కోచింగ్‌ సందడి!

ABN , First Publish Date - 2022-04-18T05:21:43+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఉద్యోగాల నోటిఫికేషన్లను ప్రకటిస్తుండగా జిల్లా వ్యాప్తంగా కోచింగ్‌ సెంటర్లు, లైబ్రరీలు, ప్రభుత్వ స్టడీ సెంటర్లు సందడిగా మారుతున్నాయి. గ్రూప్స్‌ కోసం సిద్ధమయ్యేవారు హైదరాబాద్‌వైపు వెళ్తుండగా ఇతర ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నవారు జిల్లా కేంద్రానికి వచ్చి శిక్షణ పొందుతున్నారు.

కోచింగ్‌ సందడి!

ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణకు ఏర్పాట్లు

చేయూతనందిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు

జిల్లా కేంద్రాల్లో సందడిగా కోచింగ్‌ సెంటర్లు, లైబ్రరీలు

నిజామాబాద్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 17: రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఉద్యోగాల నోటిఫికేషన్లను ప్రకటిస్తుండగా జిల్లా వ్యాప్తంగా కోచింగ్‌ సెంటర్లు, లైబ్రరీలు, ప్రభుత్వ స్టడీ సెంటర్లు సందడిగా మారుతున్నాయి. గ్రూప్స్‌ కోసం సిద్ధమయ్యేవారు హైదరాబాద్‌వైపు వెళ్తుండగా ఇతర ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నవారు జిల్లా కేంద్రానికి వచ్చి శిక్షణ పొందుతున్నారు. ఉద్యోగాల కోసం సన్నద్ధం అవుతున్న నిరుద్యోగులంతా జిల్లా కేంద్రం బాట పడుతుండడంతో జిల్లా కేంద్రంలోని కోచింగ్‌ సెంటర్‌లు, లైబ్రరీలు కళకళలాడుతున్నాయి. జిల్లాలో పలువురు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలు, పోలీసుశాఖ ఇప్పటికే ఉచిత కోచింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించగా ప్రైవేట్‌ కోచింగ్‌ కేంద్రాలోనూ నిరుద్యోగులు శిక్షణ పొందుతున్నారు. ఒక్కో కోచింగ్‌ కేంద్రాలలో రూ.10వేల నుంచి 15వేల వరకు వసూలు చేస్తుండగా భోజన వసతి సౌకర్యం కూడా కొన్ని కోచింగ్‌ సెంటర్‌లు కల్పిస్తున్నాయి. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఎమ్మెల్సీ కవిత ఉచితంగా మధ్యాహ్న భోజనం అందజేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 80వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకోగా మొదటి విడతగా 33787 పోస్టుల నియామకానికి ఆర్థికశాఖ ఆమెదం తెలిపింది. జిల్లాలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి గ్రూప్‌-2, గ్రూప్‌-3, గ్రూప్‌-4, పోలీసు ఉద్యోగాల కోసం పోటిపడే బాల్కొండ నియోజకవర్గానికి చెందిన యువత కోసం తన సొంత ఖర్చులతో కోచింగ్‌ ఇచ్చేందుకు ఆదివారం స్ర్కీనింగ్‌ టెస్టు నిర్వహించగా, జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో వెయ్యి మందికి శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటికే స్ర్కీనింగ్‌ టెస్టు నిర్వహించారు. ఎస్సీ స్టడీ సర్కిల్‌ ద్వారా, బీసీ స్టడీ సర్కిల్‌, ఎస్టీ స్టడీ సర్కిల్‌ ద్వారా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించేందుకు ఆయా శాఖలు సమయాత్తం అవుతున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో ఈసారి ఎలాగైనా ఉద్యోగాలు సంపాదించాలని నిరుద్యోగులు కృతనిశ్చయంతో ఉన్నారు. 

ప్రభుత్వ, ప్రైవేట్‌ సెంటర్‌లలో సందడి..

జిల్లా కేంద్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిల్‌లతో పాటు ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్‌లన్నీ సందడిగా మారుతున్నాయి. ఉద్యోగాల వేటలో ఉన్న నిరుద్యోగ యువత పోటీపడి మరి కోచింగ్‌ తీసుకుంటున్నారు. పోలీసుశాఖ సైతం వెయ్యి మందికి ఉచిత కోచింగ్‌ ఇచ్చేందుకు సన్నహాలు చేస్తోంది. కొన్ని ప్రైవేట్‌ సంస్థలు సైతం కోచింగ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కొందరు స్టడి రూంల పేరుతో ప్రత్యేకంగా కోచింగ్‌ సెంటర్‌లను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని జిలా ్లకేంద్ర గ్రంథాలయంతో పాటు బాపూజీ వచనాలయం, చంద్రశేఖర్‌ కాలనీలోని ప్రాంతీయ గ్రంథాలయాలు నిరుద్యోగ యువకులతో కిటకిటలాడుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిల్‌లలో గ్రూప్‌-1, 2, 3, 4, ఎస్‌ఐ, పోలీస్‌ కానిస్టేబుల్‌ పరీక్షలకు సిద్ధమయ్యేవారి కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 16 వరకు రిజిస్ర్టేషన్‌ చేసుకున్నవారికి ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించి మెరిట్‌ ద్వారా గ్రూప్‌-1 శిక్షణ కోసం ఎంపికైన వారికి నెలకు 5వేల స్టయిఫండ్‌తో పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఇతర పోస్టులకు కోచింగ్‌ తీసుకునేవారికి నెలకు 2వేల స్టైఫండ్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వందమందికి కోచింగ్‌ ఇచ్చేందుకు దరఖాస్తులు స్వీకరిస్తుండగా జిల్లా మైనార్టీ శాఖ ఆధ్వర్యంలోనూ అభ్యర్థులకు రంజాన్‌ అనంతరం కోచింగ్‌ ఇచ్చేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో..

జిల్లాకు చెందిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో గ్రూప్‌-2, 3, 4, పోలీసు ఫిజికల్‌ ట్రైనింగ్‌ మినహా ఉద్యోగాలకు పోటిపడుతున్నవారి కోసం తన సొంత ఖర్చులతో అనుభవజ్ఞులైన  కోచింగ్‌ స్టాఫ్‌తో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఆదివారం స్ర్కీనింగ్‌ పరీక్ష నిర్వహించారు. అర్హత సాధించిన అభ్యర్థులకు 3 నెలల పాటు ఉచిత మధ్యాహ్న భోజనంతో పాటు శిక్షణ, స్టడీ మెటీరియల్స్‌, ఆన్‌లైన్‌ క్లాస్‌ల యాప్‌ను అందించనున్నారు. జిల్లాకు చెందిన ఇతర ప్రజాప్రతినిధులుసైతం తమ నియోజకవర్గాల్లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణను అందించనున్నారు. ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సైతం తన నియోజకవర్గంలోని అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నారు. బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌, ఇతర ప్రజాప్రతినిధులుసైతం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - 2022-04-18T05:21:43+05:30 IST