బొగ్గు లారీల దూకుడు

ABN , First Publish Date - 2022-01-21T04:20:03+05:30 IST

మణుగూరులో బొగ్గు లారీలు వస్తున్నాయంటే పట్టణ ప్రజలు హడలిపోతున్నారు. లారీల దూకుడు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

బొగ్గు లారీల దూకుడు
బీటీపీఎస్‌కు బొగ్గును తరలిస్తున్న లారీ

మితిమీరిన వేగంతో రవాణా

కనీస నిబంధనలు పాటించని డ్రైవర్లు

భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు

వరుస ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులు

మణుగూరు, జనవరి 20: మణుగూరులో బొగ్గు లారీలు వస్తున్నాయంటే పట్టణ ప్రజలు హడలిపోతున్నారు. లారీల దూకుడు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా మణుగూరులో అంతర్గతంగా బొగ్గును సరఫరా చేసే లారీల దూకుడుకు మాములుగా లేదు మణుగూరు ఓసీ, ఓసీ-2 నుంచి బొగ్గును బీటీపీఎస్‌కు బొగ్గు లారీలను డ్రైవర్లు బైక్‌ల మాదిరి నడుపుతున్నారు. మణుగూరు నుంచి బీటీపీఎస్‌కు వెళ్లే లారీలు ట్రిప్పుల లెక్కన నడుస్తుండటంతో ఈ బండ్లను నడిపే డ్రైవర్లు వేగానికి అడ్డూఅదుపు లేకుండాపోతోంది. ఇటీవల రామానుజారం ప్రధాన రోడ్డు పై బండ్ల ముత్తారావు అనే వ్యక్తి బైక్‌ కుటుంబ సభ్యులను ఎక్కించుకుని వెళ్తున్నాడు. బొగ్గు లారీ అతడి వాహనం సమీపం వద్దకు వెళ్లి కటింగ్‌ ఇవ్వడంతో లారీలోని బొగ్గుపెల్ల జారి పడపోగా అతడు తృటిలో తప్పించుకున్నాడు. సోమవారం మణుగూరు ఓసీ చెక్‌ పోస్టు సమీపంలో ఓ లారీ లోడింగ్‌కు వెళ్తూ ట్రాఫిక్‌ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ఇసుక డ్రమ్ములను ఢీకొట్టింది. ఆ డ్రమ్ములు గాలిలో ఎగిరి ఎదురుగా వస్తున్న బొలీరో వాహనంపై పడటంతో అతి పాక్షికంగా దెబ్బతిన్నది. చెక్‌ పోస్టులసమీపంలోకూడా లారీ డ్రైవర్లు మితిమీరిన వేగంతో వెళ్తుండటంతో స్థానిక రాజుపేట కాలసీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

జీఎం కార్యాలయ రోడ్డు ప్రమాదాలకు నెలవు

మణుగూరు ఏరియాలోని జీఎం కార్యాలయానికి వె ళ్లే ప్రధాన రహదారి మూలమలుపు ప్రమాదాలకు నెలవుగా మారింది. బొగ్గు లారీల ద్వారా కింద పడే బొగ్గు పెళ్లలు నుజ్జుగా మారి విపరీతమైన దుమ్ము ధూళిని రేపుతున్నాయి. ఈ రోడ్డంతా సన్నని బొగ్గు చూరతో నిండటంతో ద్విచక్రవాహనాలు జారిపడుతున్నాయి. ప్రతి రోజు ఇక్కడి ప్రాంతాలను శుభ్రం చేసేందుకు ఆరుగురు కార్మికులను నియమించినా ఫలితం అంతంత మాత్రంగానే ఉంది. లారీలపై సరైన విధానంలో టార్పాలిన్లు కట్టడం లేదు. పైగా బొగ్గును కూడా లారీ బాడీకి సమాంతరంగా కాకుండా హెచ్చుగా పోయడం వల్ల మూలమలుపుల్లో ఇలాంటి సంఘటనలు జరుగున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. సింగరేణి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - 2022-01-21T04:20:03+05:30 IST