కమాండర్ ఇన్ చీఫ్ మోదీ!

ABN , First Publish Date - 2021-07-14T05:58:32+05:30 IST

వాతావరణం ప్రతికూలంగా కనిపిస్తున్నప్పుడు, తన నాయకత్వ సామర్థ్యంపై పార్టీలోనూ, బయటా రణగొణ ధ్వనులు వినిపిస్తున్నప్పుడు, తన గ్రాఫ్ పడిపోతున్నదా....

కమాండర్ ఇన్ చీఫ్ మోదీ!

వాతావరణం ప్రతికూలంగా కనిపిస్తున్నప్పుడు, తన నాయకత్వ సామర్థ్యంపై పార్టీలోనూ, బయటా రణగొణ ధ్వనులు వినిపిస్తున్నప్పుడు, తన గ్రాఫ్ పడిపోతున్నదా అని తనకే అనుమానాలు వచ్చినప్పుడు, తన చర్యలు దేశంలోనూ, విదేశాల్లోనూ ప్రశ్నార్థకం అవుతున్నప్పుడు నాయకుడు అనేవాడు ఉన్నట్లుండి తాను ఆడుతున్న శైలి మార్చి అందరి దృష్టినీ తన వైపుకు తిప్పుకుని, క్రమంగా పరిస్థితులను తనకు అనుకూలం చేసుకుని, పట్టు బిగించే ప్రయత్నాలు చేయడం చాలా సహజం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు అవే ప్రయత్నాలు ప్రారంభించారు. కరోనా మహమ్మారి రెండో ప్రభంజనం సృష్టించిన కల్లోలంలో ప్రభుత్వ వైఫల్యం గురించి అంతటా ప్రశ్నలు లేవనెత్తుతున్నప్పుడు, బెంగాల్ ఎన్నికల్లో అనుకున్నట్లుగా విజయం సాధించలేకపోయినప్పుడు, ఆర్థిక వ్యవస్థ గాడి తప్పినప్పుడు మోదీ కొత్త ఎత్తుగడలు వేసే ప్రయత్నాలు చేశారు. కాకపోతే 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆయన పావులు కదపాల్సి వస్తే, ఇప్పడు రెండేళ్లు ముందుగానే ఆయన తన దిశను మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాల విమర్శల నేపథ్యంలో కరోనా వాక్సిన్ విధానాన్ని మార్చుకోవడం, మరో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం, జమ్ము, కశ్మీర్‌లో రాజకీయ ప్రక్రియ ప్రారంభించడం, ఇప్పుడు తాజాగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరపడం మోదీ చేపట్టిన కీలక చర్యల్లో కొన్ని.


మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టడం అనేది ఏ నాయకుడికైనా ఒక రాజకీయ అవసరం. కనీస ప్రభుత్వం- గరిష్ఠ పాలన అన్నది ఆచరణ సాధ్యం కాదు అని గ్రహించినందువల్లే మోదీ 78 మందితో తన మంత్రివర్గాన్ని విస్తరించారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టే ముందు ఆయన పార్టీ అగ్రనేతలతో సుదీర్ఘ చర్చలు నిర్వహించారు. ఎంపీలతో మాట్లాడారు. మంత్రివర్గ పూర్తి స్థాయి సమావేశాలను రెండు సార్లు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై తన నియంత్రణను బలోపేతం చేసే చర్యలు తీసుకున్నారు. ఇవన్నీ చేసిన తర్వాతే ఆయన తన ఇష్టం వచ్చిన వారిని ఇష్టం వచ్చిన శాఖల్లో నియమించారు. ఇది పూర్తిగా మోదీ బ్రాండ్ ఉన్న మంత్రివర్గం. గతంలో నరసింహారావు, మన్మోహన్ సింగ్, వాజపేయి లాంటి వారు మంత్రివర్గంలో మార్పులు చేపడితే ఎవరెవరు మంత్రివర్గంలో ఉంటారో ఊహించడం చాలా సులభంగా ఉండేది.


అయితే ఈ మార్పులు చేసే క్రమంలో సీనియర్ నాయకులైన ప్రకాశ్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్‌లు ఇద్దర్నీ ఎందుకు తొలగించారు? నిజానికి వారు పార్టీ తరఫున, ప్రభుత్వం తరపున బలంగా మాట్లాడుతున్నవారు. ఏళ్ల తరబడి మీడియాలో కనపడుతున్నందువల్ల వారు చెప్పేదానికి ప్రాధాన్యత కూడా లభించేది. వారు తమ మంత్రిత్వశాఖల్ని సరిగా నిర్వహించలేదనుకుంటే, వారిని ఇతర మంత్రిత్వశాఖలకు మార్చవచ్చు. వారికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పజెప్పాలనుకుంటే ఆ విషయం ముందే వారికి చెప్పి, బహుళ ప్రాచుర్యం ఇచ్చిన తర్వాత ఆ పనిచేసి ఉండవచ్చు కాని మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి గంట ముందే వారికి ఆ విషయం చెప్పి హతాశులను చేసి, అవమానపరచాల్సిన అవసరం ఏమిటి? వాజపేయి, ఆడ్వాణీలకు చెందిన గతానికి అవశేషాలుగా ఉన్న ఆ ఇరువురినీ తొలగించడం ద్వారా మోదీ తన ప్రత్యేకత, విశిష్టత నిరూపించుకోవాలనే ఆ విధంగా చేశారు. మోదీ తన టీమ్‌ను నిర్ణయించుకున్న తీరు అధ్యక్ష పాలనా వ్యవస్థను సూచిస్తున్నదనడంలో సందేహం లేదు. కరోనా మహమ్మారి రెండో ప్రభంజనం వైఫల్యానికి డాక్టర్ హర్షవర్ధన్‌ను బలి చేయడం కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయం. నిజానికి కరోనా ప్రారంభమైనప్పటి నుంచీ మోదీయే ఆరోగ్య శాఖను పూర్తిగా తన అధీనంలోకి తీసుకున్నారు. నీతీ ఆయోగ్‌ను రంగంలో దించారు. టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేశారు. అనేకసార్లు అధికారుల సమావేశాలను ఏర్పాటు చేశారు. కరోనా వైఫల్యానికి హర్షవర్ధన్ కారణమైతే అందుకు బాధ్యత ప్రధానమంత్రి కూడా వహించాల్సి ఉంటుంది. అసలు వైఫల్యమే కొలమానమైతే ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం కావడానికి ఎవర్ని బాధ్యులు చేయాలి?


ఉత్తరప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓబీసీలను, దళితుల్లో ఉపకులాలను తమవైపుకు తిప్పుకునే ఉద్దేశంతో మంత్రివర్గంలో ఈ వర్గాలకు చెందిన అత్యధికులకు అవకాశాలు కల్పించేందుకే ప్రధానంగా ఈ విస్తరణ జరిగిందనడంలో అతిశయోక్తి లేదు. కాని ‘సబ్ కా సాథ్- సబ్ కా విశ్వాస్’ అన్న నినాదాన్ని చేపట్టిన ప్రధానమంత్రి మంత్రివర్గంలో 2014 నుంచి ఒకే ఒక్క ముస్లిం మంత్రి, అది కూడా పెద్దగా ప్రాముఖ్యత లేని శాఖలో ఉన్నారు. కులాలకు, ఉపకులాలకు అంత ప్రాధాన్యత నిచ్చేవారు దేశంలో 14 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 19 శాతానికి పైగా ఉన్న ముస్లింలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఎందుకు ఇవ్వలేదని బిజెపి ప్రభుత్వాన్ని అడగడంలో అర్థం లేదు. దాని గురించి వారు చర్చించడానికి కూడా ఇష్టపడరు.


బిజెపిలో ప్రతిభ కొరత స్పష్టంగా కనపడుతున్నదనడానికి ఈ పునర్వ్యవస్థీకరణే నిదర్శనం. సివిల్ సర్వీస్‌కు చెందిన వారు ఏడుగురు మంత్రివర్గంలో ఉండడానికి కారణం ఏమిటి? పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖను నిర్వహిస్తున్న హర్దీప్ సింగ్ పురికి అది చాలదన్నట్లు పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వశాఖను కూడా అప్పగించారు. రాజకీయ అనుభవం ఏ మాత్రం లేని మాజీ ఐఎఎస్ అధికారి, తర్వాత కొన్ని కంపెనీల్లో సిఇఓగా పనిచేసి, గుజరాత్‌లో ఆటోమోటివ్ ఉత్పాదక యూనిట్లని పెట్టి వ్యాపారం చేసిన అశ్వినీ వైష్ణవ్‌కు ఐటీ, కమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖతో పాటు అత్యంత కీలకమైన రైల్వే మంత్రిత్వశాఖను అప్పగించాల్సిన అవసరం ఏమిటి? ఈ రెండు మంత్రిత్వశాఖల్లో కార్పొరేటీకరణ గతంలో వేగంగా జరగలేదని ఏమైనా భావించారా? ఉన్న మంత్రుల్లో సమర్థంగా పనిచేస్తున్న సీనియర్ నేత, బిజెపి మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరి నుంచి చిన్న, సూక్ష్మ, మధ్యతరహా సంస్థల మంత్రిత్వశాఖను తొలగించి కేవలం రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖనే మిగిల్చారు. గతంలో కూడా ఆయన నుంచి షిప్పింగ్, జల వనరులు, నదీజలాల అభివృద్ధి, గంగా ప్రక్షాళన మంత్రిత్వశాఖలను తీసేసుకున్నారు. ఒక సీనియర్ మంత్రి కంటే ఒక ఐఏఎస్ అధికారి ఒకటి కంటే రెండు మంత్రిత్వశాఖల్ని నిర్వహించగలరని మోదీ భావించారా? ఆరోగ్యంలో ఆయుష్, యోగా కూడా భాగమని, వాటిని సమగ్ర దృక్పథంతో అభివృద్ధి చేయాలని ఇంతకాలం చెబుతూ, ఇప్పుడు ఆరోగ్య శాఖనుంచి ఆయుష్‌ను, యోగాను తీసేసి అస్సాం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌కు అప్పగించడంలో ఆంతర్యం ఏమిటి? దేశంలో అత్యంత కీలకమైన, ప్రాముఖ్యత గల హోంమంత్రిత్వశాఖను నిర్వహిస్తున్న అమిత్ షాకు సహకార మంత్రిత్వశాఖ అనే కొత్త శాఖను సృష్టించి కేటాయించడంలో అసలు ఉద్దేశం ఏమిటి? సహకారం అనేది రాష్ట్రాలకు సంబంధించిన అంశం. గుజరాత్‌లో సహకార సంఘాలపై పట్టు సాధించడం ద్వారానే మోదీ హయాంలో బిజెపి రాష్ట్రంపై పట్టు బిగించింది. గ్రామీణ భారతంలోనూ అసంఘటిత ఆర్థిక వ్యవస్థలోనూ కీలక పాత్ర పోషిస్తున్న సహకార రంగాన్ని తన హస్తగతం చేసుకుని తమ పట్టును బలోపేతం చేసేందుకే ఈ శాఖను సృష్టించి అమిత్ షాకు అప్పగించారా? ప్రధానంగా మహారాష్ట్రలో సహకారసంఘాలపై పట్టు ఉన్న ఎన్ సిపి-–కాంగ్రెస్ పునాదిని దెబ్బతీయడమే ఉద్దేశమా? సాగు చట్టాలపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న రైతులను సహకార మార్గంలో మచ్చిక చేయాలనుకుంటున్నారా? పెద్ద నోట్ల రద్దు సమయంలో నగదు మార్పిడిలో కీలక పాత్ర పోషించిన పట్టణ, గ్రామీణ సహకార బ్యాంకులపై నియంత్రణ పొందాలనుకుంటున్నారా అన్న రకరకాల అనుమానాలు కలుగుతున్నాయి.


ఏమైనప్పటికీ పార్టీ, ప్రభుత్వంపై తన పట్టును పూర్తిగా బిగించేందుకే మోదీ ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టారనడంలో సందేహం లేదు. మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ముందే కాబోయే మంత్రులను పిలిపించి వెంటనే బాధ్యతలు స్వీకరించి, తమ తమ శాఖలను సమీక్షించి వాటిపై పట్టు సాధించాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రులను ఆదేశించిన మరునాడే బిజెపి జాతీయ కార్యాలయంలో ఆఫీసు బేరర్లందర్నీ తన కార్యాలయానికి పిలిచి దాదాపు అయిదుగంటల పాటు వారి పనితీరును సమీక్షించారు. కేంద్రంలో ఇప్పుడు ఉన్నది ఒకే ఒక్క అధికార కేంద్రం. అది నరేంద్రమోదీ మాత్రమే. ప్రధానమంత్రీ ఆయనే, పార్టీ జాతీయ అధ్యక్షుడూ ఆయనే. జగత్ ప్రకాశ్ నడ్డా పేరుకు మాత్రమే పార్టీ అధ్యక్షుడు. కేంద్రమంత్రివర్గ పునర్వ్యస్థీకరణతో నరేంద్రమోదీ పార్టీకి, ప్రభుత్వానికి కమాండర్ ఇన్ చీఫ్ అన్న విషయం అర్థమైంది. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ రణగొణ ధ్వనులు కానీ, లైన్ దాటడం కానీ జరిగేందుకు అవకాశం లేదు. రెండింటినీ నియంత్రించడం సాధ్యం కావచ్చు కానీ ప్రజల మనస్సులను ఆకట్టుకోవడం అంత సులభం కాదు. అది జరిగేంతవరకూ ఎంత కేంద్రీకృత అధికారం అనుభవించినా, ఒరిగేదేమీ లేదు.


ఎ. కృష్ణారావు

ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి

Updated Date - 2021-07-14T05:58:32+05:30 IST