ఏడాది పాలనలో ఏమేం చేశాం?

ABN , First Publish Date - 2022-05-31T14:18:46+05:30 IST

డీఎంకే ప్రభుత్వం యేడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ శాఖల పనితీరును రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సమీక్షించనున్నారు. ఆ మేరకు జూన్‌ ఒకటి నుంచి

ఏడాది పాలనలో ఏమేం చేశాం?

                - రేపటి నుంచి అధికారులతో స్టాలిన్‌ సమీక్ష


చెన్నై: డీఎంకే ప్రభుత్వం యేడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ శాఖల పనితీరును రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సమీక్షించనున్నారు. ఆ మేరకు జూన్‌ ఒకటి నుంచి రెండు రోజులపాటు అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమవుతున్నారు. ఈ సమావేశాలు సచివాలయం సమీపంలోని నామక్కల్‌ కవింజర్‌ మాళిగై సమావేశ మందిరంలో జరుగనున్నాయి. శాసనసభ ఎన్నికల సందర్భంగా డీఎంకే మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు ఆయా శాఖల్లో సమర్థవంతంగా అమలయ్యాయా? అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం ప్రకటించిన పథకాలను ఏ మేరకు అమలు చేశారు తదితర వాటిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించనున్నారు. జూన్‌ ఒకటిన జరిగే సమావేశంలో నగరపాలక, ప్రజాపనులు, రహదారులు, ఇంధనం, చిన్న ఓడరేవులు, గృహనిర్మాణం, వాణిజ్య పన్నులు, రవాణా, న్యాయశాఖ, సమాచార సాంకేతిక శాఖలు సహా మొత్తం 19 మంత్రిత్వ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు పాల్గొంటారు. జూన్‌ రెండున జరిగే సమావేశంలో ఆదిద్రావిడ, వ్యవసాయ, పశుసంవర్థక, డైరీ, మత్స్య శాఖ, బీసీల సంక్షేమ శాఖ, ఆహార, వినియోగవస్తువుల పంపిణీ, కార్మిక సంక్షేమ శాఖ ఆరోగ్యం తదితర శాఖలు సహా మరో 19 మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఈ సమావేశాలు రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయని ఉన్నతాధికారులపై ముఖ్యమంత్రి తగు చర్యలు తీసుకోనున్నారని తెలుస్తోంది.


తిరుచ్చి కార్పొరేషన్‌లో ఆకస్మిక తనిఖీ...

తిరుచ్చి పరిసరాల్లోని డెల్టా జిల్లాల్లో పంట కాల్వల మరమ్మతు, పూడిక తీత పనులను పరిశీలించేందుకు సోమవారం బయలుదేరిన ముఖ్యమంత్రి స్టాలిన్‌ హఠాత్తుగా తిరుచ్చి కార్పొరేషన్‌ కార్యాలయంలో తనిఖీ చేశారు. నగరపాలక శాఖ మంత్రి కేఎన్‌ నెహ్రూ కూడా ఆయన వెంట వున్నారు. సోమవారం ఉదయం సీఎం చెన్నై నుంచి విమానంలో బయలుదేరి తిరుచ్చి నగరానికి చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద తిరుచ్చి కలెక్టర్‌ శివరాసు, పార్టీ ప్రముఖులు, మంత్రులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ముందుగా తిరుచ్చి ఉరయూరులోని డీఎంకే వృద్ధనేత సెల్వేంద్రన్‌ను పరామర్శించారు. అక్కడి నుంచి కారులో బయలుదేరిన స్టాలిన్‌ మధ్యలో తిరుచ్చి కార్పొరేషన్‌ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీంతో కార్పొరేషన్‌ కార్యాలయంలో ఒక్కసారిగా హడావుడి నెలకొంది. మేయర్‌ చాంబర్‌లో ముఖ్యమంత్రి స్టాలిన్‌ కూర్చిని కమిషనర్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌, కార్పొరేషన్‌ జమాపద్దుల అధికారులను పిలిచి మాట్లాడారు. కార్పొరేషన్‌ పరిధిలో అమలు చేస్తున్న పథకాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ సందర్భంగా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. కార్పొరేషన్‌ కార్యాలయం బయట గుమికూడిన స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గుంతలమయంగా ఉన్న ఉరయూరు రహదారికి తక్షణం మరమ్మతు చేయాలని అధికారులను ఆదేశించారు. 

Updated Date - 2022-05-31T14:18:46+05:30 IST