ఉపాధ్యాయ బదిలీల్లో గందరగోళం

ABN , First Publish Date - 2021-12-28T06:12:33+05:30 IST

ప్రభుత్వ ఉపాధ్యాయులకు జిల్లాల కేటాయింపు గందరగోళంగా మారింది. స్థానికతను ప్రామాణికం తీసుకోవాలని కొంద రు, సీనియారిటీ ఆధారంగా కేటాయింపులు చేయాలని మరికొందరు కోరుతుండటంతో మొత్తం ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది.

ఉపాధ్యాయ బదిలీల్లో గందరగోళం
యాదాద్రి డీఈవో కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులు

సీనియారిటీ ఆధారంగా జిల్లాల కేటాయింపు

స్థానికతను ప్రమాణికంగా తీసుకోవాలని జూనియర్ల డిమాండ్‌

ప్రభుత్వ విధానాలపై మండిపడుతున్న సంఘాలు



సూర్యాపేట, యాదాద్రి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి)/కోదాడ, నల్లగొండ క్రైం : ప్రభుత్వ ఉపాధ్యాయులకు జిల్లాల కేటాయింపు గందరగోళంగా మారింది. స్థానికతను ప్రామాణికం తీసుకోవాలని కొంద రు, సీనియారిటీ ఆధారంగా కేటాయింపులు చేయాలని మరికొందరు కోరుతుండటంతో మొత్తం ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. అసలు ప్రభుత్వ మార్గదర్శకాలే సరిగాలేవని ఉపాధ్యాయ సంఘాలు గుర్రుమంటున్నాయి. జిల్లాలకు కొత్తగా కేటాయించిన వారిని అడ్‌హక్‌(తాత్కాలిక) పద్ధతిన నియమించాలని నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. కాగా, డీఎస్సీలో స్థానికత ఆధారంగా కొలువు పొందారని, దాని ఆధారంగా బదిలీలు చేపడతున్నట్లు ప్రభుత్వం పేర్కొంటోంది.

నల్లగొండ జిల్లాలో పనిచేస్తున్న ఎల్‌ఎ్‌ఫఎల్‌ హెచ్‌ఎంను సూర్యాపేటకు కేటాయించారు. ఆయన ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్నారు. ఆయన భార్య నార్కట్‌పల్లి మండలంలో పనిచేస్తున్నారు. సర్వీసులో ఆయన సీనియర్‌ అయినా, ఎల్‌ఎ్‌ఫఎల్‌ హెచ్‌ఎం సీనియారిటీలో మాత్రం జూనియర్‌. ప్రస్తుత బదిలీలతో ఆయన సూర్యాపేటకు వెళ్లాల్సి రాగా, భార్య మాత్రం నల్లగొండ జిల్లాలో ఉన్నారు.

 సూర్యాపేటలో పనిచేస్తున్న ఓ ఎస్‌ఐ భార్య ఉపాధ్యాయురాలు. ఆమెను నల్లగొండ జిల్లాకు కేటాయించారు. అయితే స్పౌజ్‌ కేటగిరీ కింద భార్య, భర్త ఒకేచోట పనిచేసేలా పోస్టింగ్‌ ఇచ్చేందుకు వీరికోసం ప్రత్యేక కౌన్సిలింగ్‌ నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు.

 నల్లగొండ జిల్లాలో పనిచేస్తున్న స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగు ఉపాధ్యాయురాలు సూర్యాపేట జిల్లాకు ఆప్షన్‌ ఇవ్వగా అధికారులు ఆమెను నల్లగొండ జిల్లాకే కేటాయించారు. సీనియారిటీలో ఆమె వెనుక జూనియర్లను సూర్యాపేటకు కేటాయించారు.

 నల్లగొండ జిల్లా చండూరు మండలంలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలిని యాదాద్రి జిల్లాకు కేటాయించారు. దీంతో మనస్తాపనికి గురై కన్నీరుపెడుతున్న ఆ వీడియో వైరల్‌ అయింది. ఇలాంటి పొరపాట్లను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.


అన్ని ఖాళీలను చూపించని అధికారులు

నూతన జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయిం పు అనంతరం కౌన్సెలింగ్‌ నిర్వహించి పోస్టింగ్‌ ఇవ్వాల్సి ఉంది. అయితే యాదా ద్రి జిల్లాకు ఆప్షన్‌ ఇచ్చిన సీనియర్‌ ఉపాధ్యాయులు హైదరాబాద్‌ నగరానికి చేరువలో పోస్టింగ్‌ వస్తుందని ఆశించారు. చాలామంది చౌటుప్ప ల్‌, నారాయణపూర్‌, బీబీనగర్‌, బొమ్మలరామారం, భువనగిరి, వలిగొండ, భూదాన్‌పోచంపల్లి, రామన్నపేట మండలాల్లో పనిచేయొచ్చని యాదాద్రి జిల్లాకు ఆప్షన్లు ఇచ్చారు. అయితే అధికారులు రాజపేట, గుండాల, అడ్డగూడూరు, మోత్కురు, రామన్నపేట, ఆలేరు, ఆత్మకూరు, మో టకొండూరు మండలాల్లో ఖాళీచూపించారు. జిల్లాలోని అన్ని ఖాళీలను చూపించకుండా, కేవలం కొత్తగా వచ్చిన ఉపాధ్యాయుల సంఖ్య మేరకే అధికారులు ఖాళీలను చూపించారు. దీంతో తాము జిల్లా మారివస్తే ఎక్కడో మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని సీనియర్‌ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని అన్ని ఖాళీలను చూపించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే సమస్య అన్ని జిల్లాలో ఉంది.


పేటలో కౌన్సిలింగ్‌

భార్యాభర్తలు ఒకే జిల్లాలో (స్పౌజ్‌) పనిచేస్తే జూనియర్లకు తొలుత అవకాశం ఇస్తామని, స్పెషల్‌ కేటగిరీకి తర్వాత ప్రాధాన్యం ఇస్తామని సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి ప్రకటించడంతో ఉపాధ్యాయులు గతంలో కేటాయించిన ఆప్షన్లలో మార్పులు చేసి మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది. దీంతో ఎలాంటి మార్పులు లేని వారికి మంగళవారం ఉదయం ఆన్‌లైన్లో పోస్టింగ్‌ కేటాయించి ఫోన్‌లో మేసేజ్‌ పెడతామని అధికారులు తెలిపారు. సూర్యాపేట జిల్లా నుంచి ఇతర జిల్లాలకు 413మంది వెళ్లగా, ఇక్కడికి 330 మంది వచ్చారు. వీరందరికి ఈ నెల 28న పోస్టింగ్‌ ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఖాళీలన్నింటినీ అధికారులు చూపలేదు.


అన్ని పోస్టులను కౌన్సిలింగ్‌లో చూపించాలి 

జీవో నెంబరు 317 ద్వారా జిల్లాకు వచ్చిన ఉపాధ్యాయులకు ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ కౌన్సిలింగ్‌లో చూపించాలని జాక్టో నాయకులు డిమాండ్‌ చేశారు. జాక్టో ఆధ్వర్యంలో నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట డీఈవో కార్యాలయాల ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, ప్రస్తు తం అడ్‌హక్‌ ప్రాతిపదికన నియమించి, వేసవి సెలవుల్లో పూర్తిస్థాయి బదిలీలు చేపట్టాలన్నారు. కౌన్సెలింగ్‌ ప్రక్రియను ఆన్‌లైన్‌లో కాకుండా మాన్యువల్‌ పద్ధతిలో నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయుల సర్వీ్‌సను చిన్నాభిన్నం చేస్తూ వేలమందికి అన్యాయం చేస్తున్న జీవో నంబర్‌ 317ను సవరించాలన్నారు. అనంతరం డీఈవోలకు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమాల్లో నాయకులు ఘనపు రం భీమయ్య, కొనకంచి వీరరాఘవులు, కట్టా రామకృష్ణ, కందిమళ్ల నరేందర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, సిహెచ్‌.రాములు, బంధం వెంకటేశ్వర్లు, భూపతి శ్రీనివా్‌సగౌడ్‌, జ్యోతుల చంద్రశేఖర్‌,  ఓరుగంటి నాగేశ్వర్‌రా వు, బచ్చుపల్లి శంకర్‌రావు, సత్యనారాయణ, వెంకటయ్య, నిమ్మల శ్రీనివాస్‌, కుంత శ్రీనివాస్‌, ఉదయ్‌, అంజయ్య, శివయ్య, వెంకటరమ ణ, ఆదినారాయణ, వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.



పారదర్శకంగా పోస్టింగ్‌లు : వినయ్‌కృష్ణారెడ్డి, సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ 

అన్ని శాఖల బదిలీలను పూర్తి పారదర్శకంగా చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ఖాళీల సంఖ్యను ప్రకటించాం. ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.


ప్రభుత్వం సర్వీసు పెంచి శిక్షిస్తోంది : కె.సాగర్‌రెడ్డి, ఎల్‌ఎ్‌ఫఎల్‌ హెచ్‌ఎం

నల్లగొండ జిల్లా దేవరకొండలో ఎల్‌ఎ్‌ఫఎల్‌ హెచ్‌ఎంగా పనిచేస్తున్న నన్ను యాదాద్రి జిల్లాకు కేటాయించారు. 59 సంవత్సరాల వయస్సులో దూర ప్రాంతానికి రావడం ఇబ్బందే. ప్రభుత్వం ఉద్యోగ సర్వీసు పెంచి శిక్షించినట్టు ఉంది. నా భార్యకు గుండే ఆపరేషన్‌ అయింది. నా ఆరోగ్యం కూడా సహకరించడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబానికి దూరంగా ఉండటం కష్టమే. ప్రభుత్వం, అధికారులు సరైన న్యాయం చేయాలి.


బదిలీల్లో లొసుగులను సరిచేయాలి : పి.వెంకులు, డీటీఎఫ్‌ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి

ఉపాధ్యాయ బదిలీలు, జిల్లాల కేటాయింపులో లొసుగులను అధికారులు వెంటనే సరి చేయాలి. సీనియర్లకు అవకాశం ఇవ్వకుండా జూ నియర్లను వారికి ఆసక్తి ఉన్న జిల్లాలకు అధికారులు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఆప్షన్లు ఇచ్చేందుకు కూడా తక్కువ సమయం ఇవ్వడంతో ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. ఆప్షన్ల గడువును పొడగించాలి.


Updated Date - 2021-12-28T06:12:33+05:30 IST