ఆస్పత్రిని చీకట్లో ఉంచేస్తారా?

ABN , First Publish Date - 2020-06-05T10:57:05+05:30 IST

‘ఆస్పత్రిని చీకట్లో ఉంచేస్తారా? ఇలాగైతే రోగులు, వారి సహాయకులు ఇబ్బంది పడరా?’ అంటూ రుయా వైద్యాధికారులకు ..

ఆస్పత్రిని చీకట్లో ఉంచేస్తారా?

రుయా వైద్యాధికారులకు కలెక్టర్‌ క్లాస్‌


తిరుపతి (వైద్యం), జూన్‌ 4: ‘ఆస్పత్రిని చీకట్లో ఉంచేస్తారా? ఇలాగైతే రోగులు, వారి సహాయకులు ఇబ్బంది పడరా?’ అంటూ రుయా వైద్యాధికారులకు కలెక్టర్‌ భరత్‌ గుప్తా సున్నితంగా క్లాస్‌ తీసుకున్నారు. రుయా కొవిడ్‌ ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్యసేవలు, కల్పించాల్సిన సౌకర్యాలపై గురువారం సాయంత్రం వైద్యాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో కలియదిరిగారు. ముఖ్యంగా పార్కింగ్‌ ప్రాంతాల్లో లైట్లు లేక చీకటిగా ఉండటాన్ని గమనించి పైవిధంగా స్పందించారు. వెంటనే లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ‘ఆక్సిజన్‌ పైపుల నిర్మాణ పని ఎంతవరకు వచ్చింది? పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు సరిపడా ఉన్నాయా?’ అని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భారతిని అడిగి తెలుసుకున్నారు. అవసరమైన వైద్య పరికరాలను ఏపీఎంఎస్‌ఐడీసీ సంస్థ నుంచే అందించేలా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.


ఇక బ్యాటరీ వాహనాల డ్రైవర్లకు ఏడాదిగా జీతాలు రాలేదని తెలియడంతో తక్షణమే ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. మెటర్నిటీ ఆస్పత్రిలో క్యాంటీన్‌ లేక గర్భిణులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వైద్యులు ఆయన దృష్టికి తెచ్చారు. దాంతో క్యాంటీన్‌ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు. అయితే స్థానిక ఎమ్మెల్యే సూచనలతో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ వర్కింగ్‌ చైర్మన్‌ బండ్ల చంద్రశేఖర్‌, ఆర్‌ఎంవోలు డాక్టర్‌ సరస్వతి, డాక్టర్‌ ఇబీ దేవి, డాక్టర్‌ హరికృష్ణ, ఆసుపత్రి అభివృద్ధి అధికారి ఉమా మహేశ్వర్‌, డాక్టర్‌ ఫయీమ్‌, ఏపీఎంఎస్‌ఐడీసీ డీఈ ధనంజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-06-05T10:57:05+05:30 IST