కశ్మీర్‌పై మాకు సహకరించండి

ABN , First Publish Date - 2021-08-28T09:09:55+05:30 IST

పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ‘జైషే మహ్మద్‌’ చీఫ్‌ మౌలానా మసూద్‌ అజర్‌ ఆగస్టు మూడో వారంలో తాలిబాన్లతో భేటీ అయినట్లు తెలుస్తోంది...

కశ్మీర్‌పై మాకు  సహకరించండి

తాలిబాన్లను కోరిన 

జైషే చీఫ్‌ మసూద్‌ అజర్‌

కాందహార్‌లో అబ్దుల్‌ 

ఘనీ బరాదర్‌తో భేటీ


న్యూఢిల్లీ, ఆగస్టు 27 : పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ‘జైషే మహ్మద్‌’ చీఫ్‌ మౌలానా మసూద్‌ అజర్‌ ఆగస్టు మూడో వారంలో తాలిబాన్లతో భేటీ అయినట్లు తెలుస్తోంది. కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను బలోపేతం చేసేందుకు తమకు సహకరించాలని తాలిబాన్ల అధినాయకత్వాన్ని అతడు కోరినట్లు సమాచారం. తాలిబాన్ల రాజకీయ కార్యకలాపాలను పర్యవేక్షించే కీలక వ్యక్తుల్లో ఒకరైన ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌తో మసూద్‌ కాందహార్‌లో సమావేశమయ్యాడు. 1990వ దశకం నుంచే ఈ రెండు ఉగ్రసంస్థల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ ఈ రెండు మధ్య మైత్రి పటిష్ఠమైతే.. అరాచక ఘటనలు పునరావృతమయ్యే ముప్పు ఉంది.

నేను అధ్యక్షుడినై ఉంటే..!: ట్రంప్‌

కాబూల్‌లో విమానాశ్రయం వద్ద జరిగిన పేలుళ్లపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. తాను అమెరికా అధ్యక్షుడినై ఉండుంటే, ఈ దాడులు జరిగేవి కావన్నారు. కాబూల్‌ ఘటనపై జాతిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘కాబూల్‌ ఘటన విషాదకరం. అటువంటి ఘటన జరగకుండా ఉండాల్సింది. నేను అమెరికా అధ్యక్షుడినై ఉండుంటే, ఆ దాడులు జరిగేవి కావు. అఫ్ఘాన్‌లో జరిగింది అతి క్రూరమైన, భయంకరమైన ఉగ్రదాడి. ఆ దాడిలో మన వీర జవాన్లను  కోల్పోయాం. అలాగే తాము ప్రేమించిన దేశం కోసం నౌకా దళాల సిబ్బందీ తమ జీవితాలను త్యాగం చేశారు. అమెరికా యోధులుగా వారు తుదిశ్వాస విడిచారు. ఆ అమరులందరినీ అమెరికా జాతి ఎప్పటికీ గుర్తుంచుకొంటుంది’’ అని వ్యాఖ్యానించారు

Updated Date - 2021-08-28T09:09:55+05:30 IST