‘కోవాగ్జిన్ వికటిస్తే బాధితులకు నష్టపరిహారం’

ABN , First Publish Date - 2021-01-16T19:33:17+05:30 IST

భారత్ బయోటెక్ అందిస్తున్న కోవాగ్జిన్ వాక్సిన్ తీసుకున్నవారికి దుష్ఫలితాలు

‘కోవాగ్జిన్ వికటిస్తే బాధితులకు నష్టపరిహారం’

న్యూఢిల్లీ : భారత్ బయోటెక్ అందిస్తున్న కోవాగ్జిన్ వాక్సిన్ తీసుకున్నవారికి దుష్ఫలితాలు వస్తే, బాధితులకు ప్రామాణిక వైద్య చికిత్సను అందించడంతోపాటు నష్టపరిహారం చెల్లిస్తారు. కోవిడ్-19 నిరోధక కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకునేవారు ముందుగా ఓ అంగీకార పత్రంపై సంతకం చేయవలసి ఉంటుంది. ఈ అంగీకార పత్రంలో కొన్ని షరతులు, నిబంధనలను పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ తర్వాత ఏమైనా దుష్ఫలితాలు కనిపిస్తే, అందుకు కారణం ఆ వ్యాక్సినేనని రుజువైతే, ఆ వ్యాక్సిన్ బాధితులకు వైద్య సంరక్షణతోపాటు నష్టపరిహారం చెల్లిస్తామనే నిబంధనలు దీనిలో ఉన్నాయి. 


కోవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకునేవారు సంతకం చేయవలసిన అంగీకార పత్రంలో, ‘‘వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఏమైనా తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన సందర్భంలో, వారికి ప్రభుత్వం నిర్దేశించిన, అధీకృత సెంటర్లు/హాస్పిటల్స్‌లో వైద్యపరంగా గుర్తింపు పొందిన ప్రామాణిక సంరక్షణను అందజేస్తాం. వ్యాక్సిన్ వేసుకున్న కారణంగా తీవ్రమైన ప్రతికూల పరిస్థితి ఏర్పడినట్లు రుజువైతే, ఆ తీవ్రమైన ప్రతికూల సంఘటనకు  స్పాన్సర్ (బీబీఐఎల్) నష్టపరిహారం చెల్లిస్తుంది. ఈ నష్టపరిహారాన్ని ఐసీఎంఆర్‌కు చెందిన సెంట్రల్ ఎథిక్స్ కమిటీ తగినవిధంగా నిర్ణయిస్తుంది’’ అని పేర్కొన్నారు. 


మన దేశంలో అత్యవసర పరిస్థితిలో పరిమితంగా వినియోగించేందుకు అనుమతి పొందిన రెండు వ్యాక్సిన్లు - కోవాగ్జిన్, కోవిషీల్డ్. ఇదిలావుండగా, కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకునేవారు ఎటువంటి అంగీకార పత్రంపైనా సంతకం చేయవలసిన అవసరం లేదు. కానీ కోవాగ్జిన్ తీసుకునేవారు అంగీకార పత్రంపై సంతకం చేయవలసి ఉంటుంది. కోవాగ్జిన్ తీసుకున్నవారికి ఓ ఫ్యాక్ట్-షీట్‌ను, ప్రతికూల ఫలితాలను తెలియజేసేందుకు ఓ ఫారంను ఇస్తారు. కోవాగ్జిన్‌ను తీసుకున్ననాటి నుంచి వారం రోజుల్లో ఆరోగ్యపరంగా ఎదురైన పరిస్థితులను ఈ ఫారంలో రాయవలసి ఉంటుంది. జ్వరం, నొప్పి, ఎరుపుదనం, మంట వంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడినపుడు ఈ ఫారంలో రాయాలి. 



Updated Date - 2021-01-16T19:33:17+05:30 IST