పరిహారం.. పరిహాసం

ABN , First Publish Date - 2022-08-11T05:35:54+05:30 IST

గత నెలలో వారం రోజుల పాటు ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలను కోల్పోయిన రైతులకు, ఇళ్లు పూర్తిగా, పాక్షికంగా కూలిన వారికి ఇవ్వాల్సిన పరిహారాన్ని ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

పరిహారం.. పరిహాసం
కాల్వశ్రీరాంపూర్‌ మండలంలో ఇసుక మేటలు వేసిన పొలం

- 20 రోజులు గడుస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం

- పంటలు కోల్పోయిన రైతులకు దక్కని పరిహారం

- ఇళ్లు కూలిన వారిలో అందరికీ అందని సాయం

 (ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

గత నెలలో వారం రోజుల పాటు ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలను కోల్పోయిన రైతులకు, ఇళ్లు పూర్తిగా, పాక్షికంగా కూలిన వారికి ఇవ్వాల్సిన పరిహారాన్ని ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. గత నెల 9 నుంచి 16వ తేదీ వరకు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలకు పెద్ద ఎత్తున గోదావరి, మానేరు నదులతో పాటు హుస్సేనిమియా వాగు, ఇతర వాగులు ఉప్పొంగాయి. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టుల గేట్లను ఎత్తడంతో గోదావరి వరద గోదారిలా మారింది. రికార్డు స్థాయిలో వరదలు వచ్చాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి దిగువకు సుమారు 13 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలిపెట్టారు. దీంతో గోదావరిఖని, రామగుండం, మంథని ప్రాంతాల్లోని పలు కాలనీలు, గ్రామాల్లోకి వరద నీరు వచ్చింది. అనేక ఇళ్లు కూలాయి. ఇక్కడే గాకుండా ఆయా మండలాల్లో వరి, పత్తి పంటలు చాలా వరకు దెబ్బతిన్నాయి. వరద నష్టాన్ని, పంటల నష్టాన్ని, కూలిన ఇళ్ల గురించి సంబంధిత శాఖాధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించినప్పటికీ పరిహారాన్ని ఇప్పటి వరకు విడుదల చేయలేదు. 

- కూలిన ఇళ్లు.. దెబ్బతిన్న పంటలు..

జిల్లా వ్యాప్తంగా 576 ఇళ్లు పాక్షికంగా, 15 ఇళ్లు పూర్తిగా కూలాయి. పాక్షిక్షంగా దెబ్బతిన్న ఇళ్లకు తక్షణ సాయం కింద 5,200 రూపాయలు, పూర్తిగా కూలిన ఇళ్లకు 95,100 రూపాయల సాయాన్ని ఇవ్వాల్సి ఉంది. కేవలం కొన్ని మండలాల్లో మాత్రమే బాధితులకు సాయాన్ని అందజేశారు. వరదలకు బాగా దెబ్బతిన్న మంథని పట్టణం, గ్రామాల్లో 84కు పైగా ఇళ్లు కూలగా, ఇప్పటి వరకు బాధితులకు సాయం అందలేదు. మరికొన్ని గ్రామాల్లో దెబ్బతిన్న ఇళ్లకు సాయం పంపిణీ కాలేదు. అలాగే వరి, పత్తి పంటలకు తీరని నష్టం వాటిల్లింది. జిల్లాలోని 144 గ్రామాల్లో 7,485 ఎకరాల్లో 4796 మంది రైతులకు చెందిన పత్తి పంట దెబ్బతిన్నది. ఇందులో 33 శాతం లోపు 109 గ్రామాల్లో 2819 మంది రైతులకు చెందిన 4735 ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. 33 శాతానికి పైగా 35 గ్రామాల్లో 1977 మంది రైతులకు చెందిన 2750 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నది. 46 గ్రామాల్లో 556 మంది రైతులకు చెందిన వెయ్యి ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. మంథని ప్రాంతంలో కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌తో నీట మునగగా, చాలా వరకు ఇసుక మేటలు వేశాయి. 33 శాతం లోపు 32 గ్రామాల్లో 479 రైతులకు చెందిన 816 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. 33 శాతానికి పైగా 13 గ్రామాల్లో 77 మంది రైతులకు చెందిన 184 ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. ఈ పంటలకు పరిహారాన్ని ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇరవై రోజులు కావస్తున్నా ఇవ్వలేదు. కనీసం ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చినా రైతులకు కొంత మేరకు మేలు జరిగేది. ఇసుక మేటలు వేసిన పొలాలు ఈ సీజన్‌లో తిరిగి సాగు చేసేందుకు పనికి రావు. 

- నివేదికలు కాగితాలకే పరిమితం..

మానేరు తీరం వెంబడి ఉండే కాల్వశ్రీరాంపూర్‌ మండలంలోని పలు గ్రామాల్లోని వరి పొలాలు బాగా ఇసుక మేటలు వేశాయి. ఈ భూముల్లో మళ్లీ సాగు చేయాలంటే దానిని యంత్రాల సహాయంతో లెవెలింగ్‌ చేయించాల్సి ఉంటుందని రైతులు చెబుతున్నారు. కొందరు రైతులు వరి నాట్లు కొట్టుకుపోయిన భూముల్లో మళ్లీ నార్లు పోసి దుక్కులు దున్నుతున్నారు. వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నప్పుడల్లా వ్యవసాయ శాఖాధికారులు వెంటనే సర్వే చేసి ఆ నివేదికలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు పంపిస్తున్నప్పటికీ ఆ నివేదికలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. ప్రతి ఏటా రైతులు అతివృష్టి, అనావృష్టిల కారణంగా నష్ట పోతున్నారు. వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆదుకోక పోవడంతో అప్పుల పాలవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలని, ఇళ్లు కూలిన బాధితులకు సహాయాన్ని తక్షణమే విడుదల చేయాలని ఆయా పార్టీల నాయకులు కోరుతున్నారు. 


 


Updated Date - 2022-08-11T05:35:54+05:30 IST