టెట్‌ అభ్యర్థులకు.. పరీక్షే!

ABN , First Publish Date - 2022-07-29T05:46:19+05:30 IST

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) కేంద్రాల కేటాయింపులో గందరగోళం నెలకొంది. సుదూర ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను కేటాయించడంతో అభ్యర్థులు అయోమయం చెందుతున్నారు. వచ్చే నెల ఆరో తేదీ నుంచి 21 వరకు టెట్‌ నిర్వహించనున్నారు. జిల్లాలో సుమారు 15 వేలమంది వరకు టెట్‌కు దరఖాస్తు చేసు

టెట్‌ అభ్యర్థులకు.. పరీక్షే!

సుదూర ప్రాంతాల్లో కేంద్రాల కేటాయింపు

అంతటా గందరగోళం

(నరసన్నపేట)

నరసన్నపేట మారుతీనగర్‌కు చెందిన ఈమె పేరు ఎస్‌.లక్ష్మీ. ఈ ఏడాది టెట్‌ రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షా కేంద్రం ఎంపిక కోసం ఆన్‌లైన్‌లో చూడగా.. ప్రకాశం జిల్లాలో మాత్రమే ఖాళీగా ఉన్నట్లు శ్లాట్‌ కనిపించింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో లక్ష్మీ అక్కడ పరీక్ష రాసేందుకు కేంద్రాన్ని ఎంపిక చేసుకున్నారు. 


కోటబొమ్మాళి మండలం తులసీపేటకు చెందిన ఈయన పేరు ఎస్‌.కుమార్‌. ఈయన టెట్‌కు సన్నద్ధమవ్వగా గుంటూరులో పరీక్షా కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో తక్కువ కేంద్రాలను కేటాయించడంతో.. ఇతర జిల్లాలకు వెళ్లకతప్పడం లేదని వాపోతున్నారు. ఏ జిల్లా అభ్యర్థులకు ఆ జిల్లాలోనే పరీక్షా కేంద్రాలు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 


నరసన్నపేట మండలం గడ్డెయ్యపేటకు చెందిన ఈయన పేరు ఎం.రామకృష్ణ ఎస్జీటీ, బీఈడీ పరీక్షలు రాయనున్నారు. బీఈడీకి సంబంధించి జిల్లాలో, ఎస్జీటీ పరీక్ష గుంటూరులో రాసేలా కేంద్రాలు కేటాయించారు.  ఇలా గందరగోళంగా కేంద్రాలు కేటాయించడం వల్ల ఏదో ఒక పరీక్షే రాయగలమని నిట్టూర్చుతున్నారు.


ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) కేంద్రాల కేటాయింపులో గందరగోళం నెలకొంది. సుదూర ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను కేటాయించడంతో అభ్యర్థులు అయోమయం చెందుతున్నారు. వచ్చే నెల ఆరో తేదీ నుంచి 21 వరకు టెట్‌ నిర్వహించనున్నారు. జిల్లాలో సుమారు 15 వేలమంది వరకు టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి విద్యాశాఖ సుదూర ప్రాంతాలు, ఇతర జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను కేటాయించింది. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. 


ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించే పరీక్షలకు కంప్యూటర్‌ ల్యాబ్స్‌ ఉన్న ఇంజనీరింగ్‌ కళాశాలలు, డిజిటల్‌ ల్యాబ్స్‌ మాత్రమే గుర్తించారు. మన జిల్లాలో టెక్కలి, రాజాం, చిలకపాలెం, ఎచ్చెర్లలో మాత్రమే ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించేందుకు సదుపాయాలు ఉన్నాయి. జిల్లా నుంచి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు సరిపడా కేంద్రాలు లేవు.  ఈ నెల 23 నుంచి అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల ఎంపికకు ఆప్షన్‌ ఇచ్చారు.  ముందుగా కేంద్రాలను ఎంపిక చేసుకున్నవారికి జిల్లాలో కేటాయించారు. ఆలస్యమైన అభ్యర్థులకు జిల్లాలో కేంద్రాలు లేకుండా పోయాయి. విశాఖ, విజయనగరం, ఉభయగోదావరి జిల్లాల్లో కూడా పరీక్షా కేంద్రాలు నిండిపోయాయి. దీంతో జిల్లాకు చెందిన అభ్యర్థులకు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలను కేటాయించారు. ఇంకా ఆలస్యంగా నమోదు చేసుకున్నవారికి పొరుగురాష్ట్రాల్లో కేంద్రాలను కేటాయిస్తున్నారు. దీంతో అంత దూరం వెళ్లి పరీక్ష రాయాలా? వద్దా? అని కొంతమంది అభ్యర్థులు సతమతమవుతున్నారు. 


ఉదయం ఇక్కడ.. మధ్యాహ్నం అక్కడ

బీఈడీ అర్హత ఉన్నవారు ఎస్జీటీ, బీఈడీలకు రెండు పరీక్షలు రాయనున్నారు. వీరిలో చాలామందికి ఉదయం 9.30 గంటల నుండి 12.30వరకు జరిగే పరీక్షను శ్రీకాకుళం కేటాయించగా.. మధ్యాహ్నం జరిగే పరీక్షను రాజమండ్రి గైట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో కేటాయించారు. మరికొందరికి గుంటూరులో పరీక్షా కేంద్రాలను కేటాయించారు. జిల్లాలో ఉదయం పరీక్ష రాసి.. మధ్యాహ్నం రాజమండ్రి, గుంటూరులలో పరీక్ష రాసేందుకు వెళ్లడం ఎలా సాధ్యమవుతుందని అభ్యర్థులు పశ్నిస్తున్నారు. రెండు పరీక్షలు రాసేవారికి ఒకే రోజు కాకుండా.. రెండు వేర్వేరు రోజులు కేటాయించాలని కోరుతున్నారు. 


Updated Date - 2022-07-29T05:46:19+05:30 IST