ఉక్రెయిన్‌లో తమిళ విద్యార్థులకు Cm Stalin భరోసా

ABN , First Publish Date - 2022-02-27T13:42:22+05:30 IST

ఉక్రెయిన్‌లో తల్లడిల్లుతున్న తమిళ విద్యార్థులు ఆందోళన చెందవద్దని, వారిని వీలైనంత త్వరగా స్వస్థలాలకు చేర్చేందుకు తక్షణ చర్యలు చేపట్టి కాపాడుకుంటామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ భరోసా ఇచ్చారు. ఈ మేరకు

ఉక్రెయిన్‌లో తమిళ విద్యార్థులకు Cm Stalin భరోసా

                       - వీడియోకాల్స్‌లో ఓదార్పు


చెన్నై: ఉక్రెయిన్‌లో తల్లడిల్లుతున్న తమిళ విద్యార్థులు ఆందోళన చెందవద్దని, వారిని వీలైనంత త్వరగా స్వస్థలాలకు చేర్చేందుకు తక్షణ చర్యలు చేపట్టి కాపాడుకుంటామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఉక్రెయిన్‌లో వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ధైర్యం చెప్పారు. శనివారం ఉదయం చెన్నై మెరీనాబీచ్‌ కామరాజర్‌ సాలై ఎళిలగమ్‌ భవనసముదాయంలో వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ నుంచి పలువురు విద్యార్థులకు వీడియో కాల్స్‌ చేసి మాట్లాడారు. తొలుత ఆ కంట్రోల్‌ రూమ్‌ పనితీరు ను ఆయన స్వయంగా పరిశీలించారు. ఆ తర్వాత ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో బసచేస్తున్న ఓ విద్యార్థిని, ఇద్దరు విద్యార్థులతో వీడియో ఫోన్‌కాల్స్‌ ద్వారా స్టాలిన్‌ మాట్లాడారు. తమిళ విద్యార్థులు బసచేస్తున్న ప్రాంతాల్లో పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. తొలుత ఓ విద్యార్థితో మాట్లాడుతూ ‘నమస్కారం సోదరా! ఎలా వున్నావు? నీతోపాటు ఎంతమంది తమిళ విద్యార్థులు బసచేస్తున్నారు?’ అంటూ ప్రశ్నించారు. ఆ విద్యార్థి బదులిస్తూ తనతోపాటు ఐదుగురు విద్యార్థులు బసచేస్తున్నారని, తాము బసచేస్తున్న ప్రాంతం ప్రశాంతంగానే ఉందని, అయితే ఏ సమయంలోనైనా రష్యా తమ ప్రాంతంపై దాడికి దిగుతుందేమోనని భయపడుతున్నామని చెప్పాడు. అన్నపానీయాలు సక్రమంగా లభిస్తున్నాయంటూ స్టాలిన్‌ ప్రశ్నకు సమాధానమిచ్చాడు. అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారుల ద్వారా తమను స్వస్థలానికి తరలించే ఏర్పాట్లు ప్రారంభించారని కూడా ఆ విద్యార్థి తెలిపాడు. ఆ తర్వాత స్టాలిన్‌ అక్కడి విద్యార్థులతో మాట్లాడుతూ.. యుద్ధవాతావరణం ఉన్నా ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని, తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, స్వస్థలాలకు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి తక్షణ చర్యలు చేపడుతున్నామని ఓదార్చారు. ముఖ్యమంత్రితోపాటు మంత్రులు ఎం. సుబ్రమణ్యం, పొన్ముడి, ప్రవాసతమిళుల సంక్షేమ సంస్థ కమిషనర్‌ జెసింథా లాజరస్‌ తదితర ఉన్నతాధికారులు కంట్రోల్‌రూమ్‌ పనితీరునుపరిశీలించారు.


కంట్రోల్‌రూమ్‌కు రాత్రంతా ఫోన్‌కాల్స్‌

ఉక్రెయిన్‌లోని సుమారు ఐదువేలమంది తమిళ విద్యార్థులను స్వస్థలాలకు రప్పించే ప్రయత్నాల్లో భాగంగా ఎళిలగమ్‌ భవనసముదాయంలో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్‌లోని అధికారులు రాత్రంతా నిద్ర లేకుండా పనిచేశారు. ఉక్రెయిన్‌లో వివిధ ప్రాంతాల్లో బసచేస్తున్న విద్యార్థులు వరుసగా కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ తమ బాధలను తెలుపుకొన్నారు. ముఖ్యంగా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నుంచి తమిళ విద్యార్థులు అధిక సంఖ్యలో కంట్రోల్‌రూమ్‌కు ఫోన్‌కాల్స్‌, వాట్స్‌పకాల్స్‌, వీడియోకాల్స్‌ చేసి అధికారులతో మాట్లాడారు. ఉక్రెయిన్‌ నుంచి ఎవరు కాల్‌ చేసినా వారి వీడియో ప్రత్యక్షంగా ప్రసారం అయ్యేలా కంట్రోల్‌ రూమ్‌లో పెద్ద ఎల్‌ఈడీ స్ర్కీన్‌ అమర్చారు. అదే విధంగా కంట్రోల్‌ రూమ్‌ నుంచి సమాధానాలు ఇచ్చే అధికారులు ఉక్రెయిన్‌లో ఉన్నవారికి స్పష్టంగా కనిపించేలా ప్రత్యేకంగా కంప్యూటర్లు, వెబ్‌కెమెరాల వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్‌లో బసచేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు కోయంబత్తూరు, తిరుచ్చి, ఈరోడ్‌, తిరునల్వేలి, మదురై, తేని, పళని, కొడైకెనాల్‌, నామక్కల్‌, వేలూరు, తిరుపత్తూరు, కాంచీపురం, తిరువళ్లూరు, విల్లుపురం, కన్నియాకుమారి తదితర జిల్లాల నుంచి కూడా ఈ కంట్రోల్‌ రూమ్‌ కు వరుసగా ఫోన్‌ చేసి తమ పిల్లలను వీలైనంత త్వరగా స్వస్థలానికి రప్పించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.


కీవ్‌ మెట్రోరైలు సొరంగంలో 400 మంది విద్యార్థులు

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై అదే పనిగా రష్యా వైమానిక దళాలు దాడులు జరుపుతుండటంతో ఆ ప్రాంతంలో నివసిస్తున్న సుమారు 400 మంది విద్యార్థులు ప్రాణభయంతో అక్కడి మెట్రో రైలు సొరంగ మార్గంలో తలదాచుకుంటున్నారు. ఆ మేరకు చెన్నైలోని కంట్రోల్‌ రూమ్‌కు అక్కడ బసచేస్తున్న విద్యార్థులు వీడియో కాల్స్‌ ద్వారా ఆ విషయాన్ని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి వారికి సకాలంలో అన్నపానీయాలు లభించేలా భారత రాయబార కార్యాలయం అధికారుల ద్వారా తగు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా తమను స్వస్థలానికి చేర్చాలంటూ పలువురు విద్యార్థులు కంట్రోల్‌ రూమ్‌ అధికారులతో మాట్లాడుతూ కంటతడిపెట్టుకున్నారు. అధికారులు వారిని ఓదార్చి ధైర్యంగా ఉండమని, వారిని స్వస్థలానికి చేర్చేందుకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారని తెలిపారు.

Updated Date - 2022-02-27T13:42:22+05:30 IST