విల్లా.. చర్యలెలా..?

ABN , First Publish Date - 2021-12-29T14:59:58+05:30 IST

నగర శివారులో అక్రమంగా నిర్మించిన విల్లాలను సీజ్‌ చేయాలన్న మేడ్చల్‌ కలెక్టర్‌ ఆదేశాలతో అధికారులు ఒక్కరోజు హడావిడి చేశారు. ఆ తర్వాత అచేతనస్థితికి వెళ్లిపోయారు....

విల్లా.. చర్యలెలా..?

అడ్డగిస్తున్న అధికార పలుకుబడి 

అక్రమమని తెలిసినా డెవలపర్‌పై చర్యలకు వెనుకడుగు

అచేతనస్థితిలో పోలీసు, మున్సిపల్‌ అధికారులు

మరోసారి పర్యటించిన సీడీఎంఏ అధికారులు

రిపోర్టు ఇవ్వడమే బాధ్యత.. తదుపరి నిర్ణయం కమిషనర్‌దే


హైదరాబాద్‌ సిటీ/దుండిగల్‌: నగర శివారులో అక్రమంగా నిర్మించిన విల్లాలను సీజ్‌ చేయాలన్న మేడ్చల్‌ కలెక్టర్‌ ఆదేశాలతో అధికారులు ఒక్కరోజు హడావిడి చేశారు. ఆ తర్వాత అచేతనస్థితికి వెళ్లిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు కూడా తదుపరి చర్యలు చేపట్టకుండా మీనామేషాలు లెక్కిస్తున్నారు. అయితే, విల్లాల వెనుక ఉన్న అదృశ్య శక్తులు అధికారుల ముందర కాళ్లకు బంధాలు వేస్తున్నట్లు తెలుస్తోంది. 

దుండిగల్‌లో 260 విల్లాలు అక్రమంగా నిర్మించిన శ్రీనివాస లక్ష్మీ కనస్ట్రక్షన్‌పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. దీంతో మున్సిపల్‌ అధికారులు స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో బిల్డర్‌పై కేసు నమోదు చేశారు. వంద విల్లాలను సీజ్‌ చేశారు. మిగతా 160 విల్లాలను సీజ్‌ చేయకపోవడం, తదుపరి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెరువు బఫర్‌జోన్‌లో దర్జాగా విల్లాలను నిర్మించినా చర్యలు చేపట్టడం లేదు. డెవలపర్‌ నిర్మాణ పనులు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. 


రిపోర్టు ఇవ్వడమే మా బాధ్యత

మున్సిపల్‌ శాఖ పరిపాలన అధికారి సత్యనారాయణ ఆదేశాలతో మంగళవారం సీడీఎంఏ కార్యాలయం నుంచి రీజనల్‌ డైరెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి, డీటీసీపీ రీజనల్‌ డైరెక్టర్‌ నర్సింహరెడ్డి, దుండిగల్‌ కమిషనర్‌ భోగీశ్వర్లు, టీపీఓ సాయిబాబాలతో కలిసి విల్లాలను పరిశీలించారు. సీజ్‌ చేసిన, చేయని విల్లాలను, హెచ్‌ఎండీఏ అనుమతితో నిర్మిస్తున్న 60 విల్లాలను కూడా పరిశీలించారు. ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన ఏడు విల్లాలను కూడా పరిశీలించారు. గతంలో ఎవరు అనుమతి ఇచ్చారు, ఎన్నింటికి ఇచ్చారు.. వంటి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమ పరిస్థితేంటని కొనుగోలుదారులు అధికారులను అడిగారు. రిపోర్టు అందజేస్తామని, తదుపరి చర్యలు కమిషనర్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంటాయని తెలిపారు. అధికారుల తనిఖీ సందర్భంలో ఆ ప్రాంతంలోకి మీడియా ప్రతినిధులను సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు. 


పట్టించుకోని హెచ్‌ఎండీఏ 

హెచ్‌ఎండీఏ అనుమతుల ప్రకారం శ్రీనివాస్‌ లక్ష్మీ కన్‌స్ట్రక్షన్స్‌ విల్లాలను నిర్మించడం లేదు. రోడ్లను కుదించారు. ఒక వరుసలో పది విల్లాలు కట్టాల్సి ఉండగా, 14 నుంచి 18 వరకు నిర్మిస్తున్నారు. హెచ్‌ఎండీఏ అనుమతులు ఉన్నట్లు చూపి ఒక్కో విల్లాను రూ.1.50 కోట్ల వరకు ఇప్పటికే విక్రయించినట్లు తెలుస్తోంది. హెచ్‌ఎండీఏ అధికారులు దీనిపై నిర్వాహకురాలికి నోటీసులు జారీ చేయలేదు. ఆ ప్రాంతాన్నీ తనిఖీ చేయలేదు.


ప్రభావితం చేస్తున్న అదృశ్య శక్తులు

కన్‌స్ట్రక్షన్స్‌ బాధ్యులపై నెల రోజుల క్రితం మున్సిపల్‌ అధికారుల ఫిర్యాదుతో దుండిగల్‌ పోలీసులు కేసు నమోదు చేశారేగానీ ఇప్పటికీ కదలిక లేదు. అమెరికాలో ఉన్న డెవలపర్‌ను రప్పించే చర్యలు చేపట్టడం లేదు. లుక్‌ అవుట్‌ నోటీసులను జారీ చేయడం లేదు. దుండిగల్‌ పోలీసులు కేసు దర్యాప్తుపై స్పందించకపోవడంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అక్రమ నిర్మాణాలపై ఇంత జరుగుతున్నా బిల్డర్‌ అందుబాటులోకి రాకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రాజకీయ నాయకుల ఒత్తిడితోనే అధికార యంత్రాంగం పూర్తిగా ఈ విల్లాలను వదిలేసినట్లు తెలుస్తోంది. అక్రమ విల్లాల క్రమబద్ధీకరణకు ప్రత్యేక ఉత్తర్వులు లేదా జరిమానా చెల్లించి చేతులు దులుపుకునేందుకు అదృశ్యశక్తులు తెర వెనుక తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీడీఎంఏ ఉన్నతాధికారుల తనిఖీ నివేదిక ప్రకారం తదుపరి చర్యలకు దిగుతారా, లేకుంటే అదృశ్యశక్తుల ఒత్తిడితో నివేదిక బుట్టదాఖలవుతుందా అనేది వేచి చూడాలి. 

Updated Date - 2021-12-29T14:59:58+05:30 IST