పురుగుల మందు డబ్బాలతో రైతు కుటుంబీకుల ఆందోళన

ABN , First Publish Date - 2020-08-02T10:02:31+05:30 IST

అచ్యుతాపురం మండలం భోగాపురం గ్రామానికి చెందిన రైతు పైల వెంకటస్వామిబాబు కుటుంబ సభ్యులతో కలిసి ..

పురుగుల మందు డబ్బాలతో రైతు కుటుంబీకుల ఆందోళన

వారించిన కలెక్టర్‌ బంగ్లా సిబ్బంది

రేపు తనను కలిసేందుకు అనుమతిచ్చిన కలెక్టర్‌


విశాఖపట్నం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): అచ్యుతాపురం మండలం భోగాపురం గ్రామానికి చెందిన రైతు పైల వెంకటస్వామిబాబు కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం కలెక్టర్‌ బంగ్లా వద్ద పురుగుల మందు డబ్బాలతో ఆందోళనకు దిగడం కలకలం రేపింది. కలెక్టర్‌ బంగ్లా సిబ్బంది అప్రమత్తమై వారిని వారించి, ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లడంతో ఈనెల మూడో తేదీన మాట్లాడేందుకు అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా వెంకటస్వామిబాబు విలేకరులతో మాట్లాడారు. భోగాపురంలో తమ కుటుంబానికి 32 ఎకరాల సాగు భూమి వుందని, అయితే ఈ భూమిపై తమకూ హక్కులున్నాయని విశాఖకు చెందిన పీఆర్‌ఎ్‌స నాయుడు కోర్టులో కేసు దాఖలు చేశారన్నారు. ఈ కేసు కోర్టులో పెండింగ్‌లో వుందని, అయినప్పటికీ మండల తహసీల్దార్‌ నారాయణరావు, ఆర్‌ఐ రమణ, భోగాపురం, దుప్పితూరు వీఆర్వోలు కలిసి పీఆర్‌ఎ్‌స నాయుడికి పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేశారని ఆయన ఆరోపించారు. దీంతో నగరానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు సురేశ్‌కుమార్‌ జైన్‌, మంచుకొండ సుబ్రహ్మణ్యం, మంచుకొండ శ్యామ్‌లకు 4.75 ఎకరాలను గతనెల 27న రిజిస్టర్‌ చేయడంతో వారు తమ వ్యవసాయ పనులకు అడ్డుకున్నారన్నారు. ఈ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల నుంచి తన కుటుంబానికి ప్రాణ హాని వుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే తాము మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-02T10:02:31+05:30 IST