Abn logo
Feb 20 2020 @ 03:28AM

ఖాళీ చేయాల్సిందే..!

అసైన్డ్‌ రైతులకు అధికారుల హుకుం!

ఇళ్ల స్థలాలకు భూములుగా సేకరణ

కలవరానికి గురవుతున్న నిరుపేదలు.. అధికారులకు తప్పని అవస్థలు

గతంలో పేదలకు కేటాయించిన కొన్ని ప్రభుత్వ స్థలాలు కూడా రద్దు!

గ్రామాలకు దూరంగా ఇళ్లస్థలాలు


పిఠాపురం, ఫిబ్రవరి 19: ఖాళీగా స్థలాలు ఉన్నా, భూములు కనిపించినా వాటన్నింటినీ ఇళ్లస్థలాలకు ప్రతిపాదిస్తున్నారు. పేదలకు ఇచ్చిన భూములను ఇందుకు మినహాయించడం లేదు. పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాలతోపాటు పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.  


చేబ్రోలులో రైతు మరణంతో..

ఉగాది నాటికి ఇళ్లస్థలాలు పంపిణీ చేయాలన్న ప్రభుత్వ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో భూసేకరణ పూర్తి కాక, ప్రతిపాదించిన భూములపై వివాదాలు తలెత్తుతుండడంతో రెవెన్యూ అధికారులకు ఇబ్బందులు తప్పడం లే దు. గతంలో ఇళ్లస్థలాలుగా ప్రతిపాదించిన భూములతోపాటు పేదలకు సా గు చేసుకునేందుకు ఇచ్చిన భూములను స్థలాలకోసం ప్రతిపాదించారు. డి.ఫారం పట్టా భూములను తీసుకుంటామని చెబుతుండడంతో పేదలు కలవరానికి గురవుతున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో గడ్డపుంతలో తమకు ఇచ్చిన 4ఎకరాల డి.ఫారం పట్టాభూములను ఇళ్లస్థలాలకు తీసుకుంటామని చెప్పడంతో మనోవేదనకు గురై అసైన్డ్‌ రైతు సత్యాడ బాలరాజు గుండెపోటుతో మరణించడం, దళిత సంఘాలు ఆందోళనకు దిగడంతో ఆ భూమిని ఇళ్లస్థలాలకు తీసుకోబోమని అధికారులు ప్రకటించారు. ఇది ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు అద్దంపడుతోంది.


ఫలసాయం చేతికందే సమయంలో ఏంటిది..?

గొల్లప్రోలు మండలం చేబ్రోలు కంకరగని ప్రాంతంలో 25.26ఎకరాలను ఇళ్లస్థలాలకు ప్రతిపాదించారు. ఇది సాగు నిమిత్తం గతంలో పేదలకు లీజుకు ఇచ్చారు. వారు ఈ ప్రాంతాన్ని చదును చేసుకుని తోటలు పెంచుతున్నారు. ఫలసాయం చేతికందే సమయంలో ఇలా చేయడం ఏంటని అక్కడ ఉన్న పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


దారిలేని చోట ఇస్తే ఎందుకు..?

చేబ్రోలు పరిధిలోనే రైల్వేట్రాక్‌కు ఇరువైపులా ఉన్న గడ్డపుంతలో సుమారు 25 ఎకరాలు ఉంది. ఇక్కడ చేబ్రోలు, దుర్గాడ గ్రామస్తులకు ఇళ్లస్థలాలను ప్రతిపాదించారు. రెండు గ్రామాలకు ఈ ప్రాంతం మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ స్థలాలు ఇస్తే కనీసం వెళ్లేదారి కూడా లేదని, అవి తమకు ఎందుకని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. పిఠాపురం మండలం భోగాపురంలో 14 ఎకరాల గరువును బి.ప్రత్తిపాడు, భోగాపురం, రాపర్తి గ్రామాల లబ్ధిదారులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. మూడు గ్రామాలకు ఇది దూరంగానే ఉంటుంది. పిఠాపురం పట్టణంలో స్థలాల కొరత ఉండటంతో ఇక్కడకు సమీపంలోని కుమారపురం తదితర ప్రాంతాల్లో భూములు సేకరించాలని అధికారులు ప్రతిపాదిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement