బంగారం పేరుతో టోకరా

ABN , First Publish Date - 2020-07-11T10:35:13+05:30 IST

ఓ వ్యక్తి ఆశను ఆసరాగా చేసుకుని, నకిలీ బంగారం అంటగట్టి రూ.25 లక్షలతో కొందరు దుండగులు ఉడాయించిన సంఘటన బత్తలపల్లిలో

బంగారం పేరుతో టోకరా

రూ.25 లక్షలతో ఉడాయించిన దుండగులు

లబోదిబోమన్నప్రొద్దుటూరు వాసి.. 

బత్తలపల్లి పోలీసులకు ఫిర్యాదు 


ధర్మవరం, జూలై 10 : ఓ వ్యక్తి ఆశను ఆసరాగా చేసుకుని, నకిలీ బంగారం అంటగట్టి రూ.25 లక్షలతో కొందరు దుండగులు ఉడాయించిన సంఘటన బత్తలపల్లిలో శుక్రవారం జరిగింది. దీంతో బాధితుడు లబోదిబోమంటూ బత్తలపల్లి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి... బళ్లారికి చెందిన ఇద్దరు వ్యక్తులు 15 రోజుల కిందట కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన బాల చెన్నారెడ్డికి ఫోన్‌ చేశారు. అందులో ఓ వ్యక్తి మాట్లాడుతూ మీ పొలంలో పండిన దానిమ్మకాయలు తీసుకెళ్లడానికి వచ్చిన ఐషర్‌ వాహనానికి డ్రైవర్‌గా వచ్చినట్టు పరిచయం చేసుకున్నాడు.


యోగక్షేమాలు అడిగిన తరువాత తమ ఇంటి పక్కన  ఇంటి నిర్మాణం చేపడుతుండగా 5 కేజీలు బంగారం దొరికిందని, కేజీ రూ.15 లక్షలకే ఇస్తారని చెప్పాడు. దీంతో వారం కిందట బాల చెన్నారెడ్డి బళ్లారి సమీపంలోని ఓ గ్రామానికి  వెళ్లి వారిని కలిశాడు. వారు రెండు బంగారు నాణేలు ఇచ్చారు. ప్రొద్దుటూరుకు వెళ్లి వాటిని బంగారు షాపులో తనిఖీ చేయించగా మేలిమి బంగారంగా తేలింది. అప్పటి నుంచి రోజు ఫోన్‌లో సంభాషణలు జరిగాయి. కిలో రూ.10 లక్షలకు ఇచ్చేలా మాట్లా డుకున్నారు. తన వద్ద ఉన్న రూ.25 లక్షల డబ్బులతో పాటు బంగారాన్ని పరీక్షించేందుకు ఓ కంసాలి ఆచారిని తీసుకుని వారు చెప్పిన  ప్రకారం బాల చెన్నారెడ్డి అ నంతపురం వెళ్లాడు. అక్కడికి వెళ్లి ఫోన్‌ చేయగా వాళ్లు బత్తలపల్లికి రమ్మన్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో బత్తలపల్లి సమీపంలోని కట్టకిందపల్లి బస్టాప్‌ వద్దకు వెళ్లారు. అక్కడికి కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు తమ వద్ద 5 కేజీల నాణేలు ఉన్నాయని చెప్పారు.


అయితే తన వద్ద రెండు కేజీల బంగారానికే డబ్బులు ఉన్నాయని, అందుకు తగ్గట్టుగా నాణేలు ఇవ్వాలని వారిని అడిగాడు. బంగారమంతా తీసుకోవాలని మిగిలిన డబ్బు తరువాత ఇవ్వవచ్చని చెప్ప డంతో రూ. 25 లక్షలను వారికి ఇచ్చాడు. అనంతరం వారి వద్ద ఉన్న నాణేల బ్యాగును ఇచ్చి కారులో వెళ్లిపోయారు. ఆచారి ఆ నాణేలను పరిశీలిస్తుండగానే ఆ దుండగులు ఉడాయించారు. నాణేలు పరిశీలించగా  నకిలీవని తేలడంతో లబోదిబోమంటూ బత్తలపల్లి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తనకు జరిగిన మోసంపై ఫిర్యాదు చేసినట్టు బాల చెన్నారెడ్డి తెలిపాడు.   పోలీసులు కేసు నమోదు చేసుకుని దుండగుల కోసం  గాలింపు చర్యలు      చేపట్టారు. 

Updated Date - 2020-07-11T10:35:13+05:30 IST