Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

పరిహారం.. ఫ్రీజ్‌!

twitter-iconwatsapp-iconfb-icon
పరిహారం.. ఫ్రీజ్‌!తితలీ బాధితుల వివరాలు నమోదు చేస్తున్న ఉద్యానవన శాఖ అధికారులు

ఖాతాలో జమ అయిన రెండు రోజులకే..
లబోదిబోమంటున్న ‘తితలీ’ బాధితులు
న్యాయం చేయాలని ‘స్పందన’లో ఫిర్యాదు
(పలాస)

తితలీ తుఫాన్‌ బాధితులకు పరిహారం పంపిణీలో మాయాజాలం నెలకొంది. టీడీపీ హయాంలో అర్హులకు అన్యాయమైందని, తాము అధికారంలోకి వస్తే రెట్టింపు పరిహారం అందజేస్తామని వైసీపీ అధినేత జగన్‌ పాదయాత్ర సమయంలో ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత ఇటీవల 92వేల మంది రైతులకు పరిహారంగా రూ.182 కోట్లు విడుదల చేశారు. ఇంకా 16వేల మంది రైతుల జాబితా గల్లంతైంది. అలాగే కొంతమంది రైతుల ఖాతాలో కేవలం రూపాయే జమయింది. మరికొంతమంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడినా.. వాటిని ఫ్రీజ్‌ చేయడంతో బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
-------------

తితలీ బాధితులకు మళ్లీ నిరాశ తప్పలేదు. వైసీపీ ఇచ్చిన హామీ మేరకు అదనపు పరిహారం కోసం ఇన్నాళ్లూ బాధితులు ఎదురుచూశారు. ఇటీవల ప్రభుత్వం పరిహారం మంజూరు చేయగా.. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమయిన రెండు రోజులకే ఫ్రీజ్‌ చేయడంలో రైతుల్లో కలవరం రేగుతోంది. 2018 అక్టోబరు 11న తితలీ తుఫాన్‌ ఉద్దానం ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. జీడి, మామిడి, కొబ్బరి, పనస చెట్లు నేలమట్టమయ్యాయి. 45వేల గృహాలు కూలిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అతి పెద్ద విపత్తుగా ప్రకటించాయి. అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలాసలో వారం రోజులు మకాం వేసి సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 1.06 వేల మంది రైతులను బాధితులుగా గుర్తించి.. నష్ట పరిహారం కింద రూ.500 కోట్లు విడుదల చేశారు. ఈ పరిహారం చాలదని.. చాలామంది అర్హులకు అన్యాయమైందని, తాను అధికారంలోకి వస్తే రెట్టింపు పరిహారం అందజేస్తామని ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత జగన్‌ ప్రకటించారు. ఎట్టకేలకు ఇటీవల పరిహారం మంజూరు చేశారు. 92వేల మంది రైతులకు పరిహారంగా రూ.182 కోట్లు విడుదల చేశారు. పలాస మండలం బొడ్డపాడులో రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేతులమీదుగా.. మంత్రి సీదిరి అప్పలరాజు రైతులకు నష్ట పరిహారం చెక్కులు అందజేశారు. కాగా ఖాతాల్లో జమయిన రెండు రోజుల తర్వాత వీటిని ఫ్రీజ్‌ చేస్తున్నట్టు బ్యాంకు అధికారులు ప్రకటించడంతో రైతులు ఖంగుతిన్నారు. దీనిపై బ్యాంకర్లను ప్రశ్నించినా.. స్పష్టమైన సమాధానం చెప్పకపోవడంతో అయోమయం చెందుతున్నారు. వీరంతా ఆర్డీవో కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దీనిపై సోమవారం ఆర్డీవో స్పందన కార్యక్రమంలో నందిగాం, పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాలకు చెందిన వందలాది మంది రైతులు ఫిర్యాదు చేశారు. అలాగే తాజా జాబితాలో సుమారు 16వేల మంది రైతుల పేర్లు గల్లంతవడంతో వారు కూడా అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేవలం తితలీ బాధితుల కోసం ఉద్యానశాఖ అధికారులను రప్పించి.. వారితో రైతుల వివరాలను మళ్లీ సేకరిస్తున్నారు. గత టీడీపీ హయాంలో పొందిన నష్టపరిహారం, ప్రస్తుత పరిహారంలో తేడాలను గుర్తిస్తున్నారు. వాటిని సరిచేసేందుకు ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేశారు. టీడీపీ హయాంలో అనర్హులకు పరిహారం పడిందని ప్రజాప్రతినిధులు ఆరోపించారు. సచివాలయ ఉద్యోగుల సర్వే ద్వారా అనర్హుల పేర్లను తొలగించామని ప్రకటించారు. కాగా, ఇప్పుడు కూడా కొంతమంది అర్హుల పేర్లు జాబితాలో గల్లంతవడంతో బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేసి పరిహారం అందజేయాలని కోరుతున్నారు.

మృతుల కుటుంబాలకు నిరాశే
పరిహరం విషయంలో మృతుల కుటుంబాలకు నిరాశ తప్పడం లేదు. గతంలో పరిహారం పొందిన లబ్ధిదారుల్లో సుమారు 500 మంది కరోనా, వివిధ కారణాలతో మృతి చెందారు. వారికి చెందిన పరిహారంపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. ఉదాహరణకు పలాస మండలానికి చెందిన బతకల గీత కుటుంబం ఐదు ఎకరాల్లో కొబ్బరి సాగు చేసింది. తితలీ తుఫాన్‌ దెబ్బకు చెట్లన్నీ నేలకూలి తీవ్ర నష్టం వాటిల్లింది. నష్ట పరిహారం కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పటివరకు రూపాయి కూడా రాలేదు. కొన్నాళ్ల కిందట ఆమె భర్త మృతి చెందారు. దీంతో చిన్న పిల్లలతో తాను ఎలా బతకగలనని.. పరిహారం మంజూరు చేసి ఆర్థికంగా ఆదుకోవాలని అధికారులను వేడుకుంటోంది.

రైతులందరికీ వర్తింపజేయాలి
పెంచిన తితలీ తుఫాన్‌ నష్టపరిహారం రైతులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సంగారు లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం పలాస రెవెన్యూ కార్యాలయం వద్ద  రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. సుమారు 6 వేల మంది రైతుల వివరాలు జాబితాలో లేవని, పరిహారం అందని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై జిల్లావ్యాప్తంగా ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు. అనంతరం ఆర్డీవో సీతారామ్మూర్తికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం జిల్లా నాయకులు బి.ఆనందరావు, టి.భాస్కరరావు, ఎన్‌.గణపతి, ఎన్‌.చంద్రయ్య, బి.ఓంకార్‌, బి.సుగుణావతి పాల్గొన్నారు.  

జాబితాలో పేరు లేదు
టీడీపీ హయాంలో నాకు 8 కొబ్బరిచెట్లకు సంబంధించి రూ.12వేలు పరిహారం ఇచ్చారు. తాజాగా అంతే మొత్తం నా ఖాతాలో జమవ్వాలి. దీనిపై అధికారులను అడగ్గా.. జాబితాలో నారు పేరు లేదని చెబుతున్నారు. అధికారులే న్యాయం చేయాలి.
- గుంట ఽధర్మారావు, డబారు, మందస మండలం  

డబ్బులు కనిపిస్తున్నా..
నాకు రెండు ఎకరాలకు సంబంధించి రూ.1.65 లక్షల నష్ట పరిహారం బ్యాంకులో జమయింది. డబ్బులు తీసుకుందామని బ్యాంకు వెళ్లగా.. ఫ్రీజ్‌ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. మూడేళ్లుగా పరిహారం కోసం ఎదురుచూస్తున్న మాకు నిరాశే మిగిలింది.  
- బొడ్డు జగన్నాథరావు, నల్లబొడ్లూరు, మందస మండలం
 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.