
హైదరాబాద్/అమరావతి: ‘ప్రశాంత్ కిశోర్ (పీకే) టీమ్ 2022 మార్చి నుంచి ఏపీలో రంగంలోకి దిగుతుంది. ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాల అమలు, ప్రజాప్రతినిధుల పనితీరు వంటి అంశాలపై సమగ్ర సర్వే నిర్వహిస్తుంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మంత్రులకు చెప్పినట్లు తెలిసింది. వెలగపూడి సచివాలయంలో 39 అంశాలపై రాష్ట్ర కేబినెట్ చర్చించి ఆమోదించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అజెండా అంశాలు పూర్తయి.. అధికారులందరూ వెళ్లిపోయాక మంత్రులతో జగన్ మాట్లాడారు. పీకే బృందం రాష్ట్రమంతా పర్యటించి సమగ్ర సర్వే చేపడుతుందని ఆయన చెప్పడంతో మంత్రులు ఆశ్చర్యపోయారు. ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించింది. తాము వింటున్నది నిజమేనా? జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నారా.. అందుకే ముందుగానే పీకే టీమ్‌ను రంగంలోకి దించుతున్నారా అనే ప్రశ్నలు వారి మదిలోకి ప్రవేశించాయి. అంతలోనే ఈ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ సీఎం మాట్లాడడం ప్రారంభించారు. ‘ప్రభుత్వ పాలనపై సమగ్ర సర్వే చేయాలనుకుంటున్నాను. 2022 మార్చి నుంచి పీకే టీమ్ విస్తృతంగా పర్యటిస్తుంది. సంక్షేమ పథకాల అమలుపై ప్రజాభిప్రాయం సేకరిస్తుంది. ప్రధానంగా మంత్రులు, ప్రజాప్రతినిధుల పనితీరుపై వాకబు చేస్తుంది. ఈ సర్వే 2024 ఎన్నికలకు బాగా ఉపయోగపడుతుంది’ అని ముక్తాయించారు. 2024 మాట వినగానే.. మంత్రులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ.. ఇంత తొందరగా. ఇంత ముందస్తుగా ఈ విషయాన్ని ఆయన ఎందుకు ప్రకటించారోనన్న అనుమానాలు వారి మనసుల్లో అలాగే మిగిలాయి.
ఈ నేపథ్యంలో ‘‘మీ పథకాలు నవరత్నాలు. మీ నేతలు జాతి రత్నాలు. మీరు స్వయంప్రకటిత జననేత. రోజూ జగనన్న పేరుతో మోత. మళ్లీ ప్రశాంత్ కిషోర్ ఎందుకు జగనన్నా?. మీ పాలనపై మీకే నమ్మకం సన్నగిల్లిందా?. రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఇంకా ఏం మిగిలిందని?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.