TRS పార్టీలో గందరగోళం.. ప్రజాప్రతినిధులు, నేతల మధ్య విభేదాలు.. KTR నిర్దేశించిన గడువు నేటితో ముగింపు..

ABN , First Publish Date - 2021-09-30T17:07:45+05:30 IST

పార్టీ పటిష్ఠతకు సంస్థాగత నిర్మాణంలో భాగంగా టీఆర్‌ఎస్‌ చేపట్టిన...

TRS పార్టీలో గందరగోళం.. ప్రజాప్రతినిధులు, నేతల మధ్య విభేదాలు.. KTR నిర్దేశించిన గడువు నేటితో ముగింపు..

  • కమిటీలు.. కలహాలు..
  • అధికార పార్టీలో గందరగోళం
  • ప్రజాప్రతినిధులు, నేతల మధ్య విభేదాలు
  • కమిటీల ఎంపిక సాక్షిగా బయటపడుతున్న వైనం
  • కార్పొరేటర్ల వ్యవహార శైలిపై శాసనసభ్యుల అసంతృప్తి
  • 50 శాతం కూడా పూర్తవని వైనం

హైదరాబాద్‌ సిటీ : పార్టీ పటిష్ఠతకు సంస్థాగత నిర్మాణంలో భాగంగా టీఆర్‌ఎస్‌ చేపట్టిన కమిటీల ఎంపిక గ్రేటర్‌లోని పలు నియోజకవర్గాల్లో విభేదాలకు దారి తీస్తోంది. స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్‌ నేతల మధ్య  ఉన్న కోల్డ్‌వార్‌ కమిటీల సాక్షిగా బహిర్గతమవుతోంది. ఎవరికి వారు తమ వర్గానికి ప్రాధాన్యం దక్కాలని పట్టుబడుతున్నా రు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు ఏకపక్షంగా వ్యవహరిస్తుండడంతో పంచాయితీ అగ్రనేతల వద్దకు వెళ్తోంది. పలువురు కార్పొరేటర్లు, మాజీలు టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే తారక రామారావుకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇన్‌చార్జిలుగా నియమించిన రాష్ట్ర స్థాయి నేతలు కొందరు కమిటీల ఎంపికను అంత సీరియస్‌గా తీసుకోవడం లేదని తెలుస్తోంది. పలు నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌‌లు ఒక్క సమావేశం కూడా ఏర్పాటు చేయలేదని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. నెలాఖరుకు కమిటీల ఎంపిక పూర్తి చేయాలని కేటీఆర్‌ నిర్దేశించిన గడువు నేటితో ముగియనుంది.


నియోజకవర్గాల్లో ఇదీ పరిస్థితి

- ముషీరాబాద్‌ నియోజకవర్గంలో పార్టీ ఇన్‌చార్జి సమక్షంలో అన్ని డివిజన్లకు సంబంధించిన సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌కు పలువురు మాజీ కార్పొరేటర్లు హాజరు కాలేదని సమాచారం. డివిజన్‌ కమిటీల ఎంపికలోనూ స్థానిక ఎమ్మెల్యే, పలువురు మాజీల మధ్య భిన్నాభిప్రాయాలున్నట్టు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఆధిపత్యం కోసం ఎవరికి వారు పట్టు విడవడం లేదంటున్నాయి.


- ఖైరతాబాద్‌ నియోజకవర్గం పరిధిలో ఆరు డివిజన్లు ఉండగా, రెండు చోట్ల డివిజన్‌ కమిటీల ఎంపిక పూర్తయినట్టు తెలిసింది. మరో మూడు చోట్ల స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. నేడు జరిగే సమావేశంలో ఓ డివిజన్‌ కమిటీ ఎంపిక జరిగే అవకాశముందని ఓ నాయకుడు తెలిపారు. మరో రెండు డివిజన్లలో ఇరు వర్గాలు పట్టువీడకపోవడంతో ఏం జరుగుతుందో అన్న సస్పెన్స్‌ కొనసాగుతోంది. 


- అంబర్‌పేట అసెంబ్లీ పరిధిలో కమిటీల ఎంపిక గందరగోళంగా ఉంది. స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్ల మధ్య సఖ్యత లేదన్న ప్రచారం జరుగుతోంది. బస్తీ కమిటీల వివరాలను ఎమ్మెల్యేకు కొందరు ఇప్పటికే అందించినట్టు తెలిసింది. డివిజన్‌ కమిటీ ఎంపికకు సంబంధించి కార్పొరేటర్లు, మాజీల అభిప్రాయం తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. పార్టీ ఇన్‌చార్జి సమక్షంలో నియోజకవర్గ సమావేశం కూడా జరగలేదంటున్నారు.


- ఉప్పల్‌ నియోజకవర్గంలో కూడా కొన్ని డివిజన్‌ కమిటీల ఎంపికపై పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు సూచించిన వారికి కమిటీల్లో అవకాశం కల్పించలేదని తెలుస్తోంది. పలు డివిజన్ల కమిటీలు ఏకపక్షంగా ఎంపిక చేశారని చెబుతున్నారు.


ఇప్పటి వరకు గ్రేటర్‌లోని దాదాపు 50 శాతం నియోజకవర్గాల్లో డివిజన్‌ స్థా యి కమిటీల ఎంపిక పూర్తి కాలేదని చెబుతున్నారు. బస్తీ, అనుబంధ కమిటీలను మెజార్టీ చోట్ల ఎంపిక చేయగా, డివిజన్‌ కమిటీల విషయానికి వచ్చే సరికి కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. క్రియాశీల సభ్యులై ఉండి, పార్టీలో దీర్ఘకాలికంగా, అంకితభావంతో పనిచేసే వారికి అవకాశం కల్పించాలని కేటీఆర్‌ సమావేశాల్లో సూచించారు. కార్పొరేటర్లు, మాజీలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, సీనియర్‌ నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు. కొన్నిచోట్ల క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. డివిజన్‌, నియోజకవర్గ స్థాయిలో కొన్ని చోట్ల టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల మధ్య అగ్గి రాజుకుంటోంది. చాలా ప్రాంతాల్లో ఉద్యమకారులకు అన్యా యం జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


- కుత్బుల్లాపుర్‌ నియోజకవర్గంలో డివిజన్‌ కమిటీల ఎంపికపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఏకపక్షంగా వ్యవహరించి కార్పొరేటర్లు, సీనియర్‌ నేతల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోలేదని చెబుతున్నారు. ఉద్యమకారులకు అన్యాయం చేస్తారా..? అన్న ప్రశ్నలు తలెత్తడంతో ప్రగతినగర్‌ కమిటీ ఎంపిక వాయిదా వేశారు.


- ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలో బస్తీ కమిటీల ఎంపిక జరగగా, డివిజన్‌ కమిటీల ఎంపిక ప్రక్రియ ఇంకా పూర్తవలేదని తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే, కొందరు మాజీ కార్పొరేటర్ల మధ్య సఖ్యత లేని నేపథ్యంలో కమిటీల ఎంపిక ఎలా జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఆది నుంచి పార్టీలో ఉన్న వారికి అవకాశం దక్కుతుందా, మాజీల అనుచరులకా, ఎమ్మెల్యే వర్గీయులకా..? అనేది చూడాలి. 


- మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు ప్రాతినిధ్యం వహిస్తోన్న సనత్‌నగర్‌, సికింద్రాబాద్‌ నియోజకవర్గాల్లో బస్తీ, డివిజన్‌ కమిటీల ఎంపిక సాఫీగానే సాగుతోంది. స్థానిక కార్పొరేటర్లు, మాజీలు, సీనియర్‌ నాయకులతో సత్సంబంధాలున్న వారిరువురు ఏకాభిప్రాయంతోనే నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోనూ కమిటీల ఎంపిక పూర్తయినట్టు చెబుతున్నారు.

Updated Date - 2021-09-30T17:07:45+05:30 IST