మరో వాయుగండం

ABN , First Publish Date - 2021-11-29T16:37:18+05:30 IST

బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్‌కు సమీపంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడి 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. ఈశాన్య రుతుపవనాలు తీవ్రరూపం దాల్చడం,

మరో వాయుగండం

4 రోజులు భారీ వర్షసూచన

రాత్రిపూట వానలతో తేరుకోని చెన్నై

బాధిత ప్రాంతాల్లో స్టాలిన్‌ పర్యటన


చెన్నై: బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్‌కు సమీపంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడి 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. ఈశాన్య రుతుపవనాలు తీవ్రరూపం దాల్చడం, అల్పపీడనం పడమర, వాయవ్యదిశగా సముద్రతీరం వైపు కదులుతూ వాయుగుండంగా మారుతుందని వివరించారు. ఈ కారణంగా నాలుగురోజులుపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తా యని పేర్కొన్నారు. సోమవారం నుంచి డిసెంబర్‌ రెండో తేదీ వరకు కన్ని యాకుమారి, తిరునల్వేలి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపుల తో భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇదే విధంగా తూత్తుకుడి, రామనాథపురం జిల్లాల్లో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వివరించారు. పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో భారీగా, ఓ మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు.


కోలుకోని చెన్నై...

దీపావళి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చెన్నై వాసులు తీవ్ర ఇబ్బం దులకు గురవుతున్నారు. వారం రోజులుగా రాత్రిపూట కురుస్తున్న కుండ పోత వర్షాలకు తల్లడిల్లిపోతున్నారు. భారీ వర్షాలకు నగరంలోని జనావాస ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆ తర్వాత ఈ నెల 13, 14 తేదీల్లో వాయుగుండం కారణంగా కుండపోత వర్షాలు కురిశాయి. ఈ నెల 20, 21న మళ్ళీ వాయుగుండం ప్రభావంతో నగరాన్ని భారీ వర్షాలు మరోమారు ముంచెత్తాయి. గత మూడు రోజులుగా రాత్రిపూట కురుస్తున్న కుండపోత వర్షాలు నగరవాసులను ముప్పుతిప్పట్లు పెడుతున్నాయి. వర్షాల కారణంగా కేకేనగర్‌, అశోక్‌నగర్‌, వేళచ్చేరి, మధురవాయల్‌, కోయంబేడు, మైలాపూరు, అడయార్‌, ప్యారీస్‌, రాయ పురం, ట్రిప్లికేన్‌, ఆవడి, అంబత్తూరు, తాంబరం తదితర ప్రాంతాలన్నీ ఇంకా జలదిగ్బంధంలో కొట్టుమిట్టాడుతు న్నాయి.  టి.నగర్‌, కేకేనగర్‌, కోడంబాక్కం, వడపళని తదితర ప్రాంతాల్లో వాననీటితోపాటు ముగురునీరు కూడా చేరి వరదలా ప్రవహిస్తుంటంతో ఆ ప్రాంతాల్లో దుర్గంధం వ్యాపిస్తోంది. కార్పొరేషన్‌ అధికారులు మోటార్లతో వాననీటిని తొలగిస్తున్నప్పటికీ వర్షం కురుస్తుం డడం తో ప్రయోజనం లేకపోతోంది.  ఆదివారం ఉదయం తొమ్మిది, పది గంటల వరకూ ఎండ రాయడంతో ఇక వర్షం రాదని అనుకున్నా తర్వాత ఆకాశం మేఘావృ తమై మళ్లీ జల్లులతో వర్షం ప్రారంభమైంది. మరో నాలుగు రోజులపాటు చెన్నై, తిరువళ్లూరు తదితర పరిసర జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటిం చడంతో నగరవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.


20 గ్రామాలకు వరద హెచ్చరిక

వీరాణం చెరువు నుంచి అదనపు జలాలను విడుదల చేస్తుండటంతో ఆ చెరువు సమీపంలోని 20 గ్రామాలకు అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. చెరువులో 47.50 అడుగుల మేర నీరు నిల్వచేయడానికి వీలుంది.   చెన్నై నగరానికి రోజూ మంచినీటిని కూడా ఈ చెరువు నుండే విడుదల చేస్తున్నారు. గత నెల రోజులుగా వీరాణం పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురవటం, మేట్టూరు డ్యామ్‌ నుంచి విడుదలయ్యే అదనపు జలాలు వడలారు మీదుగా ప్రవేశించడంతో చెరువు నీటిమట్టం క్రమంగా పెరు గుతోంది. ఈ పరిస్థితుల్లో వీరాణం చెరువు సమీపంలోని వీరముండయన్‌ సత్తం, కుమరాచ్చి, వెల్లూరు, నడుతిట్టు, పరుత్తిక్కుడి, శివాయం, నంది మంగళం సహా 20 గ్రామాలకు వరద హెచ్చరికలు జారీ చేశారు. ఆ గ్రామాల్లో నివసిస్తున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.


వర్షబాధిత ప్రాంతాల్లో స్టాలిన్‌ పర్యటన

 ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆదివారం ఉదయం నగరంలో, తిరువళ్లూరు జిల్లాలో వర్షబాధిత ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించారు. తొలుత తిరువేర్కాడులో వర్షబాధిత ప్రాంతాల్లో  మోకాలిలోతు వర్షపునీటిలో నడిచి వెళ్లి బాధితులను పరామర్శించారు. అక్కడికి నుంచి పద్మావతి నగర్‌ వెళ్లి వర్షబాధిత ప్రాంతాలను పరిశీలించి వాననీటి తొలగింపు పనులను పర్య వేక్షించారు. 

అక్కడి పాఠశాలలో ప్రత్యేక శిబిరంలో ఉన్న వర్షబాధితులను పరామర్శించి వారికి సహాయకాలు పంపిణీ చేశారు.  ఆ తర్వాత ఆవడిలో వర్షబాధిత ప్రాంతాలను సందర్శించారు. శ్రీరామ్‌నగర్‌, తిరుముల్లైవాయల్‌, గణపతినగర్‌ ప్రాంతాలకు కాలినడకనే వెళ్ళారు. అంబత్తూరు ఎస్టేట్‌ ప్రాంతాల్లో వర్షపునీరు నిలువకుండా శాశ్వత ప్రాతిపదికన తగు చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులకు ఆదేశించారు. స్టాలిన్‌ వెంట మంత్రి ఎస్‌ఎం నాజర్‌, ఎంపీ కె.జయకుమార్‌, తిరువళ్లూరు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ అల్పీజాన్‌ వర్గీస్‌ తదితరులు పర్యటించారు.


నీట మునిగిన రహదారి వంతెనలు...

తిరువేర్కాడు - మధురవాయల్‌ నోలంబూరు మధ్య ఐదు చోట్ల రహదారి వంతెనలు ఆదివారం ఉదయం నీట మునిగాయి. కోయంబేడు రైల్‌నగర్‌, మధురవాయల్‌ ఓంశక్తినగర్‌, ఎంజీఆర్‌ వర్సిటీ, అడయాలంపట్టు, తిరువే ర్కాడు వేలప్పన్‌చావిడి, నొలంబూరు ప్రాంతాల్లోని రహ దారి వంతెనల వద్ద రెండడుగుల లోతున వర్షపునీరు ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. 


మధురాంతకం చెరువులో జలాల విడుదల...

చెంగల్పట్టు జిల్లాలోని మధురాంతకం చెరువు నుంచి అదనపు జలాలను విడుదల చేస్తుండటంతో ఆ చెరువు సమీపంలో ఉన్న 21 గ్రామాలకు అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు వెళ్ళమంటూ దండోరా వేస్తున్నారు.  


తూత్తుకుడిలో...

తూత్తుకుడి జిల్లాల్లో గత మూడురోజులుగా ప్రజలు జలదిగ్బంధంలో అవస్థలు పడుతున్నారు.  తూత్తుకుడి కార్పొరేషన్‌ పరిధిలోని పలు ప్రాంతాలు ఇంకా దీవులుగానే ఉన్నాయి.   ఈ ప్రాంతాలకు చెందినవారిని అగ్నిమాపక సిబ్బంది, విపత్తుల నివారణ బృందం రబ్బరు బోట్లతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇదే విధంగా కడలూరు జిల్లా కూడా జలదిగ్బంధంలో కొట్టుమిట్టాడుతోంది. 



చెన్నై సహా 6 జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు

భారీ వర్షాల కారణంగా చెన్నై సహా ఆరు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఆ మేరకు చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు, తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు జిల్లా కలెక్టర్లు సెలవు ప్రకటించారు. నాగపట్టినం జిల్లాలో పాఠ శాలలకు మాత్రమే సెలవు ప్రకటించారు. పుదుచ్చేరి, కారైక్కాల్‌ ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలకు రెండు రోజులు సెలవు ప్రకటించారు.


Updated Date - 2021-11-29T16:37:18+05:30 IST