కరోనా నియంత్రణపై దృష్టి

ABN , First Publish Date - 2020-04-03T11:03:41+05:30 IST

జిల్లాకు ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా వస్తే.. వారి వివరాలు తెలియజేయాలని కలెక్టర్‌ జె.నివాస్‌ పిలుపునిచ్చారు.

కరోనా నియంత్రణపై దృష్టి

ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వివరాలు తెలియజేయండి

కలెక్టర్‌ నివాస్‌


కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 2 : జిల్లాకు ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా వస్తే.. వారి వివరాలు తెలియజేయాలని కలెక్టర్‌ జె.నివాస్‌ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ముస్లిం సంఘాలు, మైనారిటీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘కరోనా నివారణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాం. మార్చి 14 నుంచి 22 వరకు ఢిల్లీ వెళ్లిన వారి వివరాలు సేకరిస్తున్నాం. జిల్లా నుంచి మొత్తం 67 మంది ఢిల్లీ వెళ్లినట్టు రైల్వేశాఖ సమాచారం అందించింది. ఇప్పటివరకూ 27 మందిని గుర్తించి.. నమూనాలు సేకరించాం. ఈ రిపోర్టుల్లో ‘నెగిటివ్‌’ ఫలితం ఉండడం ఊరట కలిగించే అంశం. అయినప్పటికీ మనం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.


ఇంకా ఎవరైనా ఢిల్లీ వెళ్లి వచ్చినట్టు తెలిస్తే వివరాలు తెలియజేయండి. జిల్లాలో కానీ, ఇతర ప్రాంతాల్లో కానీ సమావేశాలు, వేడుకలు నిర్వహించినా సమాచారం అందజేయండి. ఇతర ప్రాంతాల నుంచి ఎవరు వచ్చినా.. వివరాలు చెప్పండి. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించండి. ఎక్కడా గుంపులుగా ఉండొద్దు. కరోనాపై తప్పుడు ప్రచారాలు చేయొద్దు. భౌతిక దూరం పాటించండి’ అని సూచించారు. ‘కుల, మతాలకు సంబంధం లేకుండా ఇతర దేశాలు, రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఐసోలేషన్‌ కేంద్రాల్లో ఉంచుతున్నాం. రాగోలులోని జెమ్స్‌, రాజాం జి.ఎం.ఆర్‌. ఆసుపత్రులను.. ‘కోవిడ్‌-19’ ఆసుపత్రులుగా ప్రభుత్వం గుర్తించింద’ని వెల్లడించారు. ముస్లిం ప్రతినిధులు రఫీ ఇస్మాయిల్‌ తదితరులు మాట్లాడుతూ జిల్లా నుంచి ఢిల్లీ జమాత్‌కు వెళ్లినవారు ఎవరూ లేరని చెప్పారు. తామంతా అప్రమత్తంగా ఉన్నామని... ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ కరోనా నియంత్రణకు తమ వంతు సహకారం అందజేస్తామని తెలిపారు. సమావేశంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి ఎం.అన్నపూర్ణమ్మ, ప్రధాన మంత్రి 15 సూత్రాల కమిటీ ప్రతినిధి బహుదూర్‌ బాషా, మోహిబుల్లా ఖాన్‌, ఎం.ఎ. రఫీ అబ్దుల్‌ షాజహనాని, ఎంఎ. బేగ్‌, సర్ఫ్‌రాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-03T11:03:41+05:30 IST