కరోనా.. క్వారంటైన్‌

ABN , First Publish Date - 2020-04-04T11:41:12+05:30 IST

ఇప్పటికే పాజిటివ్‌గా నిర్ధారణ అయిన కేసుల్లో వారి ఆనుపానులు, కదలికలు, ఇతరత్రా వాటిని గుర్తించి శోధిస్తున్నారు.

కరోనా.. క్వారంటైన్‌

ఇప్పటి వరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య 15

  ఢిల్లీ లింకులపై కొనసాగుతున్న అన్వేషణ

 పెండింగ్‌లోనే 202 రిపోర్టులు.. నేడు విడుదల

  గాడిన పడిన లాక్‌ డౌన్‌.. రోడ్లపై తగ్గిన సంచారం

  పోలీసుల అత్యుత్సాహం.. ఇద్దరి వ్యక్తుల హఠాన్మరణం

 రెండో దశలో 20 సెంటర్లకు ఏర్పాట్లు 


కరోనా పరిస్థితి గాడి తప్పకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. గురువారం రాత్రికి జిల్లాలో 15 పాజిటివ్‌ కేసులు నమోద య్యాయి. శుక్రవారం నిర్వహించిన పరీక్షల్లో ఏ విధమైన కేసులు పాజిటివ్‌ గా నమోదు కాకపోవడంతో అధికార యంత్రాంగం, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పాజిటివ్‌ కేసుల్లో సన్నిహితులు, బంధువులను ఎక్కడికక్కడ గుర్తిస్తున్నారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి, నమూనాలను పరీక్షలకు పంపుతున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తుండగా, నివేదికలు వస్తే తప్ప నిర్ధారించలేమని అధికారులు చెబుతున్నారు. 


(ఏలూరు-ఆంధ్రజ్యోతి ప్రతినిధి):ఇప్పటికే పాజిటివ్‌గా నిర్ధారణ అయిన కేసుల్లో వారి ఆనుపానులు, కదలికలు, ఇతరత్రా వాటిని గుర్తించి శోధిస్తున్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో ఒక పాజిటివ్‌ కేసు నమోదు కాగా 42 మందినిపైగా కరోనా అనుమానితులను క్వారంటైన్‌కు తరలించారు. వారి నమూనాలను పరీక్షలకు పంపారు. ఒకటి, రెండు రోజుల్లోనే నివేదికలు వెలువడనున్నాయి. ఇలా ఒక్కొక్కటిగా అధికారులు నిర్ధారణ చేస్తూ, క్వారంటైన్‌లో చేరుస్తూ ఒకింత పురోగతి సాధిస్తున్నారు. పశ్చిమలో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. కరోనా కేసుల విషయంలో ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఇప్పుడిప్పుడే అధికారులు జాగ్రత్త పడుతున్నారు. రాష్ట్రస్థాయి సమాచారం, అధికారికంగా వెలువరించిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారమే వివరాలు ప్రచురితం కావాలని, ఊహాగానాలకు ఆస్కారం లేదని అధికారులు తెగేసి చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఊహాగానాలు వ్యాపిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 


ఇతర క్వారంటైన్లకు తరలింపు 

ఏలూరు నగరంలోని ఆశ్రం ఆసుపత్రిలో కరోనా అనుమానితులను పెద్ద ఎత్తున తరలించారు. రెండు రోజులుగా 160 మందికిపైగానే ఈ ఆసుపత్రికి చేరుకున్నారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించి పరీక్షించగా, వీరిలో 81 మందికి నెగిటివ్‌ రిపోర్టులు అందాయి. సగం మందికిపైగానే బయట పడినట్టే. వీరిని శుక్రవారం జిల్లాలోని ఇతర క్వారంటైన్‌లలో చేర్చారు. ఏలూరులో ఉన్న ఆశ్రం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటర్‌లో ఉన్న 160 మందిని ఈ ఏడు క్వారంటైన్‌ సెంటర్‌లకు శుక్రవారం తరలించారు. తాడేపల్లిగూడెం క్వారంటైన్‌ సెంటర్‌కు 70 మంది, భీమవరం క్వారంటైన్‌కు 57 మంది, పాలకొల్లు సెంటర్‌కు 23 మంది, నిడదవోలు క్వారంటైన్‌కు 10 మందిని చేసుకున్నారు. పాలకొల్లులో నాలుగు అనుమానిత కేసులు, కొవ్వూరులో ఒక కేసును క్వారంటైన్‌ సెంటర్‌కు పంపారు.


వారికి కావాల్సిన సౌకర్యాలన్నింటిని సక్రమంగా ఉన్నాయో లేవో ఆయా ప్రాంత మున్సిపల్‌ కమిషనర్లు పర్యవేక్షించారు. వాస్తవానికి కరోనా వైరస్‌ తీవ్రత నెలకొన్న ఆరంభంలోనే విదేశాల నుంచి వచ్చిన వారిని ఎక్కడికక్కడ సొంత క్వారంటైన్‌లోనే ఉంచారు. దాదాపు ఈ రకంగా నాలుగు వేల మందికి పైబడిన విదేశాలకు వెళ్లి వచ్చిన వారిని ఇంట్లోనే స్వీయ నియంత్రణలో ఉంచి పరీక్షలు నిర్వహించారు. దీంతో 14 రోజులు పూర్తయిన వారి సంఖ్య దాదాపు రెండు వేలు దాటడంతో వారందరికీ విముక్తి కలిగిస్తున్నట్లు ప్రకటించారు. వీరిలో ఏ ఒక్కరికి కరోనా లక్షణాలు లేవని మరో రెండు వేల మందికిపైగా ఇంకా క్వారంటైన్‌లోనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఢిల్లీ లింకులతో బయటపడిన పాజిటివ్‌ కేసులతో లింకున్న వారి కోసం నిరంతర అన్వేషణ  కొనసాగిస్తున్నారు. ఉండి ప్రాంతంలో ఇప్పటికే పెద్దఎత్తున నియంత్రణ చర్యలు తీసుకున్నారు. కొన్ని ప్రాంతాలను పూర్తిగా నియంత్రించారు. ఇదే క్రమంలో ఏలూరులోని కొత్తగా గుర్తించిన పాజిటివ్‌ కేసుల విషయంలోనూ ఇదేరకమైన చర్యలకు దిగారు.  


లాక్‌డౌన్‌ గాడిలో పడ్డారు 

జిల్లావ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఒకటి, రెండుచోట్ల మినహా మిగతా ప్రాంతాలన్నింటిలోనూ విజయవంతంగా కొనసాగుతోంది. వీధుల్లోకి వచ్చే వారి సంఖ్య క్రమేపి పలుచబడింది. మధ్యాహ్నం వేళల్లో రోడ్డు మీద ఒకరిద్దరు  సంచరించటం లేదు. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరగడం ఒక ఎత్తైతే, దీనికి లోబడి పోలీసులు సైతం కట్టుదిట్టంగా వ్యవహరించడంతో ఎక్కడికక్కడ రాకపోకలు పలుచబడ్డాయి. ఆకతాయిల రాకపోకలు తగ్గాయి. ఉదయం వేళల్లో మార్కెట్‌ల్లోనే ప్రజలు నియంత్రణ తప్పుతున్నారు. లాక్‌డౌన్‌ ఎప్పుడు ఎత్తేస్తారనే ప్రశ్నే అందరిలోనూ కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల రెండో వారం వరకు లాక్‌డౌన్‌ విధించారు.


ఇది పూర్తయితే తప్ప ఆ నాటి పరిస్థితులను బట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొడిగింపా? పాక్షికంగా సడలింపా అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నాయి. ఇప్పటికే చాలాచోట్ల మందుల సరఫరా సక్రమంగా లేకపోవడంతో ఔషధ దుకాణాల ముందు ఉదయం వేళల్లో పెద్దఎత్తున బారులు తీరుతున్నారు. మందుల సరఫరాలో ఆటంకాలే దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. తాజాగా ప్రభుత్వ వైద్య శాలల్లో ఓపీని రద్దు చేసిన క్రమంలోనే దీనికి ప్రత్యామ్నాయంగా అధికారులు శుక్రవారం కీలక ప్రకటన చేశారు. జిల్లాలోని వివిధ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న వైద్యాన్ని పేర్కొంటూ ఈ వివరాలను ప్రకటించారు.


రెండో దశకు 20 సెంటర్లకు ఏర్పాట్లు

రోనా రెండో దశ క్వారంటైన్‌ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జిల్లాలోని 20 ప్రాంతాల్లో ఉన్న కళాశాలలను రెండో దశ క్వారంటైన్‌ సెంటర్ల ఏర్పాటుకు అధికారులు గుర్తించారు. ఈ సెంటర్లలో ఐదువేల పడకలను ఏర్పాటు చేయగల సామర్థ్యం ఉండేలా ఈ రెండో దశ 20 కామన్‌ క్వారంటైన్‌ సెంటర్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కళాశాలల (క్వారంటైన్‌)ల జాబితాను శుక్రవారం నాటికే అధికారులు సిద్ధం చేసి కలెక్టర్‌కు అందజేశారు. ఆమోదం పొందిన వెంటనే అక్కడ ఏర్పాట్లు సాగిస్తామని అధికారులు చెబుతున్నారు.


అయితే పరిస్థితి అంతవరకు రాదని, వచ్చినప్పటికీ ధీటుగా ఎదుర్కొంటు న్నామని అధికారులు అంటున్నారు. ఏదిఏమైనప్పటికీ మూడోదశ క్వారంటైన్‌ సెంటర్లను కూడా సిద్ధం చేస్తామని, ఆ మేరకు హోటళ్ళు, రెస్టారెంట్లు జాబితాలను సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలిపారు. కాగా నరసాపురంలో 114 పడకలతో ఐసోలేషన్‌ బోగీలు ఏర్పాటు చేస్తున్నారు. చింతలపూడి, పాలకొల్లు ప్రాంతాల్లో శుక్రవారం రోడ్లపై తిరుగుతున్న వ్యక్తులు పోలీసులను చూసి పరుగులు పెట్టారు. వీరిలో ఇద్దరు గుండెపోటుతో మృతి చెందారు. 


Updated Date - 2020-04-04T11:41:12+05:30 IST