కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళన

ABN , First Publish Date - 2021-10-19T06:12:50+05:30 IST

నూతన వ్యవసాయ చట్టాలు, విద్యుత్‌ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలన్న డిమాండ్లతో సోమవారం మండలంలోని సీఐటీయూ ఆధ్వ ర్యంలో చేపట్టిన రైల్‌ రోకోను పోలీసులు అడ్డుకున్నారు.

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళన
ఆందోళనకారుడ్ని వ్యాన్‌లోకి ఎక్కిస్తున్న పోలీసులు

ఎస్‌.రాయవరం, అక్టోబరు 18 : నూతన వ్యవసాయ చట్టాలు, విద్యుత్‌ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలన్న డిమాండ్లతో సోమవారం మండలంలోని సీఐటీయూ ఆధ్వ ర్యంలో చేపట్టిన రైల్‌ రోకోను పోలీసులు అడ్డుకున్నారు. రైతు సంఘాల సమన్వయ కమిటీ పిలుపు మేరకు ఎస్‌.రాయవరం మండలం నర్సీపట్నం రైల్వే స్టేషన్‌ వద్ద సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.అప్పలరాజు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ ప్రజలకు ద్రోహం చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తీరును మార్చుకుని వెంటనే నూతన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని, పెంచిన గ్యాస్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని, స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపాలని నినాదాలు చేశారు. అనంతరం ఆందోళనకారులు రైల్‌ రోకో చేయడానికి ప్రయత్నించగా ఎస్‌.రాయవరం, తుని రైల్వే పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు తోపులాట జరి గింది.  సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.అప్పలరాజుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి, సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఎం.రాజేష్‌, సీపీఎం నాయకుడు డేవిడ్‌రాజు, త్రినాథ్‌, లోవరాజు, కాశీరావు, వరహాలు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-19T06:12:50+05:30 IST