సీఎం సారు.. కుర్చీ ఎటు పాయె!

ABN , First Publish Date - 2021-12-29T06:27:18+05:30 IST

కుర్చీ వేసుకుని కూర్చొని సమస్యలు పరిష్కరిస్తా.. అంటూ సీఎం కేసీఆర్‌ పలు సందర్భాల్లో ప్రకటించారు. ఎన్నికలు, ఉప ఎన్నికలు, పర్యటనలు, అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనల సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజలకు ఆయన పలు హామీలు గుప్పించారు.

సీఎం సారు.. కుర్చీ ఎటు పాయె!
నల్లగొండ జిల్లాలో నెల్లికల్‌ లిఫ్ట్‌కు శంకుస్థాపనచేస్తున్న సీఎం కేసీఆర్‌ (ఫైల్‌)

హామీలు నీటిమూటలేనా?


కుర్చీ వేసుకుని కూర్చొని సమస్యలు పరిష్కరిస్తా.. అంటూ సీఎం కేసీఆర్‌ పలు సందర్భాల్లో ప్రకటించారు. ఎన్నికలు, ఉప ఎన్నికలు, పర్యటనలు, అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనల సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజలకు ఆయన పలు హామీలు గుప్పించారు. అందులో చాలా వరకు నెరవేరలేదు. మరికొన్ని పలు దశల్లో నిలిచిపోయా యి. నల్లగొండకు ఈ నెల 29న సీఎం కేసీఆర్‌ వస్తున్న సందర్భంగా హామీలపై నియోజకవర్గాల వారీగా ప్రత్యేక కథనం..


నీలగిరిని బంగారు తునక చేస్తా

నల్లగొండ: ఎమ్మెల్యేగా కంచర్ల భూపాల్‌రెడ్డిని గెలిపిస్తే నల్లగొండకు రింగురోడ్డుతో పాటు నియోజకవర్గాన్ని బంగారు తునకగా మారుస్తానని 2018 ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు రింగురోడ్డుకు కనీ సం ప్రతిపాదనలు, సర్వే ప్రస్తావనే లేదు. డ్రైనేజీని మెరుగుపరుస్తానని చెప్పగా, ఇప్పగికే ఉన్న అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ అధ్వాన్నంగా తయారైంది. జిల్లా కేంద్రానికి మెడికల్‌ కళాశాల మంజూరై రెండో బ్యాచ్‌ నడుస్తుండగా, నేటికీ కళాశాల భవనానికి శంకుస్థాపన చే యకపోవడం తో పాటు భూకేటాయింపే చేయలేదు. వల్లభరావు చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మారుస్తానని ఇచ్చిన హామీ నెరవేరలేదు. 


ఒక్కటీ అములకాలె..

మిర్యాలగూడ: మిర్యాలగూడ ఎన్‌ఎస్పీ క్యాంప్‌ గ్రౌండ్‌ లో 2018, డిసెంబరు 2న నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ లో సీఎం కేసీఆర్‌ పలు హామీలు ఇచ్చారు. మిర్యాలగూడకు మహిళా డిగ్రీ కళాశాల, ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలను మంజూరు చేస్తామన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేసి సమభావన సం ఘాలకు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తామని, ఐకేపీ ఉద్యోగులను పర్మినెంట్‌ చేసి పేస్కేల్‌ మంజూరు చేస్తామన్నారు. వీటిలో ఏ ఒక్కటీ అమలు కాలేదు. పుడ్‌ప్రాసెసింగ్‌ యూ నిట్‌ కోసం దామరచర్ల మండలంలో భూములు గుర్తించినా పనులు ప్రారంభించలేదు. యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం 2019లోనే పూర్తి కావల్సివుండగా గడువును మరో ఏడాదికి పొడిగించారు. మూడు లిప్ట్‌ నిర్మాణానికి నిధులు మంజూరు కాగా, 40 శాతం మేర పనులయ్యాయి.


పూర్తికాని ప్రాజెక్టులు 

దేవరకొండ: డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును రెండున్నర ఏళ్లలో పూర్తిచేసి సాగునీరు ఇస్తామని 2015 జూన్‌ 12న మర్రిగూడ మండలం చర్లగూడెం వద్ద శంకుస్థాపన చేశారు. ఆరేళ్లయినా రిజర్వాయర్‌ ముంపు బాధితులకు పునరావా సం, పూర్తిస్థాయిలో పరిహారం అందలేదు. నిర్వాసితులు 26 రోజులుగా ప్రాజెక్టుల వద్ద దీక్షలు చేస్తున్నారు. ప్రాజెక్టులు పూర్తిచేసి రెండు లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చి ఇక్కడి పచ్చటిపొలాలను చూసేందుకు హెలికాప్టర్‌లో వస్తానని 2018 నవంబరు 21న దేవరకొండలో నిర్వహించిన ఎన్నికల సభలో ప్రకటించారు. అయినా ప్రాజెక్టుల పనులు ముందు కు సాగడంలేదు. ఈ ఎత్తిపోతల వ్యయం రూ.6190కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.2900కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టుల పరిధిలోని గొట్టిముక్కల రిజర్వాయ ర్‌ 92శాతం, సింగరాజుపల్లి రిజర్వాయర్‌ 87శాతం పూర్తికా గా, కిష్టరాయన్‌పల్లి 17శాతం, చర్లగూడెం 35శాతం పనులు పూర్తయ్యాయి. ఇక చింతపల్లి, ఇర్విన్‌, ఎర్రబెల్లి, గోకారం, ఉల్పర రిజర్వాయర్ల పనులు నేటికీ ప్రారంభదశలోనే ఉన్నాయి. నియోజకవర్గంలోని గుట్టలపై ఉన్న గ్రామాలకు ఐదు లిప్టులకు నిధులు మంజూరయ్యాయి. రూ.585కోట్ల తో పొగి ళ్ల, కంభాలపల్లి, అంబాభవాని, పెద్దగట్టు, ఏకేబీఆర్‌ లిప్టులకు పరిపాలన అనుమతి వచ్చింది. కానీ టెండర్ల ప్రక్రియలోనే నిలిచింది. ఇక శ్రీశై లం సొరంగమార్గం పనులు 42 కి.మీకు 32కి.మీ పూర్తయింది. ఇంకా 10కి.మీ తవ్వాల్సి ఉంది. నక్కలగండి రిజర్వాయర్‌ పనులు 80శాతం పూర్తయినా ముం పు బాధితులకు పునరావాసం కల్పించలేదు. ఎస్‌ఎల్‌బీసీ ఓపెన్‌కెనాల్‌ పనులు రెండేళ్లుగా పనులు నిలిచిపోయాయి.


మంజూరుకాని నిధులు

హాలియా, నాగార్జునసాగర్‌: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరి 10న హాలియా సమీపంలోని పాలెం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో నియోజకవర్గ అభివృద్ధికి సీఎం పలు హామీలు గుప్పించారు. ఎన్నిక అనంతరం నిర్వహించిన కృతజ్ఞత సభ, అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించి హాలియా, నాగార్జునసాగర్‌ మునిసిపాలిటీలకు రూ.15కోట్లు చొప్పున మంజూరు చేస్తున్నట్లు ప్రకటించగా నేటికీ నిధులు రాలేదు. 2018 సాధారణ ఎన్నికలు, 2021 ఉప ఎన్నికలో హాలియాకు డిగ్రీ కళాశాల మంజూరు చేస్తున్నట్టు ప్రకటించగా, స్థానిక జూనియర్‌ కళాశాల భవనంలోనే తాత్కాలికంగా మొదటి సంవత్సరం డిగ్రీ తరగతులు ప్రారంభమయ్యాయి. నూతన భవనానికి నేటికీ శంకుస్థాపన చేయలేదు. 4,175 ఎకరాలకు సాగునీరు అందించే నెల్లికల్లు లిప్టుకు ఈ ఏడాది ఫిబ్రవరి 10న తిరుమలగిరి (సాగర్‌) మండలం ఎర్రచెరువుతండా సమీపంలో శంకుస్థాపన చేశారు. ఈ లిఫ్టు నుంచి 24,886 ఎకరాలకు సాగునీరిచ్చేలా రూ.664కోట్ల వ్యయంతో రీడిజైన్‌ చేయగా, నేటికీ టెండర్ల ప్రక్రియ వద్దే నిలిచిపోయింది. ఉప ఎన్నిక ముగిసిన వెంటనే 10రోజుల్లో సాగర్‌కు వచ్చి పోడు భూముల సమస్య తీరుస్తామని హామీ ఇచ్చారు. తిరుమలగిరి(సాగర్‌) మండలంలో 2500ఎకరాలకు సంబంధించి పోడు భూముల సమస్య అలాగే ఉంది. సాగర్‌లో బీసీ డిగ్రీ కళాశాల రెండు నెలల్లో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా ఆ ఊసే లేదు. సాగర్‌ ఎన్నెస్పీ ఇళ్లలో ఉంటున్న వారికే వాటిని కేటాయించి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చినా నెరవేరలేదు.


అభివృద్ధికి నోచుకోని రాచకొండ

చౌటుప్పల్‌, చౌటుప్పల్‌ టౌన్‌, చండూరు రూరల్‌: చౌటుప్పల్‌ పట్టణంలో డిగ్రీ కళాశాలను నెలరోజుల్లో ఏర్పా టు చేస్తామని 2018లో హామీ ఇవ్వగా, మూడేళ్లయినా అతీగతి లేదు. డిగ్రీ కళాశాల కోసం సీఎం కాన్వాయికి అడ్డుతగిలిన 21 మంది ఎస్‌ఎ్‌ఫఐ నాయకులపై నమోదు చేసిన కేసులతో వారు నేటికీ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. సీఎం కేసీఆర్‌ 2014 డిసెంబరు 15న రాచకొండ ప్రాంతం లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఫిలీంసిటీ, స్పోర్ట్స్‌ సిటీ, ఎయిర్‌ స్ర్టీప్‌ లాంటివి ఏర్పాటు చేస్తామని ప్రకటించినా హామీగానే మిగిలింది. ఏడేళ్లయినా వీటి అతీగతీ లేదు. రాచకొండ భూములను సాగుచేస్తున్న రైతులకు హక్కు కల్పిస్తామన్న హామీ, చండూరు మండలంలోని గట్టుప్పల్‌ను మండలంగా ఏర్పాటుచేస్తామన్న సీఎం హామీ నెరవేర లేదు.


పూర్తిస్థాయిలో పూర్తికాని డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు

సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో మొత్తం 6100 డబుల్‌బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తానని సీఎం కేసీఆర్‌ హామీ ఇవ్వగా, ఇప్పటి వరకు 412 మాత్రమే లబ్ధిదారులకు కేటాయించారు. మరో 372 ఇళ్లు పూర్తయినా నేటికీ కేటాయించకపోవడంతో లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. రూ.30కోట్లతో జిల్లా కేంద్రంలో ఫుడ్‌ప్రాసెసింగ్‌యూనిట్‌, డ్రైపోర్టు ఏర్పాటు హామీగానే మిగిలింది.


ప్రజాదర్బార్‌ ఎక్కడ?

హుజూర్‌నగర్‌: కుర్చీ వేసుకుని కూర్చొని పోడు సమస్యలు పరిష్కరిస్తానని, ప్రజాదర్బార్‌ నిర్వహించి ఇక్కడే జీవోలు జారీ చేయిస్తానని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదు. ఉప ఎన్నిక అనంతరం నిర్వహించిన కృతజ్ఞత సభలో రూ.100కోట్ల అభివృద్ధి పనులకు హామీ సీఎం హామీ ఇచ్చారు. సాగర్‌ ఎడమకాల్వ చివరి భూములకు నీరందించేందుకు లిఫ్ట్‌ ఏర్పాటుచేస్తామని హామీ ఇవ్వగా, పనులు నేటికీ ప్రారంభం కాలేదు. పట్టణంలో రూ.25కోట్లతో హుజూర్‌నగర్‌ రింగ్‌రోడ్డు పనులు, రూ.200కోట్లతో చేపట్టిన మోడల్‌ కాలనీ పనులు యథాతథంగా ఉన్నాయి. మోడల్‌కాలనీ ప్రస్తుతం డంపింగ్‌ యార్డ్‌గా మారింది. మెయిన్‌రోడ్డు పనులు వివాదాల్లో చిక్కుకుంది. ఏడీజే కోర్లు, పోలీస్‌ సబ్‌డివిజనల్‌ కార్యాలయం, పోడు భూముల సమస్య, మిషన్‌ భగీరథ పనులు, మండలానికి రూ.30లక్షలు, పంచాయతీలకు రూ.25లక్షలు, హుజూర్‌నగర్‌, నేరేడుచర్ల మునిసిపాలిటీలకు రూ.40కోట్ల పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. జాన్‌పాడ్‌, మట్టపల్లి పుణ్యక్షేత్రాల అభివృద్ధికి నిధులు మంజూరు కాలేదు. ప్రజాదర్బార్‌ ఊసే లేదు. సాగర్‌ కాల్వలకు లైనింగ్‌కు రూ.1200కోట్లు మంజూరు చేయగా అవి జీవోలకే పరిమితమయ్యాయి. ఐటీఐ కళాశాల అతీగతీ లేకుండా పోయింది.


ప్రతిపాదనలే లేవు..

తుంగతుర్తి, తిరుమలగిరి : నియోజకవర్గంలోని తిరుమలగిరిలో 2018లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో తుంగతుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 100పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తామని, వెలుగుపల్లి గ్రామంలోని రుద్రమ్మ చెర్వును రిజర్వాయర్‌గా మార్చుతామని సీఎం హామీ ఇచ్చారు. మూడేళ్లయినా ఇది అమలుకు నోచుకోక పోగా, కనీసం ప్రతిపాదనలు కూడా రూపొందించలేదు. తిరుమలగిరికి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల హామీ నెరవేరలేదు.



 అభివృద్ధికి నోచుకోని ఖిల్లా

భువనగిరిటౌన్‌: భువనగిరి పట్టణంలో ప్రధాన రహదారి విస్తరణకు రూ.25కోట్లు మంజూరు చేస్తూ పనులు చేపట్టాల్సిందిగా 2016లో కేసీఆర్‌ ఆర్‌అండ్‌బీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పలు సాంకేతిక కారణాలతో ఈ పనులు ప్రభుత్వశాఖల మధ్యమారి చివరికి పంచాయతీరాజ్‌శాఖకు అప్పగించారు. మొదటిదఫా రూ.15 కోట్లురాగా, ఇటీవలే పనులు ప్రారంభమయ్యాయి. భువనగిరి ఖిల్లాను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని, రోప్‌వే నిర్మిస్తామని ఇచ్చిన హామీ ప్రతిపాదనల దశదాటడం లేదు.


వాసాలమర్రి సంగతేంటో?

తుర్కపల్లి, యాదాద్రి రూరల్‌: వాసాలమర్రిని సీఎం కేసీఆర్‌ దత్తత తీసుకున్న జూన్‌ 22న గ్రామంలో పర్యటించి గ్రామస్థులతో సహపంక్తి భోజ నం చేశారు. గ్రామంలో అంతర్గత సీసీరోడ్లు, మురుగు కాల్వలు, 450 కుటుంబాలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని హామీ ఇవ్వగా ఇవి నెరవేరలేదు. కోతుల బెడద లేకుండా చేస్తామని, పంటపొలాల్లోకి అడవి పందు లు రాకుండా అటవీశాఖ భూముల చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయిస్తామ ని హామీ ఇచ్చారు. విద్యుత్‌ స్తంభాలు సరిచేస్తామన్నారు. పంచాయతీ నూతన భవనం, పాఠశాల భవనం, అంగన్‌వాడీ,హెల్త్‌ సెంటర్లకు నూతన భవనాలు నిర్మిస్తామన్నారు. కాగా, రూ.3కోట్లతో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పను లు కొనసాగుతున్నాయి. ఇళ్ల నిర్మాణానికి సర్వే చేస్తున్నారు. మహిళలు, యువకులకు ఉపాధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. లక్ష్మీనర్సింహ స్వామి దేవాలయానికి వెళ్లేందుకు రోడ్డు ఏర్పాటుచేశారు. 66దళిత కుటుంబాలకు బంధు పథకాన్ని, 16మంది బీడి కార్మికులకు పింఛ న్లు మంజూరు చేశారు. పంచాయతీకి రూ.25లక్షలు, భువనగిరి మునిసిపాలిటికీ రూ.1కోటి, మిగితా మునిసిపాలిటీలకు రూ.50లక్షల హామీకి ఈ ఏడాది జూలై నాటికి రూ.108.75కోట్లు మంజూరు చేశారు. ఇంకా చాలా పనులు పెండింగ్‌లో ఉన్నాయి. గుట్టలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, సీసీరోడ్లు నిర్మాణానికి హైదరాబాద్‌ జలమండలితో సర్వేతో నత్తనడకన కొనసాగుతోంది. ఆర్టీసీ డిపోను మూడు నెలల్లో పూర్తి చేయాలని చెప్పినా ఏడాదైనా పూర్తికా లేదు.


ముమ్మరంగా యాదాద్రి ఆలయ పనులు

యాదాద్రి టౌన్‌: సీఎం కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న యాదాద్రి నృసింహుడి ఆలయ నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రధానాల య శిల్పి పనులు తుది దశకు చేరుకోగా, ఉద్ఘాటనకు సైతం ముహూర్తం ఖరారైంది. కొండపైన విష్ణుపుష్కరి ణి, శివాలయం, తిరుమాఢ వీధులు, కొండచుట్టూ గ్రీన రీ, గండి చెరువు సుందరీకరణ, కొండచుట్టూ ఆరులేన్ల రింగురోడ్డు, కొండకింద స్వామివారి ఉచిత అన్న ప్రసాదాల భవనం, సత్యనారాయణస్వామివ్రత మండపం, కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, అంతర్గత రహదారులు, ప్రెసిడెన్షియల్‌ సూట్‌, రహదారుల విస్తరణ కొనసాగుతొంది. మొదటి ఘాట్‌రోడ్‌ విస్తరణ పనులు కొనసాగుతుండగా, దర్శన క్యూలైన్ల నిర్మాణం తుది దశకు చేరింది. రింగురోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు పరిహారంపై స్పష్టతనిచ్చి గండిచెరువు ప్రాంతంలో దుకాణాలు కట్టించి ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. నిర్వాసితులకు ప్లాట్లు కేటాయించిన అధికారులు, దుకాణాల నిర్మాణ పనులు చేస్తున్నారు. వచ్చే ఏడాది మా ర్చి 21న మహాసుదర్శన యాగ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - 2021-12-29T06:27:18+05:30 IST