Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘రెండు కోట్ల’తో రైతుల బెంబేలు

రెవెన్యూ ఖాతా నెం. 2,00,00,000 కింద మిగులు భూములు

రిజిస్ట్రేషన్లు జరగక అవస్థలు

రాయచోటిలోనే సుమారు రెండువేల ఖాతాలు

రాయచోటి, అక్టోబర్‌ 22: ఖాతా నెంబరు ‘రెండు కోట్ల’తో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు బెంబేలు ఎత్తిపోతున్నారు. రెవెన్యూ రికార్డుల్లో తమ భూములు రెండు కోట్ల ఖాతాలో ఉండడంతో.. రిజిస్ట్రేషన్ల్లు, కన్వర్షన్‌, మ్యుటేషన్‌ వంటి సేవలు పొందలేక అవస్థలు పడుతున్నారు. ఇటువంటివి రాయచోటి మండలంలోనే సుమారు 2 వేల వరకు ఉన్నట్లు సమాచారం. ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఖాతాలు ఉంటాయో.. ఎంత మందికి ఇబ్బందిగా ఉంటుందో ఊహకందదు.


‘రెండు కోట్ల’ ఖాతా.. ఏమిటా కథ..?

రైతులు, భూముల యజమానులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ రెండు కోట్ల ఖాతా కథేంటో తెలుసుకుందాం. 2011వ సంవత్సరం వరకు రెవెన్యూశాఖలో రికార్డులను పుస్తకాల్లో మాత్రమే నిర్వహించేవారు. దీని వల్ల ప్రజలు సేవలు పొందడానికి ఆలస్యం అయ్యేది. దీంతో అప్పట్లో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూముల రికార్డులన్నింటినీ ల్యాండ్‌ రికార్డ్స్‌ మ్యుటేషన్‌ ఇంటిగ్రేటెడ్‌ సిస్టం (ఎల్‌ఆర్‌ఎంఐఎస్‌) ఆన్‌లైన్‌ (కంప్యూటరీకరణ) చేసింది.  ఈ సందర్భంగా ఈ ‘రెండు కోట్ల’ ఖాతా పుట్టుకొచ్చింది. అదెలాగంటే.. ఒక సర్వే  నెంబరులో సుమారు పది ఎకరాల పొలం ఉంది అనుకుందాం.. అందులో దాదాపు 9 ఎకరాల వరకు పలువురి ఆధీనంలో ఉంది అనుకుందాం.. వాళ్లందరికీ రెవెన్యూ శాఖ ఒక ఖాతా నంబరుతో పట్టాదారు పాసుపుస్తకం ఉంది. ఈ మేరకు వాళ్లందరికీ 9 ఎకరాల పొలాన్ని ఆన్‌లైన్‌ చేసేశారు. అయితే మిగిలిన ఒక ఎకరా పొలం కోసం ఎవరూ రాకపోవడంతో.. ఆ ఎకరా పొలాన్ని మిగులు భూములు కింద చూపిస్తూ.. 2,00,00,000 ఖాతాలో చేర్చారు. అప్పటి నుంచి రెవెన్యూ రికార్డుల్లో అలాంటి భూములన్నీ మిగులు భూముల కింద ఉన్నాయి.


నిలిచిన సేవలు

రెండు కోట్ల ఖాతాతో ఇప్పటి వరకు రైతులకు ఎటువంటి సమస్య రాలేదు. అయితే ఈ మిగులు భూములన్నీ ప్రభుత్వానివని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీంతో ఆ భూములను సంరక్షించుకోవాలని భావించింది. ఈ నేపథ్యంలో రెండు కోట్ల ఖాతాలో ఉన్న సర్వే నంబర్లలో ఎటువంటి అమ్మకాలు, కొనుగోళ్లు జరగకుండా స్తంభింప చేసింది. దీని వల్ల రాష్ట్ర వ్యాప్తంగా భూముల యజమానులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు కోట్ల ఖాతా నెంబరు భూముల్లో రిజిస్ర్టేషన్లు, ల్యాండ్‌ కన్వర్షన్‌, మ్యుటేషన్‌ జరగడం లేదు. దీనిపైన రైతులు, భూ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగులు భూముల్లో ఏవైనా ప్రభుత్వ భూములుంటే.. వాటిని సంరక్షించుకోవాలి అంటే.. దానికి ఎన్నో మార్గాలు ఉంటాయి కానీ.. ఇలా మొత్తానికి సర్వే నెంబరును స్తంభింప చేస్తే.. ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం త్వరగా స్పందించి ‘రెండు కోట్ల’ ఖాతా సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. 


సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం

- నరసింహకుమార్‌, తహసీల్దార్‌(ఇన్‌చార్జ్‌), రాయచోటి

రెండు కోట్ల ఖాతా సమస్య వారం పది రోజులుగా ఉంది. పలువురు ఈ సమస్యను మా దృష్టికి తెచ్చారు. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వం కూడా నివేదిక కోరింది. సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కారం అవుతుంది.

Advertisement
Advertisement