ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి సారించండి

ABN , First Publish Date - 2022-01-19T16:13:06+05:30 IST

ప్రజా సంక్షేమం, అభివృధ్ధి పథకాలతోపాటు ఆదాయ వనరుల సమీకరణపై కూడా ప్రత్యేక దృష్టి సారిం చాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం సభ్యులకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సూచించారు. మంగళవారం ఉదయం సచివాలయంలో ఆ సంఘ సమావేశం ఆయన

ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి సారించండి

                    - ప్రణాళికా సంఘానికి Stalin హితవు


చెన్నై: ప్రజా సంక్షేమం, అభివృధ్ధి పథకాలతోపాటు ఆదాయ వనరుల సమీకరణపై కూడా ప్రత్యేక దృష్టి సారిం చాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం సభ్యులకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సూచించారు. మంగళవారం ఉదయం సచివాలయంలో ఆ సంఘ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. ప్రణాళికా సంఘం అధ్యక్షుడైన సీఎం స్టాలిన్‌ ఈ సందర్భంగా మానవ వనరుల అభివృద్ధి, ప్రజల జీవనాభివృద్ధి, విద్యాభివృద్ధి, సామాజిక న్యాయం అమలు. పేదరిక నిర్మూలన, మానవ హక్కుల పరిరక్షణకు అనువైన పథకాలను రూపొందించటానికి ప్రణాళికా సంఘం సభ్యులు తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పథకాల రూపకల్పనకు అధిక ప్రాధాన్యమిస్తూనే ప్రభుత్వానికి తగిన ఆదాయ వనరులను కూడా పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం కొన్ని జిల్లాలు ఆర్థికపరంగా పుంజుకున్నాయని, మరికొన్ని జిల్లాలు వెనుకబడి ఉన్నాయని, ఈ తారతమ్యాలను తొలగించడంపై కూడా సభ్యులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవమేనని, అనవసర వ్యయాలను నిరోధించేందుకు చర్యలు చేపడుతున్నానని సీఎం వెల్లడించారు. పన్నుల వసూలు, రిజిస్ర్టేషన్ల రూపంలోనే ప్రభుత్వానికి ఆర్థికవనరులు సమకూరుతున్నాయని, అదే సమయంలో పర్యాటక రంగం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, హస్తకళలు, చేనేత రంగం తదితర శాఖల నుంచి అధికంగా ఆదాయ వనరులు లభించేలా సభ్యులందరూ సమష్టిగా చర్యలు తీసు కోవాలన్నారు. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో వైద్య, విద్యాశాఖలపై అధిక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఆర్థికాభివృద్ధి, విద్యాభివృద్ధి, సామాజిక న్యాయం, పారదర్శకమైన పరిపాలన, అన్ని శాఖల్లో సమగ్రాభివృద్ధి సాధించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్టాలిన్‌ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జయ రంజన్‌, ఆర్థికాభివృద్ధి శాఖ అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విక్రమ్‌కపూర్‌, శాశ్వత సభ్యుడు ప్రొఫెసర్‌ రాజశేఖర్‌, ప్రణాళికా సంఘం సభ్యులు దీనబంధు, టీఆర్పీ రాజా, సిద్ధవైద్యుడు శివరామన్‌, నర్తకి నటరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-19T16:13:06+05:30 IST