కేరళ అసెంబ్లీలో సీఎం మామ.. ఎమ్మెల్యే అల్లుడు

ABN , First Publish Date - 2021-05-04T07:36:29+05:30 IST

కేరళ అసెంబ్లీలో సీఎం మామ.. ఎమ్మెల్యే అల్లుడు..! ఇప్పుడు ఇదే అంశంపై సోషల్‌ మీడియాలో మలయాళీలు పుంకానుపుంకాలుగా చర్చలు జరుపుతున్నారు...

కేరళ అసెంబ్లీలో సీఎం మామ.. ఎమ్మెల్యే అల్లుడు

  • పినరయి అల్లుడు మహమ్మద్‌ రియాజ్‌ విజయం
  • 20 ఏళ్ల తర్వాత మళ్లీ 11 మందితో అసెంబ్లీ కళకళ
  • కొన్ని చోట్లే తారల తళుక్కు 

తిరువనంతపురం, మే 3: కేరళ అసెంబ్లీలో సీఎం మామ.. ఎమ్మెల్యే అల్లుడు..! ఇప్పుడు ఇదే అంశంపై సోషల్‌ మీడియాలో మలయాళీలు పుంకానుపుంకాలుగా చర్చలు జరుపుతున్నారు. విషయమేంటంటే.. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కన్నూర్‌లోని తన స్వస్థలం ధర్మాదమ్‌ నియోజకవర్గం నుంచి 50 వేల పైచిలుకు ఆధిక్యంతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆయన కూతురు వీణ (బెంగళూరులో ఐటీ ప్రొఫెషనల్‌) భర్త పీఏ మహమ్మద్‌ రియాజ్‌ కూడా తాజా ఎన్నికల్లో వామపక్షాల కంచుకోట అయిన కోళిక్కోడ్‌ నుంచి విజయం సాధించారు. సాధారణంగా.. సీనియర్‌ నేతల కుమారులు, కూతుళ్లు రాజకీయాల్లోకి రావడం తెలిసిందే. కానీ, పినరయి విజయన్‌ తన అల్లుడిని ప్రోత్సహించి, అసెంబ్లీకి తీసుకొచ్చారు. కాగా.. రియాజ్‌ ప్రజాస్వామ్య యువజన సమాఖ్య(డీవైఎఫ్‌) జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. గత ఏడాది జూన్‌ 15న వీణ-రియా్‌సల మతాంతర వివాహాన్ని పినరయి విజయన్‌ తన అధికార నివాసం క్లిఫ్‌ హౌస్‌లో ఘనంగా జరిపించారు. 2009లో కూడా రియాజ్‌ కోళిక్కోడ్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసినా.. విజయం సాధించలేకపోయారు. అయితే.. ఈ ఎన్నికల్లో 20 మంది వరకు సీనియర్‌ నేతలు తమ పుత్రరత్నాలు, కుమార్తెలను బరిలోకి దింపినా.. వారెవరూ రాణించలేకపోయారు.


మహిళలకు ప్రాతినిధ్యం

ఈ సారి కేరళ అసెంబ్లీలో 11 మంది మహిళా ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిలో 10 మంది అధికార ఎల్‌డీఎఫ్‌ కూటమికి చెందినవారు. మిగతా వారిలో కె.కె.రెమా విప్లవ మార్కిస్టు పార్టీ(ఆర్‌ఎంపీ) తరఫున వదకారా నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించారు. ఆమె భర్త టీపీ చంద్రశేఖరన్‌ 2012లో రాజకీయ హత్యకు గురయ్యారు. ఆ సానుభూతితో వదకారా ప్రజలు ఆమెకు అఖండ విజయాన్ని అందించారు. ఈ ఎన్నికల్లో వేర్వేరు పార్టీల తరఫున 103 మంది మహిళలు పోటీ చేయగా.. 11 మంది మాత్రమే అసెంబ్లీకి వెళ్తున్నారు. 2001లో కూడా 11 మంది మహిళలు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించారు.  మోలివుడ్‌కు చెందిన ప్రముఖులు ఈ ఎన్నికల్లో పోటీ చేసినా.. చాలా వరకు వారికి ఆదరణ కరువైంది. నటులు ముఖేశ్‌, కె.బి.గణేశ్‌కుమార్‌, మణి కప్పన్‌, నేపథ్య గాయిని దలీమా జోజోలు మాత్రమే విజయం సాధించారు. రాజ్యసభ సభ్యుడు, నటుడు సురేశ్‌గోపీ నటులు ధర్మాంజన్‌ బోల్గాట్టి, ప్రియాంక అనూప్‌, కృష్ణకుమార్‌ ఓడిపోయారు. 


Updated Date - 2021-05-04T07:36:29+05:30 IST