ఉచితాల కట్టడికి నిపుణుల కమిటీ!

ABN , First Publish Date - 2022-08-04T10:34:59+05:30 IST

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత పథకాల పంపిణీ హామీలివ్వడం తీవ్ర ఆర్థిక అంశమని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఉచితాల కట్టడికి నిపుణుల కమిటీ!

  • అందులో సభ్యులుగా నీతి ఆయోగ్‌, ఆర్థిక సంఘం, లా కమిషన్‌, ఆర్‌బీఐ
  • పాలక, ప్రతిపక్షాలు కూడా ఉండాలి
  • కమిటీ కూర్పుపై వారంలోగా
  • మీ అభిప్రాయాలు చెప్పండి
  • ఈసీ, కేంద్రం, సిబల్‌, పిటిషనర్లకు
  • చీఫ్‌ జస్టిస్‌ రమణ ధర్మాసనం ఆదేశం
  • ఉచితాలపై పార్లమెంటులో చర్చించాలి
  • న్యాయవాది కపిల్‌ సిబల్‌ సూచన
  • ఏ పార్టీ ఇందుకు అంగీకరిస్తుంది?
  • అందరికీ ఉచితాలు కావలసిందే
  • సుప్రీం ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్య


న్యూఢిల్లీ, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత పథకాల పంపిణీ హామీలివ్వడం తీవ్ర ఆర్థిక అంశమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ హామీల నియంత్రణకు అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు అవసరమని అభిప్రాయపడింది. ఇందులో నీతి ఆయోగ్‌, ఆర్థిక సంఘం, లా కమిషన్‌, ఆర్‌బీఐతో పాటు పాలక, ప్రతిపక్షాలు, ఇతర భాగస్వాములు కూడా సభ్యులుగా ఉండాలని పేర్కొంది. పార్టీల ఉచిత హామీలను ఏ విధంగా నియంత్రించాలో ఈ కమిటీ నిర్మాణాత్మక సూచనలు చేయాలని కోరింది. సదరు కమిటీ కూర్పుపై కేంద్రం, ఎన్నికల కమిషన్‌ (ఈసీ), సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌, పిటిషనర్లు తమ తమ అభిప్రాయాలను వారం రోజుల్లో తెలియజేయాలని చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ కృష్ణమురారి, జస్టిస్‌ హిమా కోహ్లిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీచేసింది. ఎన్నికల్లో లబ్ధి కోసం, ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు వివక్షాపూరితంగా హామీలిస్తున్నాయని.. హేతుబద్ధత లేని ఉచిత పథకాలను ప్రకటిస్తున్నాయని.. వీటిని కట్టడి చేయాలని కోరుతూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇది తీవ్ర వ్యవహారమని గత వారం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై తన వైఖరిని స్పష్టం చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. సిబల్‌ ఎవరి తరఫునా న్యాయవాది కానప్పటికీ ఈ అంశంపై సలహాలివ్వాలని ఆయన్ను కోరింది. ఈ పిటిషన్‌ బుధవారం మళ్లీ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటును ధర్మాసనం ప్రస్తావించింది. అయితే ఈ వ్యవహారంపై పార్లమెంటు చర్చించాలని సిబల్‌ సూచించారు. దీనికి జస్టిస్‌ రమణ స్పందిస్తూ.. ‘ఈ అంశంపై పార్లమెంటులో చర్చ జరుగుతుందని మీరు భావిస్తున్నారా? ఏ రాజకీయ పార్టీ చర్చిస్తుంది..? ఏ పార్టీ కూడా ఉచితాలను వ్యతిరేకించదు. ఈ రోజుల్లో అందరికీ ఉచితాలు కావాలి. ఫలానా పార్టీ  అని పేరు చెప్పను. అన్ని పార్టీలూ వీటి నుంచి లబ్ధి పొందుతున్నాయి’ అని పేర్కొన్నారు.

 

ఆర్‌బీఐని ఇంప్లీడ్‌ చేయాలి..

రాజకీయ పార్టీలు ఉచిత హామీలిచ్చేటప్పుడు.. పబ్లిక్‌ డెట్‌ను (ప్రజలపై ఉన్న అప్పులను) పరిగణనలోకి తీసుకోవాలని  పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది వికాస్‌ సింగ్‌ అన్నారు. ఇది ఆర్థిక క్రమశిక్షణకు సంబంధించిన అంశమైనందున ఇందులో ఆర్‌బీఐని కక్షిదారుగా చేర్చాలని ప్రతిపాదించారు. ‘ఏదైనా ఉచిత పథకం హామీ ఇస్తున్నారంటే.. దానికి ఎక్కడి నుంచి డబ్బు తెస్తారో పార్టీలు చెప్పాలి. ఏ శాఖ పద్దు నుంచి ఆ మొత్తం ఇస్తారో చూపించాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు. సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా స్పందిస్తూ.. ఉచితాలను నియంత్రించకుంటే దేశానికి ఆర్థిక విపత్తు సంభవిస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ అంశంలో ఈసీ చేతులెత్తేసిందని చీఫ్‌ జస్టిస్‌ ప్రస్తావించగా.. తన వైఖరిని సమీక్షించుకోవాలని దానికి సూచించాలని మెహతా అన్నారు. ఈసీ తరఫు న్యాయవాది అమిత్‌ శర్మ స్పందిస్తూ.. 2013లో ఎస్‌.సుబ్రమణియం బాలాజీ వర్సెస్‌ తమిళనాడు కేసులో.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో ఉచితాలకు సంబంధించిన మార్గదర్శకాలను చేర్చాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. దీనిపై నమూనా మేనిఫెస్టోను రూపొందించాల్సిందిగా ఈసీకి సూచించాలని సీనియర్‌ న్యాయవాది వికాస్‌ సింగ్‌ ప్రతిపాదించారు. దాని ప్రకారం ఉచిత పథకాలకు చెల్లించే డబ్బును ఎక్కడి నుంచి తీసుకొస్తారో పార్టీలు తెలియజేయాల్సి ఉంటుందన్నారు. 


పిటిషన్‌లోని అంశం తీవ్రమైనదని.. నమూనా మేనిఫెస్టో శుష్క ప్రక్రియ అని చీఫ్‌ జస్టిస్‌ రమణ పేర్కొన్నారు. ‘ఇవన్నీ పసలేని ఆలోచనలు. ప్రవర్తనా నియమావళి ఎప్పుడు అమల్లోకి వస్తుంది..? ఎన్నికల ముందే కదా! నాలుగేళ్లు ఏదో చేస్తారు.. చివరిలో ప్రవర్తనా నియమావళిని చొప్పిస్తారు. ఈ వ్యవహారంలో ఏమీ చేయలేమని ఈసీ, కేంద్రం అనజాలవు. ఈ అంశాన్ని పరిశీలించి సూచనలు ఇవ్వాల్సిందే’ అని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజనం, పేదలకు రేషన్‌ నుంచి ఉచిత కరెంటు వరకు అనేక ఉచితాలు ఉన్నాయని.. వీటన్నిటినీ నిషేధిస్తూ ఏకరూప ఆదేశాలివ్వరాదని సిబల్‌ తెలిపారు. వీటిలో కొన్ని సంక్షేమ పథకాలు బలహీన వర్గాలకు అవసరమని చెప్పారు. మిగతావి ప్రజాకర్షక స్కీములని వెల్లడించారు. అయితే అందరు భాగస్వాముల అభిప్రాయాలు తెలుసుకోనిదే తామెలాంటి ఆదేశాలూ జారీచేయబోమని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఏ విధమైన మార్గదర్శకాలూ ఇవ్వబోవడం లేదన్నారు. ‘ఇది చాలా ముఖ్యమైన అంశం. వివిధ వర్గాలు, భాగస్వాముల అభిప్రాయాలు తెలుసుకోవలసిన అవసరం ఉంది. వాటి అమలుపై ఈసీ, కేంద్రమే చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. 


అత్యాచారం కేసులో బెయిల్‌పై వచ్చి..

మళ్లీ అదే బాధితురాలిపై అత్యాచారం

జబల్‌పూర్‌, ఆగస్టు 3: రెండేళ్ల క్రితం ఓ బాలికపై అత్యాచారం చేసి అరెస్టయిన ఓ వ్యక్తి.. తాజాగా బెయిల్‌పై విడుదలై అదే బాధితురాలిపై మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. పైగా.. ఈ దారుణాన్ని తన స్నేహితుడితో వీడియో కూడా తీయించాడు. గతంలో తనపై పెట్టిన అత్యాచారం కేసును ఉపసంహరించుకోకుంటే.. ఆ వీడియోను సోషల్‌మీడియాలో పెడతానంటూ బెదిరించాడు. నెల క్రితం మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ జిల్లాలో జరిగిన ఈ ఘోరం.. బుధవారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలిపై 2020లో ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ కేసులో అరెస్టయిన అతడు.. ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చి.. మళ్లీ ఆమె పైనే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

Updated Date - 2022-08-04T10:34:59+05:30 IST