నిధుల కోసం కేంద్రంతో పోరాడండి

ABN , First Publish Date - 2022-04-13T14:37:17+05:30 IST

పెట్రోలు, డీజిల్‌ ధరల తగ్గింపు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం పోరాడితే రాష్ట్రంలో బీజేపీ బలం పెరుగుతుందే తప్ప అనవసరపు రాజకీయ రాద్ధాంతాలకు

నిధుల కోసం కేంద్రంతో పోరాడండి

- అనవసర రాజకీయ రాద్ధాంతాలతో బలపడలేరు

- ముందు పెట్రోల్‌, డీజిల్‌ ధరల్ని తగ్గించమనండి

- బీజేపీ ఎమ్మెల్యేలకు స్టాలిన్‌ హితవు


చెన్నై: పెట్రోలు, డీజిల్‌ ధరల తగ్గింపు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం పోరాడితే రాష్ట్రంలో బీజేపీ బలం పెరుగుతుందే తప్ప అనవసరపు రాజకీయ రాద్ధాంతాలకు పాల్పడితే ఎప్పటికీ పుంజుకోలేరని ముఖ్యమంత్రి స్టాలిన్‌ హితవు పలికారు. శాసనసభలో బీజేపీ సభ్యురాలు వానతి శ్రీనివాసన్‌ వెస్ట్‌మాంబళంలోని అయోధ్య మండపాన్ని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోవడంపై ప్రస్తావించగా.. సీఎం స్పందిస్తూ ఆ మండపంలో అక్రమాలు జరిగాయనే కారణంగానే దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకుని మండపానికి తాళం వేసిందని, ఆ సమయం లో బీజేపీ, దాని అనుబంధ సంస్థలకు చెందిన కార్యకర్తలంతా అక్కడ గొడవకు దిగారని తెలిపారు. ఇలాంటి అనవసరపు విషయాలను రాజకీయ వివాదంగా మార్చవద్దని సూచించారు. మంగళవారం ఉదయం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే బీజేపీ సభ్యురాలు వానతి శ్రీనివాసన్‌ వెస్ట్‌మాంబళంలోని అయోధ్య మండపాన్ని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు బదులిస్తూ ... అయోధ్యమండపంలో యేళ్ల తరబడి అక్రమాలు జరుగుతున్నాయని, పితృదేవతలకు తర్పణాలు నిర్వహించేందుకు భారీగా సొమ్ములు వసూలు చేస్తున్నారన్నారు. రౌడీ మూకలు పూజలకు వచ్చేవారిని బెదిరించి డబ్బులు గుంజుతున్నట్లు కూడా ఆరోపణలు వచ్చాయని, వీటన్నింటిని పరిశీలించిన మీదటే ఆ మండపాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. తొలుత అయోధ్యమండపంలో అక్రమాలు బయటపడగానే ఆ మండపాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ట్రస్టీని నియమిస్తే, దానిని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్ళారని, చివరకు ఆ పిటిషన్‌ తోసివేతకు కూడా గురైందన్నారు. ట్రస్టీ నియామకం సబబేనంటూ కోర్టు ఉత్తర్వులివ్వడంతో ఆ మండపాన్ని స్వాధీనం చేసుకోవడానికి దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది  వెళ్లగా బీజేపీ నాయకుడి నేతృత్వంలో అల్లరి మూకలు రాళ్ళతో దాడి చేసాయన్నారు. చివరకు జిల్లా కలెక్టర్‌కు పరిస్థితి వివరించిన మీదటే ఆ మండపాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అన్నాడీఎంకే సభాపక్ష నాయకుడు పన్నీర్‌సెల్వం మాట్లాడుతూ.. మంత్రి శేఖర్‌బాబు ప్రసంగంలో అల్లరి మూకలు అనే పదాన్ని వాడటం సమంజసమేనా అని ప్రశ్నించారు. వెంటనే సీఎం స్టాలిన్‌ జోక్యం చేసుకుంటూ అయోధ్యమండపం వివాదం ప్రస్తుతం కోర్టు పరిశీలనలో ఉండటంతో తుది తీర్పు కోసం వేచి చూస్తున్నామని చెప్పారు. అయోధ్యమండపం అక్రమాలు గురించి దేవాదాయ శాఖ చేపట్టిన చర్యలు గురించి మంత్రి శేఖర్‌బాబు చక్కగానే వివరించారని, ఆయన వ్యాఖ్యలను తొలగించాల్సిన అవసరం లేదన్నారు. ఈ సందర్భంగా బీజేపీ సభ్యులందరికి తాను ఓ విజ్ఞప్తి చేస్తున్నానని, అనవసరమైన విషయాలను రాజకీయ అంశాలుగా మార్చుకున్ని రాద్ధాంతం చేయడం మానుకుంటే మంచిదన్నారు. రాష్ట్రంలోని సమస్యలపై బీజేపీ సభ్యులు దృష్టిసారించాలని, సామాన్య ప్రజలను సైతం నష్టపరిచే విధంగా ప్రస్తుతం పెట్రోలు డీజిల్‌ ధరలు విపరీతంగా పెరిగాయని వాటి ధరలను తగ్గించేలా కేంద్రంపై ఒత్తిడి చేయాలన్నారు. ప్రజలకు సానుకూలమైన అంశాలపై దృష్టిసారించాలని, అనవసరమైన విషయాలపై రాజకీయ రాద్ధాంతాలకు పాల్పడితే రాష్ట్రంలో బీజేపీని ఎప్పటికీ బలపరచలేరని అన్నారు. 

Updated Date - 2022-04-13T14:37:17+05:30 IST