లీటర్‌ రూ.120

ABN , First Publish Date - 2021-04-12T06:43:28+05:30 IST

వేసవి తాపం నుంచి కాసింత ఉపశమనాన్ని ఇచ్చే

లీటర్‌ రూ.120

బొండాం రూ. 40 

అమాంతం పెరిగిన ధరలు

బెంబెలెత్తిపోతున్న నగరవాసులు

మరోవైపు నిమ్మదీ అదే దారి


హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి) : వేసవి తాపం నుంచి కాసింత ఉపశమనాన్ని ఇచ్చే కొబ్బరిబొండాల ధరలు కొండెక్కాయి. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు శరీరానికి ఉత్తేజాన్నిచ్చే నిమ్మకాయ ధర కూడా అమ్మో అనిపిస్తోంది. వివిధ రాష్ర్టాలు, ప్రాంతాల నుంచి తక్కువ సంఖ్యలో దిగుమతులు ఉంటుండడంతో పాటు పెరిగిన రవాణా చార్జీలు ఇందుకు కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. ఈ ధరలు చూసి వినియోగదారులు నోరెళ్లబెడుతున్నారు.


తగ్గిన ఉత్పత్తి

గతంలో ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి నగరంలోని వివిధ హోల్‌ సేల్‌ వ్యాపారులకు కొబ్బరి బొండాలను సరఫరా చేసేవారు. ఉత్పత్తి ఎక్కువగా ఉన్న సమయంలో ఒక్కో కాయ ధర గరిష్టంగా రూ.15, కనిష్టంగా రూ.10 ఉండేది. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల నుంచి దిగుమతి భారీగా తగ్గింది. దీంతో నగరంలోని వ్యాపారులు ఆరు నెలలుగా బెంగళూరు నుంచి బొండాలను తెప్పించుకుంటున్నారు. అక్కడి నుంచి లారీలు, డీసీఎంలలో వస్తున్న లోడును ట్రాఫిక్‌ ఆంక్షల నేపథ్యంలో నగర శివార్లలోనే డంపింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో వ్యాపారులు ట్రాలీ ఆటోల ద్వారా వాటిని గౌడన్లకు తరలిస్తూ విక్రయిస్తున్నారు. ట్రాన్స్‌పోర్టు చార్జీలు పెరుగుతున్నందున  హోల్‌సేల్‌లో ఒక్కో బొండాన్ని రూ.30కి విక్రయిస్తుండగా, రిటైల్‌లో రూ.40-45కు విక్రయిస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో గతంలో కొబ్బరి నీళ్లు లీటర్‌ ధర రూ.60 నుంచి 70 ఉండగా, ప్రస్తుతం రూ. 120 వరకూ విక్రయిస్తున్నారు.  800 ఎంఎల్‌ బాటిళ్లను రూ.100కు అమ్ముతున్నారు. పెరిగిన డీజిల్‌ ధరతో పాటు ట్రాన్స్‌పోర్టు చార్జీలు పెరిగినందున తాము కూడా రేట్లు పెంచాల్సి వస్తోందంటున్నారు. 


అమ్మో ‘నిమ్మ’...

బోయినపల్లి, గుడిమల్కాపూర్‌, అఫ్జల్‌గంజ్‌ మార్కెట్లలో 100 నిమ్మకాయలను రూ.70-80కి హోల్‌ సేల్‌గా కొనుగోలు చేయగా, ఇప్పుడు వాటికి రూ.500కు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రిటైల్‌లో ఒక్కో నిమ్మకాయ (పెద్దవి) ధర రూ. 6 నుంచి 10 వరకు, చిన్నవి రూ.4నుంచి 6 వరకు పలుకుతోంది. కరోనా బారిన పడకుండా ఇమ్యూనిటీ శక్తిని పెంచుకోవడంలో ‘సీ’ విటమిన్‌ దోహదపడుతోందని, ప్రతి ఒక్కరూ వేడినీళ్లలో నిమ్మకాయ రసాన్ని తాగాలని డాక్టర్లు చెబుతున్న తరుణంలో ధరలు మండిపోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే నగరానికి గతేడాది నుంచి నిమ్మకాయల రవాణా తగ్గడంతో వివిధ హోల్‌సేల్‌ మార్కెట్ల నుంచి కాయలను తెచ్చుకుంటున్న చిరువ్యాపారులు అదనంగా రెండింతల ధరలు పెంచి విక్రయాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. 


పెరిగిన డీజిల్‌, ట్రాన్స్‌పోర్ట్‌ ధరలే కారణం 

గతంలో ఏపీలోని గోదావరి జిల్లాల నుంచి బొండాలు వచ్చేవి. ఇప్పుడు ఆయా ప్రాంతాలకు చెందిన రైతులు ఎక్కువ మొత్తంలో సరఫరా చేయడం లేదు. దీంతో బెంగళూరు నుంచి తెప్పించుకుంటున్నాం. డీజిల్‌ రేట్లు, ట్రాన్స్‌పోర్టు చార్జీలు పెరిగినందుకే బొండాలు, కొబ్బరినీళ్ల ధరలు పెంచాల్సి వస్తోంది. 

- ఆనందరావు అంగుళూరి, వ్యాపారి, సుచిత్ర


ఊహించని గిరాకీ 

నేను 15 ఏళ్ల నుంచి బోయున్‌పల్లి మార్కెట్‌ వద్ద నిమ్మకాయలను అమ్ముతున్నా. గతంలో రోజుకు 200-300 వరకు అమ్మేవాడిని. ప్రస్తుతం 500పైగా అమ్ముతున్నా. కరోనా నుంచి రక్షణ పొందేందుకు నిమ్మకాయలు ఉపయోగపడుతున్నందున కొనుగోళ్ల సంఖ్య పెరిగింది. 

ఆరిఫ్‌, నిమ్మకాయల వ్యాపారి

Updated Date - 2021-04-12T06:43:28+05:30 IST