డిప్యుటేషన్లతో గందరగోళం

ABN , First Publish Date - 2022-08-12T04:49:54+05:30 IST

డిప్యుటేషన్‌ విధానం వలన మునిసిపాలిటీల్లో గందరగోళం నెలకొంటోంది. అవసరమైన ఉద్యోగి లేకపోవడంతో అనేక పనులు మూలకు పడుతున్నాయి.

డిప్యుటేషన్లతో గందరగోళం
డీఈ లేకపోవడంతో ఖాళీగా ఉన్న కుర్చీ

- వనపర్తి మునిసిపాలిటీలో కొనసాగుతున్న డిప్యుటేషన్ల పరంపర

- అధికారుల విధులు ఒకచోట, వేతనం మరోచోట

- ప్రజలకు తప్పని తిప్పలు

- ఎక్కడి పనులు అక్కడే


వనపర్తి టౌన్‌, ఆగస్టు 11: డిప్యుటేషన్‌ విధానం వలన మునిసిపాలిటీల్లో గందరగోళం నెలకొంటోంది. అవసరమైన ఉద్యోగి లేకపోవడంతో అనేక పనులు మూలకు పడుతున్నాయి. వనపర్తి జిల్లా కేంద్రం కావడంతో మునిసిపల్‌ కార్యాలయానికి నిత్యం వం దల సంఖ్యలో ప్రజలు వివిధ కారణాలతో వస్తుం టారు. జిల్లాలో ఉన్న ఐదు మునిసిపాలిటీల్లో వన పర్తి ప్రధాన మునిసిపల్‌ కార్యాలయం ఒకటి. ఇక్కడ అన్ని విభాగాలకు చెందిన అధికారులు అందుబాటు లో ఉండాలి. కానీ ఉన్న కొద్దిమంది అధికారులు కూడా డిప్యుటేషన్‌ పుణ్యమా అని తమకు నచ్చిన చోటికి డ్యూటీని మార్చుకొని హాయిగా విధులు నిర్వహిం చుకుంటున్నారు. అందుబాటులో ఉన్న కొందరు అధికారులు డిప్యుటేషన్‌పై వెళ్లడంతో ఉన్నవారిపై పని భారం పడటమే కాకుండా ప్రజలకు తీవ్ర ఇబ్బందు లు ఏర్పడుతున్నాయి. విధులు ఒకచోట చేసుకుంటు, వేతనాలు మరోచోట తీసుకుంటు అధికారులు తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. 

 ప్లాస్టిక్‌పై తనిఖీలు కరువు 

ప్లాస్టిక్‌ను పూర్తిగా తరిమేయాలని ప్రభుత్వం జీవోలను జారీ చేసినప్పటికి అది కాస్తా క్షేత్ర స్థాయిలో పూర్తిగా విఫలమవుతోంది. ప్లాస్లిక్‌పై ని త్యం తనిఖీలు నిర్వహించాల్సిన హెల్త్‌ అసిస్టెంట్లలో ఒక్కరు కూడా వనపర్తి మునిసిపాలిటీలో లేకపోవడంతో ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. ఇక్కడ విధులు నిర్వహించాల్సిన ఇద్దరు హెల్త్‌ అసిస్టెంట్లలో ఒకరు భూత్పూర్‌లో, మరొకరు అచ్చంపేట మునిసిపాలిటీకి డిప్యుటేషన్‌పై వెళ్లారు. దీంతో ప్లాస్టిక్‌పై రైడింగ్‌, హోటళ్లలో తనిఖీలు, సీజనల్‌ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాల్సినటువంటి కార్యక్రమాలు చూద్దామన్నా కన్పించడం లేదు. 

 ఉన్నవారిపై పనిభారం

డిప్యుటేషన్లతో అధికారులు చాలామంది తమకు నచ్చిన చోటికి వెళ్లడంతో కార్యాలయంలో ఉన్నవారిపై పనిభారం పడుతోంది. అంతేకాకుండా, ఒక్కరోజులో కావల్సిన పని కాస్తా వారంరోజులు పడుతోంది. వనపర్తి మునిసిపాలిటీకి ముగ్గురు ఏఈలు ఉండగా ఒకరు అయిజకు డిప్యుటేషన్‌పై వెళ్లిపోవడంతో ఉన్న ఇద్దరు ఏఈలపై పనిభారం పడింది. మరోవైపు డీఈ పోస్టు, టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టౌన్‌ప్లానింగ్‌ అధికారి గద్వాలకు వెళ్లడంతో ఆ స్థానంలో ఇక్కడికి వచ్చిన డిప్యుటేషన్‌ అధికారి కేవలం రెండురోజులే విధులు నిర్వహిస్తు మిగిలిన రోజుల్లో పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూర్‌, అమరచింత మునిసిపాలిటీలలో ఒక్కోరోజు చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. జూనియర్‌ అకౌంటెంట్‌ ఆఫీసర్‌ రెండురోజులు వనపర్తి మునిసిపాలిటీలో, మిగిలిన నాలుగురోజులు వేరే మునిసిపాలిటీలో విధులు నిర్వహిస్తున్నారు. సీనియర్‌ అకౌంటెంట్‌ వారంలో నాలుగురోజులు వనపర్తిలో, మిగిలిన రెండురోజులు వేరే మునిసిపాలిటీలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలా అనేకమంది అధికారులు డిప్యుటేషన్‌ వల్ల అందుబాటులో లేకపోవడంతో ఒకపక్క అధికారులకు, మరోపక్క ప్రజలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడు తున్నాయి. 



Updated Date - 2022-08-12T04:49:54+05:30 IST