రైస్‌కార్డులు 100 శాతం మ్యాపింగ్‌ జరగాలి

ABN , First Publish Date - 2020-11-25T04:54:48+05:30 IST

ఇంటింటికీ రేషన్‌ సరుకులు పంపిణీ చేయాలంటే రైస్‌కార్డుల మ్యాపింగ్‌ 100 శాతం పూర్తి కావాలని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ స్పష్టం చేశారు.

రైస్‌కార్డులు 100 శాతం మ్యాపింగ్‌ జరగాలి
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మండల స్థాయి అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఆదేశాలు

గుంటూరు, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఇంటింటికీ రేషన్‌ సరుకులు పంపిణీ చేయాలంటే రైస్‌కార్డుల మ్యాపింగ్‌ 100 శాతం పూర్తి కావాలని కలెక్టర్‌  శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన మండల, పట్టణ స్థాయి అధికారులతో మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లో మ్యాపింగ్‌ చేయాల్సిన బియ్యం కార్డుల సంఖ్య ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే పూర్తి చేయాలన్నారు. వీఆర్‌వో, వలంటీర్‌ లాగిన్‌లో ఉన్నవి మ్యాపింగ్‌ జరిగేలా ఎంపీడీవోలు, మునిసిపల్‌ కమిషనర్లు పర్యవేక్షించాలన్నారు. వలంటీర్ల పోస్టులు ఖాళీలుంటే వెంటనే వాటి భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. లేఅవుట్‌లు సిద్ధం చేసేలా బాధ్యతగా విధులు నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. లేఅవుట్‌ పనులు సక్రమంగా లేకపోతే సంబంధిత ఎంపీడీవో, ఏపీవో, తహసీల్దార్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. మాచవరం మండలంలోని గ్రామాల్లో లేఅవుట్‌ అభివృద్ధి పనులు అస్తవ్యస్తంగా ఉండటంతో ఎంపీడీవో, ఏపీవోపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణల్లో నిర్లక్ష్యంగా ఉంటున్నందుకు ఛార్జ్‌మెమో జారీ చేయాలని డీఆర్‌వోని ఆదేశించారు. ఈ సమావేశంలో జేసీ(రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌, జేసీ(సచివాలయాలు) పి.ప్రశాంతి, జేసీ(ఆసర) శ్రీధర్‌రెడ్డి, డీఆర్‌వో సి.చంద్రశేఖర్‌రెడ్డి, డ్వామా పీడీ శ్రీనివాసరెడ్డి, కలెక్టరేట్‌ ఏవో మల్లికార్జునరావు పాల్గొన్నారు. 

 


Updated Date - 2020-11-25T04:54:48+05:30 IST