంలో పార్టీ శ్రేణులతో కలిసి ఊరేగింపుగా  కాంగ్రెస్ భవన్‌ చేరుకున్నారు. అందరూ మధ్యాహ్న భోజనానికి సిద్ధమవుతున్న సమయంలో బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ భవన్ వద్దకు చేరుకున్నారు. త్రిపుర పీసీసీ ప్రెసిడెంట్‌పై బీజేపీ కార్యకర్తలు ఇటుకలతో దాడి చేశారు. ఓ కాంగ్రెస్ కార్యకర్తను పొడిచారని కాంగ్రెస్ మీడియా ఇన్‌చార్జీ ఆశిష్ కుమార్ సాహా తెలిపారు. యువ మోర్చా సారధ్యంలోని బీజేపీ మద్దతుదారులు కాంగ్రెస్ భవన్‌పై ఇటుకలతో దాడి చేశారు. కార్యాలయం ముందు పార్కింగ్ చేసిన వాహనాలను ధ్వంసం చేశారని వివరించారు. దాడి జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదన్నారు.


ఈ ఘటనపై బీజేపీ నేత, త్రిపుర సమాచార, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుశాంత చౌదరి స్పందించారు. కాంగ్రెస్ మద్దతుదారులే ఈ ఘటనకు కారణమన్నారు. అగర్తలా మునిసిపల్ కార్పొరేషన్(ఏఎంసీ) బీజేపీ కార్పొరేటర్‌ షిల్పి సేన్‌పై తొలుత ఇటుకలు విసిరింది కాంగ్రెస్ కార్యకర్తలేనన్నారు. బీజేపీ శ్రేణుల ఆగ్రహానికి ఇదే కారణమన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలో జరిగిన ఈ దాడిలో తమ పార్టీకి చెందిన ఆరుగురు గాయపడ్డారన్నారు. ఉప ఎన్నికల్లో కేవలం 1 సీటు మాత్రమే గెలుచుకోవడంతో ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. సీపీఐ(ఎం)తో కలిసి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కలగంటోందని ఎద్దేవా చేశారు.

Updated Date - 2022-06-27T01:51:35+05:30 IST