ముహూర్తం ఎప్పుడు?

ABN , First Publish Date - 2022-08-14T04:52:23+05:30 IST

ముహూర్తం ఎప్పుడు?

ముహూర్తం ఎప్పుడు?
కొంగరకలాన్‌లోని నూతన ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌

  • కొంగరకలాన్‌లో సిద్ధమైన కొత్త కలెక్టరేట్‌
  • ప్రారంభోత్సవానికి ఎదురు చూపులు
  • ఉమ్మడి జిల్లాలో 16న వికారాబాద్‌ కలెక్టరేట్‌ను.. 17న మేడ్చల్‌-మల్కాజిగిరి ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌  భవనాలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌
  • రంగారెడ్డి కలెక్టరేట్‌ ప్రారంభంపై వీడని సందిగ్ధత ప్రారంభోత్సవంపై స్పష్టత లేదంటున్న అధికారులు, ప్రజాప్రతినిధులు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి వేరైన వికారాబాద్‌,  మేడ్చల్‌ కలెక్టరేట్లను సీఎం కేసీఆర్‌ ఈ నెల 16, 17 తేదీల్లో ప్రారంభించనున్నారు. అయితే కొంగరకలాన్‌లో ఆరు నెలల క్రితమే పూర్తయిన రంగారెడ్డి ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ ప్రారంభోత్సవంపై మాత్రం సందిగ్ధత నెలకొంది. గత మార్చి 31 వరకే కాంట్రాక్టర్‌ నిర్మాణాన్ని పూర్తిచేసి ప్రభుత్వానికి అప్పగించారు. అయినా కలెక్టరేట్‌ భవన ప్రారంభంపై ఇప్పటికీ స్పష్టత లేకుండా పోయింది. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను నిర్వహించుకుంటున్న ఈ తరుణంలోనే కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారని అంతా అనుకుంటుండగా ప్రభుత్వం దీనిపై ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.


రంగారెడ్డి అర్బన్‌, ఆగస్టు 13: కొత్త జిల్లాల ఏర్పాటుతో చాలా జిల్లాలకు నూతన కలెక్టరేట్లను నిర్మించారు. అలాగే కొంగర కలాన్‌లో అన్ని హంగులతో రంగారెడ్డి కలెక్టరేట్‌ సిద్ధమైంది. 42ఎకరాల విస్తీర్ణంలో రూ.50కోట్లతో పనులు పూర్తి చేశారు. కానీ ఈ కలెక్టరేట్‌ ను నేటికీ ప్రారంభించలేదు. ప్రభుత్వం కలెక్టరేట్‌ను ఎప్పుడు ప్రారంభిస్తుందో ఎవరికీ తెలియడం లేదు. ఈ విషయంపై జిల్లా స్థాయి అధికారులకు, ప్రజా ప్రతినిధులకు కూడా స్పష్టత లేదు. సమీకృత కలెక్టర్‌ కార్యాలయం పూర్తయి ఆరు నెలలు గడుస్తున్నా ప్రారంభానికి ముహుర్తం ఖరారు చేయడం లేదు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఈ నెల 16న వికారాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. అలాగే మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టరేను ఈ నెల 17న ప్రారంభించనున్నారు. కానీ.. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ప్రారంభోత్సవంపై రేపు మాపు అంటూ ఊరిస్తున్నారు. నగరం ఆవల ఔటర్‌ రింగ్‌ రోడ్డు పక్కన కొంగరకలాన్‌ సమీపంలో నిర్మించిన కొత్త కలెక్టరేట్‌ జిల్లా ప్రజలకు అందుబాటులో లేదన్న విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. కొంత మంది బడా నేతలు కలెక్టరేట్‌ చుట్టూ వందల ఎకరాల్లో భూములు కొనుగోలు చేశారు. కలెక్టరేట్‌ నిర్మించడంతో అక్కడ భూములకు ఉన్నంటుండి రెక్కలొచ్చాయి. కలెక్టరేట్‌ నిర్మించకముందు గజం ధర రూ.3వేల నుంచి 4వేలు ఉండేది. ఇప్పుడా ధర రూ.30వేలకు పైమాటే! పెద్దపెద్ద వెంచర్లు వెలిశాయి. కలెక్టరేట్‌ పరిసర ప్రాంతాల్లో భూములు బంగారంగా మారాయి.


  • మొదటి నుంచీ వ్యతిరేకతే

ఇబ్రహీంపట్నం, మహేశ్వరం రెండు నియోజకవర్గ ప్రజలకు మాత్రమే కొత్త కలెక్టరేట్‌ సమీపంగా అందుబాటులో ఉంది. కానీ.. జిల్లాలోని మిగతా నియోజకవర్గాలైన చేవెళ్ల, షాద్‌నగర్‌, శేరిలింగంపల్లి, కల్వకుర్తి, రాజేంద్రనగర్‌ నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉంటుందని నిరాసక్తత వ్యక్తమైంది. ఉదాహరణకు చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామస్తులు వికారాబాద్‌ వెళ్లాలంటే 10కిలో మీటర్లు ప్రయాణించాలి. అదే ఈ గ్రామస్తులు కొంగర కలాన్‌ చేరుకోవాలంటే.. 78కిలో మీటర్ల దూరం అవుతుంది. ఇప్పుడు నగరంలో ఉన్న కలెక్టరేట్‌ కంటే దూరంగానే ఉంది. ఇలా మిగతా నియోజకవర్గాల ప్రజలు కూడా దూరమే అవుతుంది. మొదటి నుంచీ కొంగరకలాన్‌లో కొత్త కలెక్టరేట్‌ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. కొంగర కలాన్‌ కొత్త కలెక్టరేట్‌ చేసుకునేందుకు బస్సు సౌకర్యం కూడా లేదు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి వెళ్లేందుకు అవకాశం ఉంది. కార్లు, ఇతర సొంత వాహనాలున్న వారు వెళ్లేందుకు సౌకర్యవంతంగానే ఉంది. బస్సుకు రావాలంటే.. రెండు మూడు బస్సులు ఎక్కి దిగాల్సిందే. కలెక్టరేట్‌కు ఏదైనా పనికోసం వెళ్లి తిరిగి ఇంటికి చేరుకునేందుకు ఒక రోజు పడుతుంది. కొంగరలో కొత్త కలెక్టరేట్‌ అంటేనే అధికారులు ఆమ్మో.. అంత దూరమా? అంటున్నారు. ఇన్నేళ్లుగా నగరంలోని కలెక్టరేట్‌లో విధులు నిర్వహించిన అధికారులు ఇప్పుడు అంత దూరం వెళ్లాలా? అని ఉస్సూరుమంటున్నారు. 90శాతం మంది అధికారులు, ఉద్యోగులు కొత్త కలెక్టరేట్‌లో పనిచేసేందుకు అయిష్టత చూపుతున్నారు. రాజేంద్రనగర్‌, తెలంగాణ పోలీస్‌ అకాడమీ సమీపంలో నూతన కలెక్టరేట్‌ కట్టిస్తే అందరికీ అనుకూలంగా ఉండేదని అంటున్నారు. అప్పు డున్న కలెక్టర్‌ రఘునందన్‌రావు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఓ భవనాన్ని కూడా కలెక్టరేట్‌ కోసం ఒకే చేశారు. కానీ.. ప్రయోజనం లేకుండా పోయింది. కొంగర కలాన్‌లో కొత్త కలెక్టరేట్‌ భవన నిర్మాణాన్ని ప్రారంభంలో వ్యతిరేకించడం తో కొన్ని నెలల పాటు కలెక్టరేట్‌ నిర్మాణ పనులూ నిలిచిపోయాయి. కాంట్రాక్టర్‌ తిరిగి పనులను వేగిరం చేసి పూర్తిచేశారు. ఎన్నో అంవాంతరాల మధ్య ఎట్టకేలకు కలెక్టరేట్‌ నిర్మాణం పూర్తయింది. మార్చి 31 వరకు అన్ని పనులు పూర్తిచేసి కాంట్రాక్టర్‌ నిర్మాణాన్ని ప్రభుత్వానికి అప్పగించారు. ఈ నెలాఖరు వరకు ముహూర్తం ఖరారు కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది మిస్సైతే.. దసరాకు ప్రారంభోత్సం కావచ్చంటున్నారు. 


  • ఆధునిక హంగులతో..

అన్ని శాఖలు ఒకే చోట ఉండేలా కలెక్టరేట్‌ భవనాన్ని నిర్మించారు. కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించనున్నారు. పచ్చదనం కోసం ఈ ప్రాంగణంలో 30వేలకుపైగా వివిధ రకాల మొక్కలు నాటారు. ప్రహరీ, రోడ్లు, అంతర్గత భవనాలు, విద్యుత్‌, నీటి సరఫరా పనులు పూర్తిచేశారు. కొత్త కలెక్టరేట్‌లోకి 36 శాఖల కార్యాలయాలు రానున్నాయి. ఇందుకోసం లక్ష చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించారు. ఆయా శాఖలు, వాటిలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యకు అనుగుణంగా స్థలాల కేటాయింపు చేశారు. 500 మంది కూర్చునే సామర్థ్యంగల ఆడిటోరియాన్ని ఏర్పాటు చేశారు. పోస్టాఫీసు, బ్యాంకు, డిస్పెన్సరీ, ఫైర్‌ సర్వీసెస్‌, క్యాంటీన్‌ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు.


  • ప్రారంభోత్సవ గడువు మూడుసార్లు పొడిగింపు..

2017 అక్టోబరు 12న అప్పటి రాష్ట్ర ఎక్సైజ్‌, ప్రొహిబిషన్‌ శాఖ మంత్రి పద్మారావు కలెక్టరేట్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పనులు పూర్తి కావడానికి ఇప్పటి వరకు ఐదేళ్ల సమయం పట్టింది. కార్యాలయంలోకి అడుగుపెట్టేందుకు మరికొన్ని రోజులు సమయం పట్టే అవకాశముంది. 40ఎకరాల స్థలంలో రెండెకరాల విస్తీర్ణంలో జీ+2 అంతస్తుల్లో రూ.33కోట్ల అంచనాతో నిర్మాణ పనులు మొదలు పెట్టారు. కానీ.. పూర్తయ్యేవరకు వ్యయం రూ.50కోట్లకు చేరుకుంది. షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ నిర్మాణ పనులను దక్కించుకుంది. అగ్రిమెంట్‌ చేసుకున్న తేదీ నుంచి 11 నెలల్లో నిర్మాణ సంస్థ పనులు పూర్తిచేయాల్సి ఉంది. అయితే ప్రభు త్వం సకాలంలో నిధులు మంజూరు చేయకపోవడంతో పనుల్లో జా ప్యమైంది. ఇప్పటికే గడువును మూడుసార్లు పొడిగించారు. పనులు పూర్తిచేసినా ఇంకా పూర్తిగా బిల్లులు చెల్లించలేదని తెలుస్తోంది.

Updated Date - 2022-08-14T04:52:23+05:30 IST