కూలిన గూడు..నలుగురికి గాయాలు

ABN , First Publish Date - 2020-09-21T07:49:48+05:30 IST

నగరంలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతోపాటు మట్టి గోడలు కూలిపోతున్నాయి. బేగంపేట డివిజన్‌ పాటిగడ్డ ఎన్‌బీటీనగర్‌బస్తీ (రైల్వేలైను)

కూలిన గూడు..నలుగురికి గాయాలు

బేగంపేట, సెప్టెంబర్‌ 20 (ఆంధ్రజ్యోతి): నగరంలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతోపాటు మట్టి గోడలు కూలిపోతున్నాయి. బేగంపేట డివిజన్‌ పాటిగడ్డ ఎన్‌బీటీనగర్‌బస్తీ (రైల్వేలైను) పక్కన సుమారు 50కిపైగా కుటుంబాలు గుడిసెలు వేసుకుని నివా సం ఉంటున్నాయి. ఈ బస్తీలో పట్టాలు ఉన్నా ఇళ్లు కేటాయింపు జరగని వారు ఇక్కడ ఉన్న ఖాళీ స్థలంలో నివసిస్తున్నారు. గతకొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు గుడిసెలకు ఉన్న గోడలు తడిచి కూలిపోతున్నాయి. ఈ ప్రాంతంలోని ఓ గుడిసెలో ఎండి మాజిద్‌, అస్మాబేగం, అక్బర్‌తోపాటు మరో చిన్నారి నివసిస్తోంది. శనివారం రాత్రి వారు నిద్రకు ఉపక్రమించిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున గుడిసె చుట్టూ ఉన్న మట్టి ఇటుక, రాళ్ల గోడ ఒక్కసారిగా కూలి గుడిసె లోనికి పడడంతో నిద్రలో ఉన్న ఎండి మాజిద్‌, అస్మాబేగం, తీవ్రమైన గాయాలు కాగా అక్బర్‌, చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. అస్మాబేగం, ఎండి మాజిద్‌ తల నుంచి రక్తస్రావం అయ్యింది.


గమనించిన స్థానికులు వారిని చికిత్సకోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న సికింద్రాబాద్‌ తహసీల్దార్‌ ఆ ప్రాంతాన్ని సందర్శించి కూలిపోయిన గుడిసెను పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. అయితే గుడిసెకు సమీపంలోని ఖాళీ స్థలంలో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు పెద్ద ఎత్తున మట్టి పోయడంతోనే అక్క డ పడిన వర్షం నీరు దిగువకు వచ్చి గుడిసెకు ఉన్న మట్టి గోడల్లోకి వెళ్లడంతోనే గోడ నాని కూలిపోయిందని పలువురు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రాంతంలోని గుడిసెల్లో నివసిస్తున్న వారికి ఎన్‌బీటీనగర్‌లో ప్రభుత్వం నిర్మిస్తున్న జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్లను కేటాయించాలని పలువురు అధికారులకు విజ్ఞప్తి చేశారు.  

Updated Date - 2020-09-21T07:49:48+05:30 IST