అన్నదాతల జీవితాల్లో వెలుగులే లక్ష్యం

ABN , First Publish Date - 2022-04-17T14:02:44+05:30 IST

రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉంటేనే ప్రభుత్వం సుభిక్షంగా ఉండగలదని, వారి జీవితాల్లో వెలుగులు నింపడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆ దిశగానే లక్షమంది రైతులకు పది నెలల్లోపే

అన్నదాతల జీవితాల్లో వెలుగులే లక్ష్యం

                         - సీఎం ఎంకే స్టాలిన్‌


చెన్నై: రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉంటేనే ప్రభుత్వం సుభిక్షంగా ఉండగలదని, వారి జీవితాల్లో వెలుగులు నింపడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆ దిశగానే లక్షమంది రైతులకు పది నెలల్లోపే ఉచిత విద్యుత్‌ కనెక్షన్లను మంజూరు చేశామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అన్నారు. స్థానిక అన్నాసాలైలోని రాష్ట్ర విద్యుత్‌ బోర్డు ప్రధాన కార్యాలయంలో విద్యుత్‌ కనెక్షన్లు పొందిన వివిధ ప్రాంతాలకు చెందిన రైతులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన ప్రసంగిస్తూ.. సభకు విచ్చేసిన రైతులను చూస్తుంటే తనకెంతో సంతోషం కలుగుతోందని, ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వెంటనే లక్షమంది రైతులకు యేడాదిలోపున ఉచిత విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేసే పథకాన్ని ప్రకటించానని పేర్కొన్నారు. ఆ పథకం ఏడాది లోపున పూర్తవుతుందా..అనే అనుమానం తనకు కలిగిందని, అయితే విద్యుత్‌ శాఖ మంత్రి సెంథిల్‌బాలాజీ అర్హులైన లక్షమంది రైతులకు కనెక్షన్లను పది నెలల్లోపునే మంజూరు చేశారని చెప్పారు. 


ఈ సభలో లక్షవ లబ్ధిదారుడైన రైతుకు ఉచిత విద్యుత్‌ కనెక్షన్‌ మంజూరు పత్రాన్ని అందజేయడం కూడా తనకెంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. అన్నదాతలకు విద్యుత్‌ కనెక్షన్లను మంజూరు చేయడం వల్ల సకాలంలో వారు ముక్కారు పంటలను పండించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయగలరని అన్నారు. అన్నదాతల కష్టాలు తొలగించి వారి జీవితాల్లో వెలుగులు నింపడమే డీఎంకే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. విద్యుత్‌శాఖ మంత్రి సెంథిల్‌బాలాజీ లాగే మంత్రులందరూ వేగంగా పనిచేసి వారి శాఖల ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ పథకం అమలుకు విద్యుత్‌బోర్డు రూ.803 కోట్ల మేరకు నిధులు కేటాయించిందని తెలిపారు. అనంతరం సీఎం విద్యుత్‌ బోర్డు ప్రధాన కార్యాలయానికి వెళ్లి వినియోగదారులకు సేవలందించే ‘మిన్నగమ్‌’ సర్వీస్‌ సెంటర్‌ పనితీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సెంథిల్‌బాలాజి, విద్యుత్‌ పంపిణీ సంస్థ అధ్యక్షుడు రాజేష్‌ లఖానీ, ఇంధన శాఖ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి రమేష్ చంద్‌మీనా, పీఎంకే అధ్యక్షుడు జీకే మణి, చేపాక్‌ ట్రిప్లికేన్‌ శాసనసభ్యుడు ఉదయనిధి స్టాలిన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-17T14:02:44+05:30 IST