గీత దాటొద్దు.. చేటు తేవొద్దు..!

ABN , First Publish Date - 2020-03-31T10:15:12+05:30 IST

కరోనా కారణంగా లాక్‌డౌన్‌ నేపధ్యంలో పేదలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉచిత బియ్యం, కందిపప్పు

గీత దాటొద్దు.. చేటు తేవొద్దు..!

బియ్యం పంపిణీలో రెండో రోజూ అదే తీరు

నగరంలో పాటించని సామాజిక దూరం

టూటౌన్‌ ఏరియాలో లబ్ధిదారుల మధ్య తోపులాట

టోకన్లు ఇచ్చినా దుకాణాల వద్ద రద్దీ

కొన్ని వార్డుల్లో కుర్చీలు వేసి కూర్చోబెట్టిన డీలర్లు


కడప, మార్చి 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరోనా కారణంగా లాక్‌డౌన్‌ నేపధ్యంలో పేదలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉచిత బియ్యం, కందిపప్పు పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేషన్‌ దుకాణాలవద్ద సామాజిక దూరం పాటించాలని పదే పదే చెబుతున్నా కార్డుదారులు పెడచెవిన పెడుతున్నారు. తొలిరోజు రద్దీ కనిపించింది. రెండో రోజు కూడా వార్డు వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, డీలర్లు కొందరు పట్టించుకోకపోవడంతో టూటౌన్‌ ఏరియాలో బియ్యం కోసం తోపులాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


రద్దీ.. తోపులాట..

ఆదివారం నుంచి ఉచిత బియ్యం, కందిపప్పు పంపిణీ మొదలైంది. తొలిరోజు ఒకేసారి పెద్ద సంఖ్యలో కార్డుదారులు రావడంతో సామాజిక దూరం పాటించలేదు. సోమవారం నుంచి ప్రతి రేషన్‌ దుకాణం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా పోలీసులు, సచివాలయ సిబ్బంది, వార్డు వలంటీర్లను నియమించి సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తామని జిల్లా అధికారులు పేర్కొన్నారు. కానీ సోమవారం కూడా పెద్ద తేడా కనిపించలేదు. ఉదయం 5 గంటలకే సాయిపేట, అల్మాస్‌పేట తదితర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కార్డుదారులు బియ్యం కోసం రేషన్‌ దుకాణాల వద్దకు చేరుకున్నారు. నేను ముందు.. నేను ముందు అని మహిళలు పోటీ పడడంతో తోపులాట జరిగింది. సామాజిక దూరం పాటించకుండానే వరుసలో నిలబడ్డారు. కడప నగరంలో మాత్రమే కాదు.. బద్వేలు, మైదుకూరు, రైల్వేకోడూరు, రాయచోటి నియోజకవర్గాల్లో కూడా పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. పసిపిల్లలు, వృద్ధులను బయటికి తీసుకురావద్దని పదే పదే చెబుతున్నా కొందరు మహిళలు పసిపిల్లలతో బియ్యం కోసం ప్రజా దుకాణాలకు వచ్చారు.


2.84 లక్షల మందికి బియ్యం పంపిణీ

జిల్లాలో 7.04 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. ఈ నెల 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేస్తారు. తొలిరోజు 1.02 లక్షల రేషన్‌ కార్డుదారులకు పంపిణీ చేశారు. రెండో రోజు 82,650 మందికి కలిపి 1,84,650 మంది రేషన్‌ కార్డుదారులకు బియ్యం, కందిపప్పు ఉచితంగా ఇచ్చారు. 


కూరగాయల మార్కెట్లలో మారని తీరు

ప్రజలకు ఇబ్బంది రాకుండా కూరగాయల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఉదయం 6గంటల నుంచి 11గంటల వరకు పంపిణీ చేపట్టారు. రైతు బజారుతో పాటు మున్సిపల్‌ మైదానంలో ప్రత్యేక టెంట్లు ఏర్పాటు చేసి తాత్కాలిక స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. సామాజిక దూరం పాటించేలా మీటరు దూరంలో గళ్లు ఏర్పాటు చేశారు. జనం గళ్లలో నిలబడకుండా గుంపులు గుంపులుగా కూరగాయల షాపు చుట్టూ చేరి కొనుగోళ్లు చేపట్టారు. గీత దాటవద్దు.. చేటు తేవొద్దు అంటూ అధికారులు హెచ్చరించినా పట్టించుకోకపోవడం కొసమెరుపు.


ప్రతి కార్డుకు బియ్యం ఇస్తాం.:  గౌతమి, జాయింట్‌ కలెక్టరు

జిల్లాలో బియ్యం, కందిపప్పు కొరత లేదు. అవసరమైన మేరకు ప్రజా పంపిణీ దుకాణాల్లో సరఫరా చేశాం. 7.04 లక్షల రేషన్‌ కార్డుదారులకు టోకన్ల ప్రకారం బియ్యం, కందిపప్పు ఇస్తాం. తొందరపడాల్సిన అవసరం లేదు. ఈ నెల 15వ తేదీ వరకు పంపిణీ జరుగుతుంది. ఉదయం 6గంటల నుంచి దుకాణాలు పనిచేస్తాయి. బియ్యం రావేమోనని ఆతృతతో కార్డుదారులు గుంపులు గుంపులుగా చేరి సామాజిక దూరం పాటించకపోవడం సరైనది కాదు. కరోనా వ్యాప్తిని నిరోధించాలంటే సామాజిక దూరం పాటించాల్సిన అవసరం ఉంది. దండం పెట్టి చెబుతున్నా.. సామాజిక దూరం పాటిద్దాం... కరోనాను కట్టడి చేద్దాం.. 


Updated Date - 2020-03-31T10:15:12+05:30 IST