ఒక్క నామినేషన్‌ దాఖలవ్వని 34 వార్డులకు ఎన్నికలు

ABN , First Publish Date - 2021-03-04T07:00:29+05:30 IST

ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో 13 మండలాల పరిధిలోని 22 గ్రామ పంచాయతీల్లో 34 వార్డుల్లో ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదని, అలాంటి వాటికి మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి తెలిపారు.

ఒక్క నామినేషన్‌ దాఖలవ్వని 34 వార్డులకు ఎన్నికలు

కాకినాడ, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో 13 మండలాల పరిధిలోని 22 గ్రామ పంచాయతీల్లో 34 వార్డుల్లో ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదని, అలాంటి వాటికి మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. సదరు వార్డులకు సంబంధించి గురువారం నుంచి ఈనెల 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారన్నారు. 7న వాటి పరిశీలన, 8న తిరస్కరణ, అప్పీళ్ల పరిష్కరణ ఉంటుందన్నారు. 10వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉపసంహరణకు గడువు ఉంటుందన్నారు. అనంతరం బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తామన్నారు. ఆయా వార్డుల్లో 15వ తేదీ ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందన్నారు. సాయంత్రం 4 గంటలకు కౌటింగ్‌ ప్రారంభమవుతుందని, వెంటనే ఫలితాలను వెల్లడిస్తామన్నారు. ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ మాట్లాడుతూ స్థానిక సంస్థలు, పంచాయతీ వార్డు సభ్యుల ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 9 చెక్‌ పోస్టులున్నాయని, మునిసిపల్‌/ నగర పంచాయతీల్లో రెండేసి చొప్పున మరో 20 చెక్‌ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు 74 కేసులకు సంబంధించి 2,595 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. జేసీ సీహెచ్‌ కీర్తి, డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు, డీపీవో నాగేశ్వర్‌ నాయక్‌, కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహరావు, మెప్మా పీడీ కె శ్రీరమణి పాల్గొన్నారు.

Updated Date - 2021-03-04T07:00:29+05:30 IST