మా కాలేజీలోనే చేరండి

ABN , First Publish Date - 2022-06-21T05:59:10+05:30 IST

పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులపై ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలలు వల విసురుతున్నాయి. ఎంతమందిని వీలైతే అంతమందిని తొందరగా చేర్చేసుకునేందుకు పోటీ పడుతున్నాయి.

మా కాలేజీలోనే చేరండి

ఇళ్ల వద్దకు మధ్యవర్తులను పంపుతున్న వైనం

కళాశాలలో ఎన్నో ప్రత్యేకతలు అంటూ మాటలు..

తల్లిదండ్రులకు ఫోన్‌, ఎస్‌ఎంఎ్‌సల జోరు

చేర్చుకునేందుకు పోటీ

కొత్తచెరువు


పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులపై ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలలు వల విసురుతున్నాయి. ఎంతమందిని వీలైతే అంతమందిని తొందరగా చేర్చేసుకునేందుకు పోటీ పడుతున్నాయి. కళాశాలల ప్రతినిధులు.. ఏకంగా గ్రామాల్లో మధ్యవర్తులను పెట్టుకుని, విద్యార్థుల తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. వారి ద్వారా కాలేజీలో ఎన్నో ప్రత్యేకతలున్నాయంటూ చెప్పిస్తూ.. నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్‌ఫోన్లకు ఎస్‌ఎంఎ్‌సలు, ఫోన్లు చేస్తూ ఊదరగొడుతున్నారు. ఎలాగోలా బుట్టలో వేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు.


వివరాలు మొత్తం సేకరించి..

ఇటీవలే పదో తరగతి పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. ఉత్తీర్ణులైన విద్యార్థుల తల్లిదండ్రులు.. తమ పిల్లలను ఏ కాలేజీలో చేర్చాలోనన్న ఆలోచనలో పడ్డారు. అప్పులు చేసైనా పిల్లలను మంచి కాలేజీలో చేర్పించాలని చూస్తున్నారు. దీనిని క్యాష్‌ చేసుకునేందుకు కార్పొరేట్‌, ప్రైవేటు కాలేజీలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. విద్యార్థులను ఎలాగైనా తమ కళాశాలలో చేర్చుకునేందుకు ఇంటింటా, ఫోన్‌, ఎస్‌ఎంఎ్‌సల ద్వారా అప్పుడే ప్రచారం మొదలు పెట్టారు. బుట్టలో వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తమ కళాశాలలో ఉత్తమ బోధనతోపాటు ఫలానా ప్రత్యేకతలు ఉన్నాయనీ, చేరితే రాయితీలు ఇస్తామంటూ ఊదరగొట్టేస్తున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల చిరునామా, ఫోన్‌ నెంబర్లు ప్రైవేటు సంస్థల ప్రతినిధులు.. ఆయా పాఠశాలల నుంచి ఇప్పటికే సేకరించారు. ఆ విద్యార్థి మార్కులు, కుటుంబ ఆర్థిక స్థోమతను తెలుసుకున్నారు. వివరాలిచ్చిన ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రోత్సాహకాలు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు సంస్థల ప్రతినిధులు, స్థానికంగా  నియమించుకున్న మఽధ్యవర్తుల ద్వారా నేరుగా విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు వెళ్తున్నారు. తమ కళాశాలలో చేర్చితే ఫీజు రాయితీ ఇస్తామనీ, సౌకర్యాలు కల్పిస్తామనీ, పలు పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తామనీ, ఆలస్యం చేస్తే సీట్లు దొరకవని ఊదరగొడుతున్నారు. కళాశాలలో చేరిస్తే ప్రతి విద్యార్థిపై ప్రోత్సాహక బహుమతి ఇస్తామని స్థానికంగా ఉన్న మధ్యవర్తులు, ఉపాధ్యాయులకు గాలం వేస్తున్నారు. ప్రైవేటు సంస్థల ప్రోత్సాహకాలకు ఆకర్షణకు లోనైన కొందరు.. విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకెళ్లి, ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు.


ఎవరి డప్పు వారిది..

విజయవాడ, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, గుంటూరు విద్యాసంస్థలు ప్రత్యేకంగా మధ్యవర్తులను నియమించుకుని, వారి ద్వారా  ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తమ సంస్థలు ఉన్నాయనీ, జిల్లాలోనే కళాశాల శాఖ ఉందనీ, చేరాలని ఒత్తిళ్లు తెస్తున్నారు. కార్పొరేట్‌ సంస్థలకు తామేమీ తక్కువ కాదని జిల్లాలోని పలు ప్రైవేటు కళాశాలలు కూడా విద్యార్థులపై వల వేస్తున్నాయి. ఈ ప్రచారంలో తమ కళాశాలలో ప్రత్యేకంగా ఎంసెట్‌, ఏఐఈఈఈ, ఐఐటీ, జేఈఈ మెయిన్స్‌, ఎన్‌ఐటీ శిక్షణ ఇస్తామని, పిలల్లకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆశ చూపుతున్నారు. కళాశాలలో ఏసీ, నాన్‌ ఏసీ, డేస్కాలర్‌, హాస్టల్‌, మెస్‌ తదితర ప్రత్యేకతలు వినిపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారు. వెంటనే డబ్బు చెల్లించి, సీటు ఖరారు చేసుకోవాలని ఒత్తిళ్లు తెస్తున్నారు. మెరుగైన మార్కులు సాధించిన వారికి ప్రత్యేక రాయితీలు అంటూ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రచారంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలల మాయమాటలు నమ్మి, కొందరు పిల్లలను చేర్పించేస్తున్నారు. మరి కొందరు కళాశాల చూసిన తరువాత చెబుతామని బదులు ఇస్తున్నారు. ముందుగా చేరితే ఫీజులో రాయితీ ఇస్తామని సంస్థలు చెబుతున్నాయి. జిల్లాలో పదో తరగతి పాసైన విద్యార్థుల్లో సగం మందికిపైగా కార్పొరేట్‌, ప్రైవేటు సంస్థలు వల వేసినట్లు తెలుస్తోంది. ప్రవేశాలకు సమయం దగ్గర పడుతుండడంతో వారి ఒత్తిళ్లు మరింత తీవ్రమవుతున్నాయి. ఫీజులు కూడా రూ.లక్షల్లో వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.


అధిక ఫీజుల కట్టడికి చర్యలు

ప్రైవేటు కళాశాలల ఫీజులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ మేరకే కళాశాలలు ఫీజులు వసూలు చేయాలి. అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

నాగేశ్వరరావు, డీఈఓ


Updated Date - 2022-06-21T05:59:10+05:30 IST