అన్నదాతకు కోతల షాక్‌!

ABN , First Publish Date - 2021-10-22T05:27:05+05:30 IST

అన్నదాతలకు విద్యుత్‌ కోతలు షాక్‌కు గురిచేస్తున్నాయి. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నిరంతరం విద్యుత్‌ అందిస్తామన్న ప్రకటనలకు..వాస్తవ పరిస్థితికి పొంతన లేదు. క్షేత్ర స్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. సరఫరా ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు నిలిపివేస్తారో తెలియని పరిస్థితి.

అన్నదాతకు కోతల షాక్‌!
వరి చేనుకు నీరు పెడుతున్న రైతు


- అప్రకటిత కోతలతో అవస్థలు

- రోజంతే పొలాల వద్దే పడిగాపులు

- వేసవిలో పరిస్థితిని తలచుకొని దిగాలు

- రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహం

- నాణ్యమైన విద్యుత్‌ అందించాలని విన్నపం

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

‘తొమ్మిది గంటల పాటు నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తాం. రైతులకు సాగు ఇబ్బందులు లేకుండా చూస్తాం. విద్యుత్‌ కోతల మాటే ఉండదు’..ఇలా సీఎం జగన్‌ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ మీటర్లు అమర్చారు. నాణ్యమైన విద్యుత్‌ను అందించడానికేనని చెప్పుకొచ్చారు. కానీ విద్యుత్‌ సరఫరా ఎప్పుడు ఉంటుందో..ఎప్పుడు ఉండదో తెలియడం లేదు. దీంతో పగలూ, రాత్రీ అన్న తేడా లేకుండా అన్నదాతలు  పొలాల్లోనే పడిగాపులు కాస్తున్నారు.  

-అన్నదాతలకు విద్యుత్‌ కోతలు షాక్‌కు గురిచేస్తున్నాయి. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నిరంతరం విద్యుత్‌ అందిస్తామన్న ప్రకటనలకు..వాస్తవ పరిస్థితికి పొంతన లేదు. క్షేత్ర స్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.  సరఫరా ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు నిలిపివేస్తారో తెలియని పరిస్థితి. ఒకవైపు పైలెట్‌ ప్రాజెక్టు కింద వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల ముందు సాగుకు ఉచిత విద్యుత్‌.. అది కూడా పగలే ఇస్తామని చెప్పిన సీఎం జగన్‌ ఇప్పుడు మాట మార్చారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బాహుదా నదలులు ఉన్నాయి. కాలవలు విస్తరించి ఉన్నాయి. కానీ వర్షాకాలంలో మాత్రమే నీరు అందుబాటులో ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ పంపుసెట్ల పైనే రైతులు ఆధార పడుతున్నారు. విద్యుత్‌ శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో  25,894 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. రెండు విడతల్లో వీటికి తొమ్మిది గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేసేవారు. గత ప్రభుత్వాల నుంచి ఇదే ఆనవాయితీ వస్తోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండు విడతల్లో సరఫరా చేయడంపై అప్పటి విపక్ష నేత, ఇప్పటి సీఎం జగన్‌ దుమ్మెత్తిపోశారు. దీంతో టీడీపీ ప్రభుత్వం పగటిపూటే తొమ్మిది గంటల పాటు విద్యుత్‌ అందించింది. నిరంతరం అందించగలిగింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అలా విద్యుత్‌ సరఫరా చేయకపోగా... మీటర్లు బిగించింది. బిల్లులు సైతం జారీ చేస్తుండడంతో రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

బోర్లే ప్రధాన ఆధారం

 పాలకొండ, వీరఘట్టం, బూర్జ, రేగిడి, ఆమదాలవలస, ఎల్‌ఎన్‌ పేట, నరసన్నపేట, పోలాకి, రణస్థలం, లావేరు, పొందూరు, జి.సిగడాం, రాజాం, సంతకవిటి మండలాల్లో వ్యవసాయ పంపుసెట్లు అధికంగా ఉన్నాయి. ఉద్దానం, ఏజెన్సీ మండలాల్లో సైతం బోర్లే సాగునీటి వనరుగా ఉన్నాయి. సాగుకు ఊతమిచ్చేందుకు గత ప్రభుత్వాలు ఉచిత విద్యుత్‌ను అందించాయి. ఎటువంటి నిబంధనలు, షరతులు విధించకుండా సరఫరా చేశాయి. కానీ వైసీపీ ప్రభుత్వం మీటర్లు బిగించడంపై ప్రజాసంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ మీటర్ల విధానాన్ని వ్యతిరేకించింది. ఎక్కడాలేని విధంగా ఇక్కడే అమలు చేయడమేమిటని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కానీ ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోలేదు. పైలెట్‌ ప్రాజెక్ట్‌గా మన జిల్లాను ఎంపిక  చేయడంపై జిల్లా రైతులు ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు విద్యుత్‌ కోతలు విధిస్తుండడం, భవిష్యత్‌లో ఇంకా పెరిగే అవకాశం ఉండడంపై ఆందోళన చెందుతున్నారు. ఇలాగైతే రబీ పంటలు క ష్ట్టమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో విద్యుత్‌ కోతలు విధిస్తే నేరుగా రైతుల ఫోన్లకు మెసేజ్‌లు వచ్చేవి. కానీ కొన్నేళ్లుగా మెసేజ్‌లు రావడం లేదని రైతులు చెబుతున్నారు. అధికారులను అడుగుతుంటే విద్యుత్‌ కోతలు లేనప్పుడు మెసేజ్‌లు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు.



Updated Date - 2021-10-22T05:27:05+05:30 IST