భూవివాదంలో ఎస్‌ఐ వేధిస్తున్నాడని హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-06-19T05:44:42+05:30 IST

చేర్యాల ఎస్‌ఐ గోనెం రాకేశ్‌ భూవివాదంలో జోక్యం చేసుకోవడంతో పాటు తనపై అక్రమంగా కేసులు నమోదు చేసి, వేధిస్తున్నాడని పేర్కొంటూ మండలంలోని రాంపూర్‌కు చెందిన రిటైర్డ్‌ సైనికుడు రంగు చంద్రాగౌడ్‌ గురువారం మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు.

భూవివాదంలో ఎస్‌ఐ వేధిస్తున్నాడని హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు

ప్రాణరక్షణ కల్పించాలని రిటైర్డ్‌ సైనికుడు చంద్రాగౌడ్‌ వినతి

చేర్యాల. జూన్‌ 18: చేర్యాల ఎస్‌ఐ గోనెం రాకేశ్‌ భూవివాదంలో జోక్యం చేసుకోవడంతో పాటు తనపై అక్రమంగా కేసులు నమోదు చేసి, వేధిస్తున్నాడని పేర్కొంటూ మండలంలోని రాంపూర్‌కు చెందిన రిటైర్డ్‌ సైనికుడు రంగు చంద్రాగౌడ్‌ గురువారం మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. తనకు ప్రాణరక్షణ కల్పించాలని అభ్యర్థించాడు.  ఆయన తెలిపిన వివరాల ప్రకా రం.. 22 యేళ్లుగా ఆర్మీలో పనిచేసి కొన్నాళ్ల క్రితం రిటైర్‌ కాగా వచ్చిన డబ్బుతో గ్రామానికి చెందిన బొందిలి స్వరూపరాణికి చెందిన భూమిని కొనుగోలు చేశానని తెలిపారు. స్వరూపరాణి కుమారుడు దినేష్‌ ఎన్నికల్లో ఓడిపోవడంతో వారి అవసరం కోసం భూమిని విక్రయించగా, అప్పు కాగితం పేరిట సంవత్సరం గడువు ఒప్పందం కుదుర్చుకున్నామని పేర్కొన్నారు. ఒప్పందం గడువు తీరడంతో తాను భూమిని మార్పిడి చేసుకుని సాగు చేసుకుంటుండగా అడ్డుకుంటూ దౌర్జన్యానికి పాల్పడ్డారని వాపోయాడు. ఈవిషయమై సర్పంచు రంగు శంకర్‌తో కలిసి చేర్యాల ఎస్‌ఐ గోనెం రాకేశ్‌ను ఆశ్రయిస్తే తమతో అవమానకరంగా ప్రవర్తించారని, తాము ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకోకుండా తనపై అక్రమంగా కేసులు నమోదు చేశాడని చంద్రాగౌడ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.


మోసం చేసినందుకే కేసు : ఎస్‌ఐ

ఈ విషయమై ఎస్‌ఐ గోనెం రాకేశ్‌ను వివరణ కోరగా.. బొందిలి స్వరూపరాణికి సంబంఽధించిన భూ   ఒప్పందం ప్రకారం నడుచుకోకుండా మోసం చేయడంతో రంగు చంద్రాగౌడ్‌పై కేసు నమోదైందన్నారు. 


తప్పుడు ఫిర్యాదు అని కమిషన్‌ను ఆశ్రయించిన తివారి దినేష్‌

రంగు చంద్రాగౌడ్‌ తమపై చేసిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు పూర్తిగా అవాస్తవమని పేర్కొంటూ స్వరూపరాణి కుమారుడు తివారి దినేష్‌ శుక్రవారం మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. చంద్రాగౌడ్‌ వద్ద రూ. 20లక్షలను రూ. 2 వడ్డీ చొప్పున అప్పుగా తీసుకుని రెండేళ్లుగా నెలకు రూ.40 వేలు చెల్లిస్తున్నామని, తమకు తెలియకుండా భూమిని అక్రమంగా మార్పిడి చేయించుకున్నాడని తెలిపారు. తమను మోసం చేసిన చంద్రాగౌడ్‌పై చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.

Updated Date - 2021-06-19T05:44:42+05:30 IST