వలస కూలీలకు వసతి గృహాలు

ABN , First Publish Date - 2020-04-04T10:03:57+05:30 IST

బతుకు దెరువు కోసం జిల్లాకు వచ్చిన వలస కూలీలకు కరోనా రూపంలో కష్టం వచ్చి పడింది.

వలస కూలీలకు వసతి గృహాలు

రాష్ట్రేతరులకు 65 రిలీఫ్‌ క్యాంపులు

  నిరాశ్రయులకు మెప్మా ఆధ్యర్యంలో పునరావాసం

  కలెక్టర్‌ వీరపాండియన్‌


కర్నూలు, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): బతుకు దెరువు కోసం జిల్లాకు వచ్చిన వలస కూలీలకు కరోనా రూపంలో కష్టం వచ్చి పడింది. లాక్‌డౌన్‌ నేపఽథ్యంలో పనుల్లేక, సొంతూళ్లకు వెళ్లే వీలులేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో చిక్కుకుపోయారు. వలస కూలీలకు రిలీఫ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించడంతో వలస కూలీలకు, నిరాశ్రయులకు నీడ దొరికినట్టయింది. వీరందరికీ జిల్లా యంత్రాంగం ఆపన్న హస్తం అందిస్తుందని కలెక్టర్‌ వీరపాండియన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.  లాక్‌డౌన్‌తో ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇబ్బంది పడుతున్న వారి కోసం జిల్లా వ్యాప్తంగా 65 రిలీఫ్‌ క్యాంపులను ఏర్పాటు చేశామన్నారు.


జిల్లాలోని బేతంచర్ల, గడివేముల, బనగానపల్లె, ఓర్వకల్లు మండలం మాధవరం (మంత్రాలయం), డోన్‌, శ్రీపురం (ప్యాపిలి), బోయినపల్లి (ప్యాపిలి), గురు రాఘవేంద్ర కోచించింగ్‌ సెంటర్‌ నంద్యాల, ఏపీ మోడల్‌ స్కూలు డోన్‌, మాంటిస్సోరి స్కూలు పంచలింగాల(కర్నూలు), కేజీబీవీ ప్యాపిలి(డోన్‌), చైతన్య విద్యా మందిర్‌ నంద్యాల, శారదా విద్యాపీఠ్‌ నంద్యాలలో ఏర్పాటు చేసిన రిలీఫ్‌ సెం టర్లలో  దాదాపు 4,105 మందికి వసతి కల్పించామన్నారు. అలాగే వలస కూలీల కోసం 14 రిలీఫ్‌ సెంటర్లను ఏర్పాటు చేశామని, అందులో దాదాపు 20 రాష్ట్రాలకు చెందిన 2853 మందికి వసతి కల్పించామని అన్నారు. నిరాశ్రయులకు మెప్మా ఆధ్వర్యంలో 8 కేంద్రాల్లో 244 మం దికి వసతి, భోజనం సదుపాయంతోపాటు శానిటైజర్లు, మాస్కులు అందించినట్లు కలెక్టర్‌ వివరించారు. వీరితో ఉదయం, సాయంత్రం సామాజిక దూరం పాటిస్తూ యోగా చేయిస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. 


కరోనా కంట్రోల్‌ రూమ్‌ తనిఖీ :

కరోనా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను కలెక్టర్‌ వీరపాండియన్‌  శుక్రవారం మధ్యాహ్నం తనిఖీ చేశారు. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో సమాచారాన్ని ఎప్పటికపుడు అందజేయాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారితోపాటు, ఢిల్లీ నుంచి వచ్చిన వారి వివరాలను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. 

Updated Date - 2020-04-04T10:03:57+05:30 IST