సీఎం పర్యటనపై నిరాశ

ABN , First Publish Date - 2022-08-17T06:21:29+05:30 IST

అచ్యుతాపురం సెజ్‌లో జపాన్‌కు చెందిన ‘యోకోహామా’ కంపెనీ రూ.1,250 కోట్లతో ఏర్పాటుచేసిన టైర్ల కంపెనీని ప్రారంభించడానికి వచ్చిన సీఎం జగన్మోహన్‌రెడ్డిని కలవడానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో నిర్వాసితులు, స్థానిక వైసీపీ శ్రేణులు తీవ్రనిరాశ చెందారు.

సీఎం పర్యటనపై నిరాశ
అచ్యుతాపురం సెజ్‌లో ‘యోకోహామా’కు చెందిన టైర్ల కంపెనీ (ఏటీజీ)ని ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి

టైర్ల కంపెనీలోకి స్థానికులను అనుమతించని అధికారులు

పాసులున్న వారికి మాత్రమే ప్రవేశం

నిర్వాసితులతోపాటు వైసీపీ శ్రేణులు సైతం అసంతృప్తి

తమ సమస్యలపై మాట్లాడలేదని నిర్వాసితులు ఆవేదన


అచ్యుతాపురం రూరల్‌, ఆగస్టు 16: అచ్యుతాపురం సెజ్‌లో జపాన్‌కు చెందిన ‘యోకోహామా’ కంపెనీ రూ.1,250 కోట్లతో ఏర్పాటుచేసిన టైర్ల కంపెనీని ప్రారంభించడానికి వచ్చిన సీఎం జగన్మోహన్‌రెడ్డిని కలవడానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో నిర్వాసితులు, స్థానిక వైసీపీ శ్రేణులు తీవ్రనిరాశ చెందారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను తప్ప సాధారణ ప్రజలను కంపెనీ చుట్టుపక్కలకు కూడా రానివ్వలేదు. భారీ ఎత్తున మోహరించిన పోలీసు బలగాలు... పాస్‌లు వున్న వారిని మాత్రమే కంపెనీలోకి అనుమతించారు. కాగా టైర్ల కంపెనీని ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో సీఎం జగన్‌ తమ సమస్యలపై మాట్లాడతారని ఆశించామని, కానీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం తమను తీవ్ర నిరాశకు గురిచేసిందని సెజ్‌ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. 

సీఎం జగన్‌ రాక... పోక...

అచ్యుతాపురం సెజ్‌లో ‘యోకోహామా’ కంపెనీ ఏర్పాటు చేసిన టైర్ల తయారీ యూనిట్‌ ప్రారంభోత్సవానికి సీఎం జగన్మోహన్‌రెడ్డికి మంగళవారం ఉదయం 11.45 గంటలకు హెలికాప్టర్‌లో ఇక్కడకు చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రులు పీడిక రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు, పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ, అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ బి.సత్యవతి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ జె.సుభద్ర, ఎమ్మెల్యేలు యు.వి.రమణమూర్తిరాజు, గొల్ల బాబూరావు, పి.ఉమాశంకర్‌గణేశ్‌, అదీప్‌రాజ్‌, ఎలమంచిలి మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిల్లా రమాకుమారి, ఎమ్మెల్సీ మాధవ్‌, కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి, జేసీ కల్పనాకుమారి, ఎస్పీ గౌతమి శాలి తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం టైర్ల కంపెనీని ప్రారంభించి, వివిధ విభాగాలను పరిశీలించారు. కంపెనీ ఉత్పత్తి చేసిన టైర్‌ మీద సంతకం చేశారు. అనంతరం సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ వివిధ కంపెనీల విస్తరణ పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించిన అనంతరం సభలో ప్రసంగించారు. టైర్ల కంపెనీ ప్రతినిధులు విశ్వకర్మ విగ్రహాన్ని సీఎంకు బహూకరించారు. మధ్యాహ్నం 1.20 గంటలకు హెలికాప్టర్‌లో విశాఖ  బయలుదేరి వెళ్లారు.



Updated Date - 2022-08-17T06:21:29+05:30 IST