‘కరోనా’ వైద్యానికి సహకరించండి

ABN , First Publish Date - 2020-03-30T11:20:07+05:30 IST

కరోనాకు సంబంధించి వైద్య సేవలు అందించేందుకు ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు, సిబ్బంది ముందుకు రావాలని కలెక్టర్‌ భరత్‌గుప్తా విజ్ఞప్తి చేశారు.

‘కరోనా’ వైద్యానికి సహకరించండి

 ప్రైవేటు వైద్యులకు కలెక్టర్‌ విజ్ఞప్తి 

నేడు ప్రైవేటు డాక్టర్లు, వైద్యసిబ్బందికి శిక్షణ 


తిరుపతి సిటీ, మార్చి 29: కరోనాకు సంబంధించి వైద్య సేవలు అందించేందుకు ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు, సిబ్బంది ముందుకు రావాలని కలెక్టర్‌ భరత్‌గుప్తా విజ్ఞప్తి చేశారు. తిరుపతి సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో ఆదివారం ఆయన ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు, డాక్టర్లు, ఐఎంఏ ప్రతినిధులు, వర్సిటీల రిజిస్ట్రార్లతో సమావేశమయ్యారు. రాబోవు రోజులు కోవిడ్‌-19 తీవ్రం దృష్ట్యా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల డాక్టర్లు క్వారంటైన్ల ఏర్పాటు.. వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఆస్పత్రుల్లో వసతులు, వెంటిలేటర్ల వివరాలు అందించాలన్నారు. ఆస్పత్రులను క్వారంటైన్‌కు అందించే ప్రైవేటు డాక్టర్లకు, సిబ్బందికి ఆరు నెలలపాటు ప్రభుత్వమే వేతనాలు చెల్లిస్తుందన్నారు. జిల్లాకు ఐదు వేల పడకలు అవసరమని ప్రాథమిక అంచనా వేశామన్నారు. తిరుపతి అర్బన్‌, రూరల్‌ తహసీల్దార్లు కల్యాణమండపాలు, హోటళ్ల వివరాలు.. కల్పించాల్సిన సౌకర్యాలు చూడాలన్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్లు హాస్టళ్లు త్వరగా సిద్ధం చేసి ఉంచాలని సూచించారు.


జిల్లాలో ప్రతి ఎంబీబీఎస్‌, రిటైర్డ్‌, పీజీలు ఆఖరి సంవత్సరం వారు తప్పనిసరిగా ఈ సంక్లిష్ట సమయంలో సేవలందించాలని కోరారు. అన్ని ప్రైవేటు ఆస్పత్రుల డాక్టర్లు, సిబ్బందికి సోమవారం స్విమ్స్‌ ఆసుపత్రి ఓపీ మిద్దెపై గల ఆడిటోరియంలో ఇచ్చే కోవిడ్‌-19 శిక్షణకు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. ఈ సమావేశంలో జేసీ-2 చంద్రమౌళి, ఆర్డీవో కనకనరసారెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ పెంచలయ్య, డిప్యూటీ డీఎంహెచ్‌వో అరుణ సులోచనాదేవి, వర్సిటీ రిజిస్ట్రార్లు మమత, శ్రీధర్‌రెడ్డి, తిరుపతి అర్బన్‌, రూరల్‌ తహసీల్దార్లు వెంకటరమణ, కిరణ్‌కుమార్‌, ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు డాక్టర్లు శ్రీహరిరెడ్డి, సిపాయి సుబ్రహ్మణ్యం, కృష్ణప్రశాంతి, ఐఎంఏ ప్రతినిధులు హాజరయ్యారు. 


వైద్యసిబ్బందిని గుర్తిస్తున్నాం 

ఆదివారం రాత్రి సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్‌ భరత్‌గుప్తా, డీఎఫ్‌వో సునీల్‌కుమార్‌రెడ్డి, జేసీ-2 చంద్రమౌళి, డీఎంహెచ్‌వో పెంచలయ్య పాల్గొన్నారు. కరోనా వైద్యానికి అవసరమైన సిబ్బందిని గుర్తిస్తున్నట్లు కలెక్టర్‌ వివరించారు. తిరుపతిలో ఇప్పటికే రెండు వేల బెడ్ల సౌకర్యం గుర్తించామని, మరో మూడు వేలు అందుబాటులోకి తెస్తామన్నారు. కర్ణాటక నుంచి వచ్చిన 1600 మంది కూలీలను వారి స్వస్థలాలకు పంపి క్వారంటైన్లలో ఉంచేలా ఆయా జిల్లాల కలెక్టర్లకు తెలిపామన్నారు. ఆదివారం రాత్రికి వారిని పలమనేరు బోర్డర్‌ నుంచి నెల్లూరు, గిద్దలూరు, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు పంపిస్తున్నామని తెలిపారు. వచ్చే నెల 15 నుంచి అమలు చేయనున్న హాట్‌స్పాట్ల గుర్తింపు కూడా చేస్తామన్నారు. శ్వాసకోశ వ్యాధులు, ఇతర జబ్బులున్న పోలీసు సిబ్బందికి స్టేషన్లలోనే విధులు కేటాయిస్తామన్నారు. 

Updated Date - 2020-03-30T11:20:07+05:30 IST