రండి..వద్దన్నామా!

ABN , First Publish Date - 2021-08-04T06:22:38+05:30 IST

సీమ ఎత్తిపోతల..

రండి..వద్దన్నామా!

చర్చనీయాంశంగా మారిన కేఆర్‌ఎంబీ పర్యటన

రేపు సీమ ఎత్తిపోతల పరిశీలనకు వచ్చే అవకాశం 

నోడల్‌ ఆఫీసర్‌ను కేటాయించాలని కోరిన కేఆర్‌ఎంబీ

వస్తే తప్పకుండా సహకరిస్తాం: జలవనరులశాఖ సీఈ 


కర్నూలు(ఆంధ్రజ్యోతి): సీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించేందుకు కేఆర్‌ఎంబీ అధికారులు వస్తామనడం.. రాకపోవడం.. ప్రభుత్వం సహకరించలేదనడం చర్చనీయాంశంగా మారింది. వారిని ప్రభుత్వం రావద్దని అనలేదని, వస్తే సహకరిస్తామని జలవనరుల శాఖ సీఈ అంటున్నారు. ఈ నేపథ్యంలో కేఆర్‌ఎంబీ గురువారం జిల్లాకు వస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి, కేఆర్‌ఎంబీకి మధ్య నడుస్తున్న వివాదం నేపథ్యంలో ఈ పర్యటన ఉత్కంఠగా మారింది. సీమ ఎత్తిపోతల పథకం పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని కేఆర్‌ఎంబీ తాజాగా ఓ ప్రకటన చేసింది. ఆ ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లి పూర్తి వివరాలు అందించాలని గతంలోనే ఎన్జీటీ కోరగా, కేఆర్‌ఎంబీ కూడా పలుమార్లు ప్రభుత్వానికి లేఖలు రాసింది. అయితే కేఆర్‌ఎంబీ అధికారుల పర్యటనలు వాయిదా పడ్డాయి.


తమ పర్యటనకు ప్రభుత్వ సహకారం లేకపోవడమే కారణమని ఎన్జీటీకి సమర్పించిన అఫిడవిట్‌లో కేఆర్‌ఎంబీ వివరించింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 5వ తేదీన సీమ ఎత్తిపోతల పరిశీలనకు వస్తున్నట్లుగా కేఆర్‌ఎంబీ అధికారులు మరోసారి లేఖ రాశారు. ఎన్జీటీ సూచనల మేరకు ఈ పర్యటన చేస్తున్నప్పటికీ వస్తున్న అధికారులు తదితర వివరాలపై కేఆర్‌ఎంబీ స్పష్టత ఇవ్వలేదు. కొద్ది నెలల క్రితం పంపిన లేఖ ఆధారంగా సీడబ్ల్యూసీ, కేఆర్‌ఎంబీ, పవర్‌ సభ్యులు వచ్చే అవకాశాలున్నాయి. తమకు ఒక నోడల్‌ అధికారిని కేటాయించాలని కేఆర్‌ఎంబీ కోరిక మేరకు జల వనరుల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ మురళీధర్‌ రెడ్డి వెళ్తారని తెలుస్తోంది. అయితే ఇప్పటికీ కేఆర్‌ఎంబీ తమపై అనవసర నిందలు మోపుతోందని జల వనరుల శాఖ ఆరోపిస్తోంది. 


ఆపామా.. అడ్డుపడ్డామా?

తెలంగాణ నుంచి దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో భాగంగా జూలైలో కేఆర్‌ఎంబీ ఇచ్చిన వివరణ నిందలేనని జల వనరుల శాఖ అంటోంది. తామెప్పుడూ కేఆర్‌ఎంబీ విధులకు అడ్డు తగల్లేదని, లేఖలు రాయడం మినహా మరే చర్యలకు ఉపక్రమించని కేఆర్‌ఎంబీ తమపై అనవసరమైన ఆరోపణలు చేస్తోందని జల వనరుల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ మురళీధర్‌ రెడ్డి అంటున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలనకు ప్రభుత్వం సహకరించడం లేదన్న ఆరోపణలపై ఆయన స్పందిస్తూ కేఆర్‌ఎంబీని ఎవరు ఆపుతున్నారో చెప్పాలని కోరారు. తనతో పాటు పలువురు ఇరిగేషన్‌ అధికారులు కొవిడ్‌ బారిన పడి ఐసొలేషన్లో ఉన్నప్పుడు కూడా ఎగ్జిక్యూటివ్‌ అధికారులను కేఆర్‌ఎంబీకి సహకారంగా పంపుతామని ఇరిగేషన్‌ శాఖ స్పష్టం చేసిందని ఆయన గుర్తు చేశారు.


ఇప్పటికే మార్చి 31న, ఏప్రిల్‌ 12న, జూలై 3న వస్తామని తాము ఏపీ జల వనరుల శాఖకు లేఖలు రాశామని, ప్రతిసారి ఏదో ఒక కారణం చూపుతూ ప్రభుత్వం స్పందించలేదని కేఆర్‌ఎంబీ అధికారులు కూడా తన అఫిడవిట్లో పేర్కొన్నారు. కృష్ణా నదిపై తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులు పరిశీలించాకే సీమ ఎత్తిపోతలను పరిశీలించాలని కేంద్రానికి, కేఆర్‌ఎంబీకి రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే వివరించింది. ఇప్పటికే పర్యావరణ అనుమతుల విషయంలో ఏపీ ప్రభుత్వంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కొత్త ఆయకట్టు లేదని, గత ప్రాజెక్టుల పరిధిలోనే సీమ ఎత్తిపోతల ఉందని చెబుతూ ప్రత్యేక అనుమతులు అవసరం లేదని ఏపీ చెబుతుందన్నది కేఆర్‌ఎంబీ వాదిస్తోంది. 


రండి సహకరిస్తాం..

పర్యటనలకు సహకరించడంలేదని కేఆర్‌ఎంబీ చేస్తోన్న వాదనలు సరికాదు. మేము వారు రాకుండా ఏ రోజైనా అడ్డుకున్నామా? నోడల్‌ ఆఫీసర్‌ ఏర్పాటుపై ప్రభుత్వం స్పందించినా లేకున్నా, మా ఆఫీస్‌కు వస్తే మేం తప్పకుండా సహకరిస్తాం. మా దగ్గరకు వచ్చాక మేం సహకరించకపోతే నిందలు వేయవచ్చు. వాటికి సమాధానం చెప్పగలం. 

- మురళీధర్‌ రెడ్డి, ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌

Updated Date - 2021-08-04T06:22:38+05:30 IST