నాకు లే–అవుట్‌ కొత్త కాదు

ABN , First Publish Date - 2022-05-18T06:00:19+05:30 IST

నేను కలెక్టర్‌గా కొత్త కాదు.

నాకు లే–అవుట్‌ కొత్త కాదు
వివరాలు నమోదు చేసుకుంటున్న కలెక్టర్‌ ప్రశాంతి

ఒక్క ఇల్లు ఎందుకు కట్టలేదు.. విధి నిర్వహణ ఇదేనా ?

అధికారులపై కలెక్టర్‌ ఫైర్‌


పెనుమంట్ర, మే 17 : ‘నేను కలెక్టర్‌గా కొత్త కాదు. అలాగని లే–అవుట్ల పరిశీలనకు కొత్తగా రాలేదు. ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తేనే తెలుస్తోంది. జగనన్న కాలనీలో ఒక్క ఇల్లు కట్టలేదు. కనీసం రాళ్లు కూడా వేయలేదు. విధి నిర్వహణ ఇలాగేనా   చేసేది ?’ అంటూ జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి పెనుమంట్ర హౌసింగ్‌ అధికారులపై ఫైర్‌ అయ్యారు. మండలంలోని పెద చెరువుగట్టు లే–అవుట్‌ను కలెక్టర్‌ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. స్థలం పూడికపై హౌసింగ్‌ అధికారులను, ఎన్‌ఆర్‌జీఎస్‌ సిబ్బందికి ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో అధికారులు హడలిపోయారు. పెద చెరువుగట్టులో నాలుగెకరాల 66 సెంట్లలో 186 ఇళ్ల నిర్మాణానికి మట్టితో లే–అవుట్‌ను పూడ్చారు. అయితే ఇంకా లో లెవిల్‌లో ఉండటంతో మరోసారి పూడ్చేందుకు ఎన్‌ఆర్‌జీఎస్‌ ద్వారా పూడ్చేందుకు రూ.98 లక్షలతో ప్రతిపాదించగా గోదావరి బొండు ఇసుకను తెచ్చి పూడ్చేందుకు గృహ నిర్మాణ శాఖ కోటి 25 లక్షలు ఖర్చు చేసినట్లు చూపించటంతో కలెక్టర్‌ ప్రశాంతి వివరాలు నమోదు చేసుకున్నారు. రెండో పూడికపై వివరణ ఇచ్చేందుకు హౌసింగ్‌ డీఈ గోపాలరాజు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించగా కలెక్టర్‌ ప్రశాంతి సీరియస్‌ అయ్యారు. ‘లే–అవుట్‌ చూస్తుంటేనే అర్థమవుతోంది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా పెనుమంట్ర గ్రామ సచివాలయాన్ని సందర్శించి సిబ్బంది ఏకరూప దుస్తులు ఎందుకు వేసుకోలేదని ప్రశ్నించారు. పాత పద్ధతిలోనే మాన్యువల్‌గా ఇంటి పన్నులు వసూలు చేస్తుండడంపై మండిపడ్డారు. సమాచార బోర్డులో రైతు భరోసా లబ్ధిదారుల జాబితా పెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జుత్తిగలోని లే–అవుట్‌ను పరిశీలించి అధికారులకు చుక్కలు చూపించారు. ఇన్‌చార్జ్‌ తహసీల్ధార్‌ ఎలియమ్మ, డీఈ రాంబాబు, హౌసింగ్‌ డీఈ గోపాలరాజు, ఏఈ మల్లేశ్వరరావు, ఈవోపీఆర్‌డీ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 


ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు 

పొలమూరు పంచాయతీలో సభ్యుల సంతకాల ఫోర్జరీ, నిధుల అవకతవకలపై స్పందనలో ఫిర్యాదుచేసినా అధికారులు పట్టించుకోలేదని, జనసేన గ్రామ ప్రజా ప్రతినిధులు కలెక్టర్‌ ప్రశాంతి దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత ఫైల్‌ను తక్షణం పంపిం చాలని ఈవోపీఆర్డీ శ్రీనివాస్‌ను ఆదేశించారు.

Updated Date - 2022-05-18T06:00:19+05:30 IST