Kcr సర్కార్‎కు నిద్రపట్టకుండా చేస్తున్న కేంద్రం.. ఇంతకీ బీజేపీ ప్లాన్ ఏంటీ..!

ABN , First Publish Date - 2022-06-08T17:36:27+05:30 IST

తెలంగాణలో కేసీఆర్‌ సర్కారును అష్టదిగ్బంధం చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రయత్నిస్తోంది. కేంద్రంపై సమరశంఖం పూరించిన కేసీఆర్‌కు

Kcr సర్కార్‎కు నిద్రపట్టకుండా చేస్తున్న కేంద్రం.. ఇంతకీ బీజేపీ ప్లాన్ ఏంటీ..!

కేంద్రంలోని బీజేపీ సర్కారు తాను ఏమనుకుంటే అది చేయగలుగుతోంది. తన ప్రత్యర్థి పార్టీలు ఉన్న రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. అక్కడ ఆయా పార్టీలను ఇరుకునపెట్టేందుకు ఉన్న అవకాశాలను అన్నింటినీ ఉపయోగించుకుంటోంది. ఇందులో భాగంగా తెలంగాణలో టీఆర్‌ఎస్‌ సర్కారుకు పంచాయతీ నిధుల ద్వారా చుక్కలు చూపిస్తోంది. అసలే పుట్టెడు ఆర్థిక కష్టాలతో ఉన్న కేసీఆర్‌ సర్కారుకు పంచాయతీ నిధులు అందకుండా చేస్తోంది. దీనిపై సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తుంటే కేసీఆర్‌ మాత్రం రగిలిపోతున్నారు. ఇంతకీ బీజేపీ ప్లాన్‌ నెరవేరినా ఆ పార్టీకి ఈ నిర్ణయం ఎంతవరకు లాభిస్తుందో తెలియదు. దీనిపై మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..


పంచాయతీ నిధులు నేరుగా సర్పంచ్‌ల ఖాతాలోనే...

తెలంగాణలో కేసీఆర్‌ సర్కారును అష్టదిగ్బంధం చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రయత్నిస్తోంది. కేంద్రంపై సమరశంఖం పూరించిన కేసీఆర్‌కు ఊపిరాడకుండా చేసేందుకు బీజేపీ ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా పంచాయతీ నిధులు నేరుగా రాష్ట్రప్రభుత్వాల ఖజానాలో కాకుండా సర్పంచ్‌ల ఖాతాలోనే వేయాలని నిర్ణయించుకుంది. దీనిపై  సర్పంచులు ఖుషీగా ఉన్నారు. అయితే రాష్ట్రప్రభుత్వం ప్రమేయం లేకుండా నేరుగా నిధులు ఖాతాల్లో వేయడమేమిటని కేసీఆర్‌ ప్రశ్నిస్తున్నారు.   రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వదు.... పైగా ఇస్తామంటున్న కేంద్రాన్ని అడ్డుకోవడం పై సర్పంచులు రగిలి పోతున్నారు. అసలే   ఏడాదినుంచి  వివిధ రకాల బిల్లుల చెల్లింపులు నిలిచి పోవడం తో ఆర్థికంగా చితికి పోతున్న సర్పంచులు....కేసీఆర్ వైఖరిపై బహిరంగంగానే మండి పడుతున్నారు. ఇటీవల పల్లె ప్రగతి కార్యక్రమంపై నిర్మల్ లో జిల్లా స్థాయి  సదస్సును సర్పంచులు అడ్డుకున్నారు. సమావేశాన్ని బహిష్కరించి ఆందోళనకు దిగారు.ఈ పరిస్థితి అన్ని జిల్లా ల్లోనూ ఉంది. పార్టీలకతీతంగా సర్పంచులు రాష్ట్ర ప్రభుత్వం పై రగిలిపోతున్నారు.


తెలంగాణ సర్కార్ కు చుక్కలు చూపిస్తోన్న కేంద్రం

గత్తర లేపుతానని గంభీర ప్రకటన లు చేశారో...అప్పటి నుంచే  కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సర్కార్ కు చుక్కలు చూపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక మూలాలను కట్టడి చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా డైరెక్ట్ గా పంచాయతీ  ఖాతాల్లోనే నిధులు వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని పంచాయతీ ల్లో కొత్త ఖాతాలు ఓపెన్ చేశారు. నిజానికి కేంద్ర ప్రభుత్వం  ఇన్నాళ్లూ పంచాయతీ నిధులను రాష్ట్ర  ప్రభుత్వ పీడీ ఖాతాల్లో జమ చేస్తోంది. అక్కడి నుంచి  ట్రెజరీ ద్వారా  పంచాయతీ లు డ్రా చేసుకుంటున్నాయి. అయితే ఈ ప్రక్రియ ఓ ప్రహసనంలా మారింది. ఇతర అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల  నిధులను ఇష్టారాజ్యంగా వాడుకుంటోంది. ఇందు కోసం  ట్రెజరీ అకౌంట్స్ ను  తరచూ ఫ్రీజ్ చేస్తోంది. దీంతో పంచాయతీ ల్లో అభివృద్ధి పనులు సాగడం లేదు. పైగా కేంద్ర ప్రభుత్వమే నిధులు విడుదల చేయడం లేదన్న ప్రచారం చేస్తున్నారు.


సర్పంచులు, ఉపసర్పంచుల పేరిట కొత్త జాయింట్ అకౌంట్లు

తెలంగాణ లో మొత్తం 12,769 గ్రామ పంచాయతీలున్నాయి. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన గ్రామాలకు నిధులు కేటాయిస్తోంది. గ్రామంలోని ప్రతి  వ్యక్తికి రూ. 1,760  చొప్పున ఎంత జనాభా ఉంటే అంత మొత్తం ఇస్తోంది. దీనికి తోడు  వివిధ వనరుల ద్వారానూ పంచాయతీలకు నిధులు వస్తుంటాయి. ముఖ్యంగా స్టేట్ ఫైనాన్స్, సెంట్రల్ ఫైనాన్స్, సాధారణ పనులు, ట్యాక్స్,​ ఇసుక రీచ్ లు, ఇతర సహజ వనరుల ద్వారా వచ్చే ఆదాయం గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమవుతుంది. ఈ డబ్బును తిరిగి తీసుకొవాలంటే మాత్రం ట్రెజరీ ఆమోదం తప్పనిసరి. 


అప్పుల పాలై కొందరు సర్పంచుల ఆత్మహత్యలు

అయితే ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం  ఇతర అవసరాల కోసం  వాడుతూ సర్పంచులకు చుక్కలు చూపిస్తోంది. దీంతో  చేసిన పనులకు సకాలంలో బిల్లులు రాక పంచాయతీ పాలక వర్గాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నాయి. అప్పుల పాలై కొందరు సర్పంచులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.  ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పంచాయతీల సర్పంచులు, ఉపసర్పంచుల పేరిట కొత్త జాయింట్ అకౌంట్లు ఓపెన్ అయ్యాయి.


సైలెంట్‎గా కేసీఆర్ సర్కార్‎కు ధమ్కీలు 

దీంతో గ్రామాల్లో పనులు చేసిన వెంటనే బిల్లులు పొందే అవకాశాలున్నాయి.  ఉపాధి హామీ పథకం నిధులను కూడా కేంద్రం కట్టడి చేస్తోంది. 2నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం  లేకుండా... పూర్తి గా తమ ఆధీనంలో కి తీసుకుంది. దేశ వ్యాప్త పాలసీ అయినా ఆర్థికంగా పుట్టెడు కష్టాల్లో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు శరాఘాతంలా మారుతున్నాయి  మొత్తానికి కేంద్ర ప్రభుత్వం తో పాటు బీజేపీ అంతు చూస్తామని కేసీఆర్ రాష్ట్రాలను పట్టుకుని తిరిగుతుంటే.... కేంద్ర ప్రభుత్వం మాత్రం సైలెంట్ గా కేసీఆర్ సర్కార్ కు ధమ్కీ లు ఇస్తోంది. చివరికి టిఆర్ఎస్ పార్టీ సర్పంచులతోనే కేసీఆర్ ను తిట్టిస్తోంది.  

Updated Date - 2022-06-08T17:36:27+05:30 IST