Cm Commemts: దివ్యాంగులకు ప్రత్యేక విద్యా పథకం

ABN , First Publish Date - 2022-07-26T13:26:33+05:30 IST

రాష్ట్రంలోని దివ్యాంగుల కోసం సమగ్ర పాఠశాల విద్యా పథకాన్ని, అందరికీ విద్యా ఉద్యమం పథకంలో విలీనం చేసి 3 నుంచి 18 యేళ్లలోపు

Cm Commemts: దివ్యాంగులకు ప్రత్యేక విద్యా పథకం

- ప్రారంభించిన సీఎం స్టాలిన్‌ 

- ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతాం

- అమర్‌సేవా సంఘం సేవలు ప్రశంసనీయం


చెన్నై, జూలై 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని దివ్యాంగుల కోసం సమగ్ర పాఠశాల విద్యా పథకాన్ని, అందరికీ విద్యా ఉద్యమం పథకంలో విలీనం చేసి 3 నుంచి 18 యేళ్లలోపు దివ్యాంగులకు ప్రత్యేక విద్యా పథకాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(M k Stalin) ప్రారంభించారు. నగరంలో సోమవారం ఉదయం దివ్యాంగుల సంక్షేమం కోసం సేవలందించే స్వచ్చంద సంస్థ అమర్‌ సేవా సంఘం 40వ వార్షికోత్సవంలో పాల్గొన్న స్టాలిన్‌ ఆ సంఘంతో కలిసి ప్రభుత్వం అమలు చేయనున్న ఈ పథకం దివ్యాంగులను ఉన్నతమైన విద్యావంతులుగా తీర్దిదిద్దుతుందన్నారు. అమర్‌ సేవా(Amar seva) సంఘం వ్యవస్థాపకుడు రామకృష్ణన్‌ నేవీ ఆఫీసర్‌ ఉద్యోగ దేహదారుఢ్య పరీక్షల సందర్భంగా వెన్నెముక విరిగి, గొంతు వద్ద గాయం ఏర్పడటంతో వైకల్యం ఏర్పడినా ఆత్మస్థయిర్యంతో ముంబయి(Mumbai)లో చికిత్సలు పొంది 1981లో ఆయక్కుడిలో దివ్యాంగుల చిన్నారులకు కోసం ఓ పాఠశాలను ప్రారంభించి సేవలు ప్రారంభించారని స్టాలిన్‌ పేర్కొన్నారు. ఇదే విధంగా ఆ సంఘం కార్యదర్శి శంకరరామన్‌(Shankarraman) కూడా నరాల విచ్చిన్నంతో దివ్యాంగులై 1992లో ఈ సంఘంలో చేరి సేవలందిస్తున్నారని ప్రశంసించారు. వీరిద్దరూ ప్రభుత్వ మార్గదర్శకత్వంతో తెన్‌కాశి, తిరునల్వేలి, తూత్తుకుడి, విరుదునగర్‌ జిల్లాల్లో తమ సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగుల సంక్షేమం కోసం విశిష్టమైన సేవలందిస్తుండటం హర్షనీయమన్నారు. ఈ సంఘం 40వ వార్షికోత్సవాల్లో పాల్గొనడం తనకెంతో ఆనందంగా ఉందని, ఈ శుభదినాన దివ్యాంగుల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించడం కూడా సంతోషంగా ఉందన్నారు. ఈ పథకం ప్రకారం 3 నుంచి 18 యేళ్లలోపు దివ్యాంగులకు నాణ్యమైన విద్యనందిస్తామన్నారు. మహిళలకు ప్రాధాన్యమిచ్చి, క్రీడా విద్య, వ్యాయామ విద్యలు అందించి దివ్యాంగులను సమర్థవంతమైన ప్రతిభాపాటవాలు కలిగిన విద్యావంతులుగా తీర్దిదిద్దుతామని చెప్పారు. దేశంలోనే దివ్యాంగులకు అత్యధిక సంఖ్యలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రంగా తమ రాష్ట్రం పేరుగడించిందన్నారు. అమర్‌సేవా సంఘం సుమారు 900 గ్రామాల్లో దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతోందని, యాప్‌ ద్వారా పిన్నవయస్సులోనే దివ్యాంగులను గుర్తించి వారికి సునిశిత శిక్షణ కూడా అందిస్తోందని ఆయన ప్రశంసించారు ఈ సంఘం తన సేవలను నిరాటంకంగా కొనసాగించేందుకు తమ ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తుందని సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఈ వేడుకల్లో మంత్రులు గీతా జీవన్‌, ఎం.సుబ్రమణ్యం, పీకే శేఖర్‌బాబు, అన్బిల్‌ మహేష్‌(Anbil Mahesh), మైనారిటీ సంక్షేమ సంస్థ అధ్యక్షులు పీటర్‌ ఆల్ఫోన్స్‌, థౌజెంట్‌ లైట్స్‌ శాసనసభ్యుడు డాక్టర్‌ ఎళిలన్‌, మాజీ ఎమ్మెల్యే అబూబక్కర్‌, పాఠశాలల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కాకర్ల ఉషా, దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్‌ ఆనందకుమార్‌, అమర్‌ సేవా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్‌ మురుగయ్యా, కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-26T13:26:33+05:30 IST