లాక్‌డౌన్‌లో కరెంట్‌ చార్జీలపై రాయితీలివ్వాలి

ABN , First Publish Date - 2020-05-29T11:16:47+05:30 IST

‘కొవిడ్‌-19’ కష్టకాలంలో కరెంట్‌ వాడకంలేని ఫ్యాక్టరీల విద్యుత్‌ చార్జీలపై రాయితీ ఇవ్వాలని అమరరాజ సంస్థ .

లాక్‌డౌన్‌లో కరెంట్‌ చార్జీలపై రాయితీలివ్వాలి

ఎస్సీ, ఎస్టీలకు రుణ మేళాలు పెట్టాలి 

‘మనపాలన- మీసూచన’లో పలువురు పారిశ్రామిక ప్రతినిధుల సూచనలు


తిరుపతి, మే28 (ఆంధ్రజ్యోతి): ‘కొవిడ్‌-19’ కష్టకాలంలో కరెంట్‌ వాడకంలేని ఫ్యాక్టరీల విద్యుత్‌ చార్జీలపై రాయితీ ఇవ్వాలని అమరరాజ సంస్థ ప్రతినిధి విజయనాయుడు కోరారు కోరారు. నైపుణ్యాభివృద్ధికి శిక్షణ కేంద్రాలు పెంచాలన్నారు. చైనా నుంచి వచ్చే పెద్ద పరిశ్రమలనూ స్వాగతించాలన్నారు. మన పాలన- మీ సూచన కార్యక్రమంలో భాగంగా గురువారం ‘పరిశ్రమలు- మౌలిక వసతులు’పై ఎస్వీయూ సెనేట్‌ హాలులో డిప్యూటీ సీఎం నారాయణస్వామి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఎస్సీ, ఎస్టీలకు రుణాలిచ్చే మేళాలు పెట్టాలని పారిశ్రామికవేత్త డిక్కీడేవిడ్‌ సూచించారు. 


పరిశ్రమల శాఖ ఉత్తర్వుల మేరకు బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలని, చిన్నపరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించాలని తిరుపతి బయోటెక్‌ ల్యాబ్‌కు చెందిన రహమతుల్లా కోరారు. పరిశ్రమల్లో సాంకేతిక, పాలనా నైపుణ్యంపై శిక్షణ ఇవ్వాలని ఎస్వీయూ ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన డాక్టర్‌ దివాకర్‌ రెడ్డి సూచించారు. లాక్‌డౌన్‌తో ఇతర రాష్ట్రాల వారు వెళ్లిపోయినందున స్థానిక యువతకు అవకాశం కల్పించాలని పీలేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు శ్రీరాములు సచించారు. ప్రస్తుతం ఇస్తున్న వాహనాల ప్రోత్సాహాన్ని పరిశ్రమల కింద నుంచి తొలగించాలని, కనీసం 50 మంది ఉపాధి ఇవ్వగలిగే వాటినే పరిశ్రమల కింద తీసుకోవాలని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు.


  జిల్లాలో పారిశ్రామిక పరుగుల కోసం మీ సూచనలు ఇవ్వాలని అంతకుముందు పారిశ్రామికవేత్తలను కలెక్టర్‌ భరత్‌గుప్తా కోరారు. ఈ సమావేశంలో తిరుపతి, చిత్తూరు ఎంపీలు బల్లి దుర్గాప్రసాదరావు, రెడ్డెప్ప, సత్యవేడు, శ్రీకాళహస్తి ఎమ్యెల్యేలు ఆదిమూలం, బియ్యపు మధుసూదనరెడ్డి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌, జీఎం డీఐసీ ప్రతాప్‌రెడ్డి, ఏపీఐఐసీ తిరుపతి, చిత్తూరు జెడ్‌ఎంలు ఎల్‌.రామ్‌, యతిరాజులు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ రామ్మోహన్‌, హౌసింగ్‌ పీడీ నాగేశ్‌, సీపీవో ఆనంద్‌నాయక్‌, టిడ్కో ఈఈ భాస్కర్‌రావు, చిన్న, మధ్య, పెద్ద తరహా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. కాగా, సాయంత్రం డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో రూ.2,230 కోట్లకుపైగా నిధులతో 13 భారీ తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి 4 వేల మందికి, 706 చిన్న తరహా పరిశ్రమలతో 8 వేల మందికి ఉపాధి కల్పించామన్నారు. ఏపీఐఐసీ ద్వారా రూ. 4,311 కోట్లతో 383 ఎకరాల్లో 233 ప్లాట్లు కేటాయించి 30 వేల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. 

Updated Date - 2020-05-29T11:16:47+05:30 IST