‘సహకారం’ హైజాక్‌!

ABN , First Publish Date - 2021-07-10T08:34:35+05:30 IST

వ్యవసాయ పరపతికి కీలకమైన సహకార రంగాన్ని రాష్ట్రాల నుంచి లాక్కోవడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.

‘సహకారం’ హైజాక్‌!

  • కేంద్రంలో ప్రత్యేక శాఖ ఏర్పాటుపై ప్రతిపక్షాల్లో భయాందోళనలు
  • అమిత్‌షాకు అప్పగించడంపై మరింత కలవరం


న్యూఢిల్లీ, జూలై 9: వ్యవసాయ పరపతికి కీలకమైన సహకార రంగాన్ని రాష్ట్రాల నుంచి లాక్కోవడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. సహకార వ్యవస్థపై పట్టు పెంచుకోవడానికే ప్రత్యేకంగా సహకార శాఖను ఏర్పాటు చేసిందని ఆరోపిస్తున్నాయి. పైగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఆ శాఖను అప్పగించడంపై భయాందోళనలకు లోనవుతున్నాయి. దేశవ్యాప్తంగా సహకార ఉద్యమం ఊపందుకోవడంతో.. ఈ రంగంలో చక్కెర మిల్లులు, స్పిన్నింగ్‌ మిల్లులు, పాల డెయిరీలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లు, రాష్ట్ర సహకార బ్యాంకు (ఏపీలో ఆప్కాబ్‌) ఆవిర్భవించాయి. ఇవన్నీ రాష్ట్రాల పరిధిలో.. రాష్ట్రాల చట్టాలకు అనుగుణంగా నడుస్తున్నాయి. అయితే ఇది ఉమ్మడి జాబితాలో ఉండడంతో వ్యవసాయం నుంచి సహకారాన్ని విడదీసి కేంద్రం కొత్త శాఖను ఏర్పాటుచేసింది. చాలా రాష్ట్రాల్లో సహకార వ్యవస్థ పెద్దగా సఫలం కాలేదు. ఆయా సంఘాలు, బ్యాంకులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. 


అయితే మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, బెంగాల్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడుల్లో సహకార వ్యవస్థ విజయవంతమైంది. ఇదే సమయంలో సహకార సంఘాలు, బ్యాంకులపై రాజకీయ ప్రాబల్యం ఎక్కువైంది. ముఖ్యంగా మహారాష్ట్రలో చక్కెర మిల్లులు, సహకార బ్యాంకులపై ఎన్‌సీపీ ఆధిపత్యం ఉంది. ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌, ఆయన సోదరుడి కొడుకు అజిత్‌ పవార్‌ సహకార ఎన్నికల బరిలోకి దిగడం ద్వారా తమ రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆ పార్టీకి ఆర్థిక బలం, ఓటర్ల బలం కూడా ఈ రంగమే. మహారాష్ట్ర శాసనసభలో కనీసం 150 మంది ఎమ్మెల్యేలకు సహకార వ్యవస్థతో సంబంధాలు ఉండడం గమనార్హం. కేరళలో ఆయా సంఘాల్లో సీపీఎం వేళ్లూనుకుని ఉంది. కర్ణాటక, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్‌ నేతల ప్రాబల్యమెక్కువ. ఆ యా రాష్ట్రాల్లో ఆయా పార్టీలను దెబ్బతీసేందుకే మోదీ ప్రభు త్వం సహకార శాఖను చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే సహకార బ్యాంకులపై పర్యవేక్షణ అధికారాన్ని ఆర్‌బీఐ తీసుకుందని.. ఇప్పుడు వాటి వద్ద ఉన్న డిపాజిట్ల నిల్వలపై కన్నేసిన కేంద్రం.. ఏకంగా స్వాధీనం చేసుకుంటోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


అధికారాల కబ్జాకే: విపక్షాలు

రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌ కింద రాష్ట్రాల జాబితాలో సహకారం 32వ స్థానంలో ఉంది. అలాంటప్పుడు పార్లమెంటులో చట్టం చేయకుండానే ప్రత్యేక శాఖను ఎలా ఏర్పాటుచేస్తారని కేరళలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రమేశ్‌ చెన్నితాల ప్రశ్నించారు. సహకార ఉద్యమాన్ని హైజాక్‌ చేయడమే బీజేపీ లక్ష్యమని ఆరోపించారు. అసలీ శాఖ ఏర్పాటు ఉద్దేశమేంటో కేంద్రం ఇంతవరకు చెప్పలేదని.. పైగా అమిత్‌షాకు దీనిని అప్పగించడంతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. సహకార బ్యాంకుల్లోని డిపాజిట్లపై కన్నువేసే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆక్షేపించారు. వీటిని బీజేపీ తోసిపుచ్చింది. గ్రామీణాభివృద్ధి దిశగా కేంద్రం కీలక చర్య తీసుకుందని ఆ పార్టీ మహారాష్ట్ర నేత ధనంజయ్‌ మహాదిక్‌ అన్నారు. గతంలో ఈయన ఎన్‌సీపీ ఎంపీగా కూడా పనిచేశారు. కేంద్రం నిర్ణయంతో సహకార ఉద్యమం దేశమంతటా విస్తరిస్తుందని అన్నారు. అలాగే రాజకీయ గుత్తాధిపత్యాలకు తెరపడుతుందని స్పష్టం చేశారు.


5.13 లక్షల కోట్ల డిపాజిట్లు..

నాబార్డు వార్షిక నివేదిక (2019-20) ప్రకారం.. దేశంలో 95,238 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్‌), 363 డీసీసీబీలు, 33 రాష్ట్ర సహకార బ్యాంకులు ఉన్నాయి. రాష్ట్ర సహకార బ్యాంకుల వద్ద రూ,6,104 కోట్ల (చెల్లింపుల) మూలధనం, రూ.1.35 లక్షల కోట్ల డిపాజిట్లు ఉండగా.. డీసీసీబీలకు రూ.21,447 కోట్ల మూలధనం, రూ.3.78 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. అంటే వీటివద్ద మొత్తంగా డిపాజిట్ల రూపంలోనే రూ.5.13 లక్షల కోట్లు ఉన్నాయన్న మాట. డీసీసీబీలు స్వల్పకాలిక పంట రుణాల కింద రైతులకు రూ.3 లక్షల కోట్ల అప్పులిచ్చాయి. చక్కెర మిల్లులు, స్పిన్నింగ్‌ మిల్లుల వంటి అగ్రిప్రాసెసింగ్‌ పరిశ్రమలకు రాష్ట్ర సహకార బ్యాంకులు దరిదాపుగా రూ.1.48 లక్షల కోట్ల రుణాలిచ్చాయి. ఇవి గాక దేశవ్యాప్తంగా ఉన్న 1,539 పట్టణ సహకార బ్యాంకులు రూ.3.05 లక్షల కోట్ల రుణాలిచ్చాయి. ఇంత భారీగా డిపాజిట్లు, రుణాలు ఉన్నందునే వీటిపై కేంద్రం కన్నేసిందన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే ప్రత్యేక శాఖ ఏర్పాటులో ఎంతో ప్రయోజనం ఉందని.. సహకార ఉద్యమానికి అవసరమైన ఆర్థిక, చట్టబద్ధమైన అధికారాలు సంక్రమిస్తాయని మహారాష్ట్ర చక్కెర మిల్లుల సమాఖ్య మాజీ ఎండీ సంజీవ్‌ బాబర్‌ వెల్లడించారు. కేంద్రం నుంచి పెట్టుబడిగా గానీ, వర్కింగ్‌ కేపిటల్‌గా గానీ సహకార వ్యవస్థకు ఆర్థిక సాయం అందుతుందన్నారు.

Updated Date - 2021-07-10T08:34:35+05:30 IST