అయోమాయం

ABN , First Publish Date - 2022-06-06T06:19:26+05:30 IST

ఎన్నికల్లో ఓట్లు రాలాలి. దూరంగా ఉన్న కుర్చీ దగ్గరికి రావాలి..! దీనికోసం గాలి మాటలు ఎన్నైనా చెబుతారు.

అయోమాయం

రైతు భరోసా జాబితా కుదింపు

పీఎం కిసాన యోజనా అంతే..!

వేలాది ఖాతాల్లో జమకాని సొమ్ము

అర్జీలు పట్టుకుని రైతుల ప్రదక్షిణ

పెట్టుబడి సాయం 2021లో రూ.403 కోట్లు.. ఈ ఏడాది 

రూ.207.19 కోట్లకే పరిమితం

ఎన్నికల్లో ఓట్లు రాలాలి. దూరంగా ఉన్న కుర్చీ దగ్గరికి రావాలి..! దీనికోసం గాలి మాటలు ఎన్నైనా చెబుతారు. ఓటర్లను బురిడీ కొట్టిస్తారు. అధికారం దక్కగానే.. ఏవేవో సాకులు చెబుతారు. మాట తప్పుతారు. రైతు భరోసా, పీఎం కిసాన యోజన ఇందుకు నిదర్శనం. ఈ పథకాలు ఎవరికి అందుతాయో.. ఎవరికి అందవో అర్థంగాని పరిస్థితి. ఏ ఏడాది ఎవరి పేర్లు జాబితా నుంచి గల్లంతు అవుతాయో చెప్పలేం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనంత రైతులకు పెట్టుబడి సాయం కింద 2020-21లో రూ.403 కోట్లు వచ్చింది. ఈ ఏడాది రూ.207.19 కోట్లకు పరిమితం అయ్యింది. పీఎం, సీఎం బటన నొక్కి చాలా రోజులు గడిచినా.. ఈ సొమ్ము వేలాది మంది రైతుల ఖాతాలో ఇంకా జమకాలేదు. పొలంలో సేద్యం చేస్తూ చెమటోడ్చాల్సిన రైతులు.. బ్యాంకులు, ఆర్బీకేలు, వ్యవసాయశాఖ కార్యాలయాల వద్ద అర్జీలు పట్టుకుని.. క్యూలో నిలబడలేక సొమ్మసిల్లిపోతున్నారు. ఇదీ.. రైతుల పట్ల ప్రభుత్వాల ధోరణి..!


అనంతపురం అర్బన: కరువు జిల్లాలో రైతులకు పెట్టుబడి సాయం సరిగా చేరడం లేదు. రైతు భరోసా పథకం పేరిట ఏటా రైతుల ఖాతాలకు సొమ్ము జమ చేస్తున్నారు. గత నెల 16న సీఎం జగన ఈ సొమ్మును విడుదల చేశారు. కానీ 20 రోజులు గడిచినా చాలామంది రైతుల ఖాతాలో పైసా కూడా జమ కాలేదు. బ్యాంకు, వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ రైతులు ప్రదక్షిణ చేస్తున్నారు. ‘జాబితాలో మీ పేరుంది. త్వరలో పడుతుంది’ అని అధికారులు చెప్పి పంపుతున్నారు. కానీ ఎప్పటిలోగా ఖాతాలకు జమ అవుతుందో స్పష్టత లేదు. పీఎం కిసాన సొమ్ము పరిస్థితి కూడా ఇదేలా ఉంది. 


సేద్యానికి అప్పు తప్పదా..?

ఖరీఫ్‌ సీజన మొదలైంది. జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రైతులు సేద్యం పనులు ప్రారంభించారు. దుక్కి దున్ని, విత్తనం వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో విత్తనం, ఎరువులు, కూలి ఖర్చులు.. ఇలా చాలా అవసరమౌతాయి. పీఎం కిసాన యోజన, రైతు భరోసా సొమ్ము పడితే రైతులకు ఆసరా అవుతుంది. కానీ దీన్ని నమ్ముకుని సేద్యం చేయలేమని, అప్పులు తెచ్చుకోవాల్సిందే అని రైతులు అంటున్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


పీఎం కిసాన ఎప్పుడు?  

ప్రధాని మోదీ మే 31న పీఎం కిసాన సొమ్మును విడుదల చేశారు. ప్రధాన మంత్రి బటన నొక్కగానే తమ ఖాతాలోకి సొమ్ము జమ అయ్యుంటుందని రైతులు అనుకున్నారు. జిల్లాలో 2,76,258 మంది రైతులకు రూ.55.25 కోట్ల పీఎం కిసాన సొమ్మును విడుదల చేశారు. ఇందులో ఎంత మంది రైతు ఖాతాల్లో సొమ్ము జమైందో తెలియని అయోమయం నెలకొంది. సొమ్ము ఆలస్యంగా జమ చేస్తే.. అప్పులకు వడ్డీలకు సరిపోతాయని, సాయం చేసి ఏం ప్రయోజనం అని రైతులు పెదవి విరుస్తున్నారు. మరోవైపు పీఎం కిసానకు 2019లోపు రిజిస్టరై, పట్టాదారు పుస్తకం పొందిన రైతులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు. దీంతో వేలాది మంది రైతులకు సాయం అందడం లేదు.


అర్హుల జాబితా కుదింపు 

- పెట్టుబడి సాయంగా ఒక్కో రైతు కుటుంబానికి ఏటా రూ.13,500 అందిస్తామని వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. రైతు భరోసా పేరిట తొలి విడతలో రూ.5,500, రెండో విడత రూ.2వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన యోజన పేరిట ఒక్కో విడతలో రూ.2 వేలు చొప్పున మూడు విడతల్లో రూ.6 వేలు ఇస్తోంది. ఈ సారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అర్హుల జాబితాను భారీగా కుదించాయి. 

- జిల్లా వ్యాప్తంగా 2019-20లో 2,85,185 మంది రైతులకు రైతు భరోసా , పీఎం కిసాన ద్వారా రూ.385 కోట్లు మంజూరు చేశారు. 2020-21లో 2,98,535 మంది రైతులకు రూ.403 కోట్లు మంజూరు చేశారు. గత ఏడాది 2,87,051 మంది రైతులకు రూ.387 కోట్లు మంజూరు చేశారు.  ఈ ఏడాది 2,76,258 మంది రైతులకు రూ.207.19 విడుదల చేశారు. ఇలా రెండేళ్ల నుంచి అర్హుల జాబితా నుంచి వేలాది మంది రైతుల పేర్లను తొలగించారు. ఈ ఏడాది రైతు భరోసా రూ.151.94 కోట్లు, పీఎం కిసాన యోజన రూ.55.25 కోట్లకే పరిమితమయ్యింది


వేలాదిగా అర్జీలు

రైతు భరోసా, పీఎం కిసాన సొమ్ము తమ ఖాతాల్లో ఇంకా జమ కాలేదని, అర్హత ఉన్నా జాబితాలో పేర్లు లేవని వేలాది మంది రైతులు మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో అర్జీలు ఇచ్చారు. గత నెలలో ఆర్బీకేల్లో జాబితాలను ప్రదర్శించిన సమయంలో అర్జీలు ఇచ్చినా, సమస్య పరిష్కారం కాలేదని బాధిత రైతులు వాపోతున్నారు. రైతు భరోసాకు ఇప్పుడు అర్జీలు ఇచ్చినా ఎలాంటి ప్రయోజనం లేదని, తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు. అర్జీలన్నీ ఉన్నతాధికారులకు పంపుతామని, సమస్య పరిష్కారం అవుతుందా, లేదా అన్న విషయం తమకు సంబంధం లేదని రైతులకు చెబుతున్నారు. ప్రతి మండలంలో వందలాది మంది రైతులు అర్జీలు ఇస్తున్నారు. ఈ నెలలో అర్జీలు సమర్పించినా, ఉన్నతాధికారులు పరిగణనలోకి  తీసుకోవడం లేదని సమాచారం. ఏటా ఇదే వైఖరిని అవలంభిస్తున్నారు. దీంతో వేలాది మంది అర్హులు  రైతు భరోసా సొమ్ముకు దూరమవుతున్నారు.



డబ్బులు పడలేదయ్యా..

మాకున్నది 2.97 ఎకరాల పొలమే. మూడు సంవత్సరాలుగా ఒక్క పైసా కూడా రైతు భరోసా, పీఎం కిసాన డబ్బులు పడలేదు. వ్యవసాయ శాఖ అధికారులు, సచివాలయం చుట్టూ అనేక సార్లు తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదు. వేలిముద్రలు పడలేదని, ఐరిస్‌ పట్టుకోలేదని తిప్పుకుంటూనే ఉన్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మాలాంటి రైతులకు న్యాయం చేయాలి. 

- మహిళా రైతు నాగమ్మ, పాల్తూరు, విడపనకల్లు మండలం 


ఎప్పుడు వేస్తారో ఏమో..

రైతు భరోసా, పీఎం కిసాన డబ్బులు ఎప్పుడు వేస్తారో అర్థం కావడం లేదు. రైతు భరోసా కేంద్రం వద్దకు వెళితే బ్యాంక్‌ ఖాతాకు జమ అయినట్లు చూపుతోందని అంటున్నారు.  బ్యాంక్‌కు  వెళ్లి ఎనపీసీ చేయించుకోవాలని సూచిస్తున్నారు. బ్యాంక్‌కు వెళ్లిన సమయంలో అధికారులు అందుబాటులో ఉండటం లేదు. నాకు డబ్బులు పడేదెప్పుడో అర్థం కావడం లేదు. 

- రైతు సుంకన్న, గోవిందురాయని పేట, శింగనమల మండలం 

Updated Date - 2022-06-06T06:19:26+05:30 IST